పోలవరం’పై శ్వేతపత్రం ఎందుకు?

chandrababu naidu on polavarm project - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్న

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటిదాకా చేసిన పనులకు గాను కేంద్రం నుంచి ఇంకా రూ.3,000 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులకు ‘పునరావాస చట్టం–2013’ అడ్డం వచ్చిందని, ఆ చట్టం ప్రకారం గిరిజనులకు న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు.

ప్రాజెక్టు ఖర్చు రెండింతలు పెరిగితే, పునరావాస వ్యయం 10 రెట్లు పెరిగిందన్నారు. అందుకే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం నిధులు ఇస్తే త్వరగా పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 51.5 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, ఇక శ్వేతపత్రం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రాజెక్టు వివరాలు తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం పంపించిందని, వారితో తాను కూడా చర్చిస్తానని అన్నారు. సోమవారం పోలవరం సందర్శనకు వెళుతున్నానని చెప్పారు. కాగా సీఎం తన కొరియా పర్యటన గూర్చి మాట్లాడుతూ పెట్టుబడులు రాబట్టడమే ధ్యేయంగా సాగిందన్నారు. రెండు ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు.

Back to Top