బాబు గారి చెరలో ఉన్న.. మా భూములిప్పించండి!

మా భూములు ఇప్పించండంటూ పట్టాలు చూపుతున్న లబ్ధిదారులు - Sakshi


 నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలి గ్రామసభలో అధికారులను నిలదీసిన లబ్ధిదారులు

 అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్న టీడీపీ అధినేత

 బినామీ పేర్లతో కొన్న భూమిలో కలిపేసుకుని తోటల పెంపకం

 మా భూమి చూపండని పట్టాలతో 9ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న గిరిజనులు


 

 సాక్షి, నెల్లూరు/ బాలాయపల్లి,న్యూస్‌లైన్: తొమ్మిదేళ్లుగా భూమిని చూపించండంటూ ప్రాథేయపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలిలో అసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బినామీలు ఆ భూములను ఆక్రమించుకోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. తమ భూములను తమకు స్వాధీనం చేయాలంటూ  మంగళవారం నిండలిలో గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు. లబ్ధిదారులు గట్టిగా అడగడంతో సర్వేయర్‌ను పిలిపించి వారం లోపల భూములు చూపిస్తామంటూ రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.





 

 ఇంతకీ విషయమేమిటంటే: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలిలోని  సర్వే నెం. 135,137,138, 139లలో టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడుకు చెందిన 420 ఎకరాల భూమి ఉంది. 1984లో చంద్రబాబు బినామీ పేర్లతో ఈ భూములను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి చంద్రబాబు సమీప బంధువులైన సుచిత్రమ్మ, మురళీనాయుడు, చంద్రబాబు తదితరుల పేర్లతో ఉన్నాయి. ఆ భూములను ఆనుకుని ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. బాబు బినామీలు దానినీ ఆక్రమించుకుని పండ్ల తోటలు పెంచుతున్నారు. ఆ అసైన్డ్ భూమిలోని 139/8 బీలో 1 నుంచి 18 సర్వే నంబర్ల వరకు ఉన్న భూమిలో 1998లో అంబలపూడికి చెందిన 18 మంది గిరిజనులకు ఒక్కొక్కరికి 77 సెంట్ల చొప్పున ప్రభుత్వం పట్టాలిచ్చింది. కానీ భూములను మాత్రం స్వాధీనం చేయలేదు. చంద్రబాబు బినామీలు అప్పటికే ఆ భూములను తమ స్వాధీనంలోకి తెచ్చుకుని, పండ్లతోటలు పెంచుతున్నారు. చివరకు 2001లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకిచ్చిన పట్టాలను కూడా అధికారులు రద్దు చేశారు. అవే కాకుండా కొత్త చెరువు పొరంబోకు భూములు, అన్నప్పగుంట, కాలప్పగుంట, వరవ కాలువలకు చెందిన దాదాపు 28 ఎకరాలకు పైగా భూములను చంద్రబాబు బినామీలు ఆక్రమించి వాటిల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతకు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు ఆ భూముల జోలికి వెళ్లేందుకు జంకుతున్నారు.

 

 వైఎస్ హయాంలో పట్టాలు: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 డిసెంబర్ 14వ తేదిన 18 మంది గిరిజనులకు 77 సెంట్ల చొప్పున 139/8బి 1 నుంచి 18 వరకు సర్వే నెంబర్లలో ఉన్న భూమిపై పట్టాలిచ్చారు. కానీ అధికారులు భూములను లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు. చంద్రబాబు బినామీలే ఆ భూములను ఆక్రమించి అనుభవిస్తుండడంతో అధికారులు చేసేది లేక మిన్నకుండి పోయారు. ఇప్పటికీ ఆ భూముల కోసం లబ్దిదారులు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం నెలకు చూపిస్తాం..వారానికి చూపిస్తాం అంటూ వారిని మభ్య పెడుతున్నారు. పట్టాలు చేత పట్టుకుని తొమ్మిదేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు.

 

 బాబుతోట మా పాలిట శాపం

 

 చంద్రబాబు నాయుడు తోట మా పాలిట శాపంగా మారింది. 9 ఏళ్లక్రితం సర్వే నంబరు139/8 బి16లో 77 సెంట్ల భూమికి పట్టా ఇచ్చారు. జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా ఇంత వరకు ఆ భూమి చూపలేదు.  -అల్లం విజయమ్మ, నిండలి

 

 మా భూములపైనే బాబు కన్ను పడాలా

 

 కూలికి పనికి పోతేనే మాకు పూట గడుస్తుంది. మాకు ఇచ్చిన భూములపైనే చంద్రబాబు నాయుడు కన్నుపడింది. వాటిని ఆయన బంధువులకు ఇచ్చేశాడు. అధికారులు మాకు న్యాయం చేయాలి.    - కోడూరు రమణమ్మ, నిండలి

 

 పేరుకే పట్టాలు

 

 పేరుకు మాత్రమే ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది. భూములను మాత్రం చూపలేదు. అడిగితే బెదిరిస్తున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.     - తిరుమలశెట్టి పద్మమ్మ, నిండలి

 

 సర్వేయర్ లేరు, త్వరలో పరిష్కరిస్తాం

 

 మండలంలో సర్వేయర్ లేకపోవడం సమస్యగా ఉంది. సర్వే నంబర్ 139లో ఉన్న భూముల్లో త్వరలోనే సర్వే నిర్వహించి లబ్ధిదారులకు భూములకు చూపుతాం.    - పూర్ణచంద్రరావు, తహశీల్దార్, బాలాయపల్లి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top