టికెట్‌ పరీక్ష

Chandrababu Naidu No Clarity On Tirupati Ticket - Sakshi

అస్వస్థతకు గురైన     చిత్తూరు ఎమ్మెల్యే

అమరావతిలో  నగరి తమ్ముళ్ల బాహాబాహీ

అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు అభిప్రాయ సేకరణ

మండలాలు.. వార్డుల వారీగా ఆశావహుల వివరాలు

ఆ తర్వాత ఒక్కొక్కరి     అభిప్రాయం తీసుకుంటున్న వైనం

మాట్లాడిన వారినే మళ్లీ మళ్లీ పిలిపించుకుంటున్న     అధిష్టానం

అడిగిందే అడుగుతూ విసిగిస్తున్నారంటూ కార్యకర్తల అసహనం

నాన్చివేత ధోరణిలో టీడీపీ అధిష్టానం.. ఆశావహుల్లో అసంతృప్తి

సాక్షి, తిరుపతి : ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయ సేకరణ, రకరకాల సర్వేలు చేయించుకుంటూ నాయకులు, కార్యకర్తలను తరచూ అమరావతికి పిలిపించుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో టికెట్లు ఆశిస్తున్న వారిని పిలిపించుకున్నారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల ముఖ్యమైన వారితోనూ చర్చించారు. అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ఆశావహులు ఆశించారు. చివరకు ఎవరికీ స్పష్టత ఇవ్వకుండా వెనక్కు పంపేసిన విషయం తెలిసిందే. తాజాగా చిత్తూరు పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్‌ ఆశిస్తున్న వారిని, నాయకులు, కార్యకర్తలను అమరావతికి పిలిపించుకున్నారు. సోమవారం రాత్రే అమరావతికి వెళ్లిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు మంగళవారం రాత్రి వరకు మాట్లాడే అవకాశమివ్వలేదు.

మధ్యలో పరిశీలకులు మాత్రం నియోజకవర్గాల వారీగా ఒక్కొక్కరిని పిలిపించి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అభ్యర్థిత్వంపై టీడీపీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘చిత్తూరులో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది సర్‌. సెకండ్‌ క్యాడర్‌ అనేదే లేకుండా చేశారావిడ. ఏ కార్యకర్తకు ఏం చేశారో చెప్పమనండి చూద్దాం. పార్టీ కోలుకోవడానికి మరో పదేళ్లు పడతాది. అందుకే మన కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలోకి పోయినారు. ఈసారి టికెట్టును కాజూరు బాలాజీకి ఇస్తే మంచిది’’ అంటూ టీడీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, నాయకులు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇక ఎమ్మెల్యేకు మద్దతుగా కూడా పలువురు కార్పొరేటర్లు గొంతువిప్పినట్లు తెలుస్తోంది. ‘కొంతమంది పార్టీ నాయకులకు ఎమ్మెల్యే దగ్గర ఉండే డబ్బు కావాలి. ఆమె పేరు వాడుకుని అవినీతి చేస్తా ఉండారు. కార్పొరేటర్లు పార్టీ మారడానికి టీడీపీ నేతలే కారణం. అమ్మకు తప్ప ఎవరికి టికెట్టు ఇచ్చినా మేము చేయం’ అని చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్‌ విషయం ఎటూ తేల్చకపోవటంతో ఎమ్మెల్యే సత్యప్రభ మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నగరి తమ్ముళ్ల బాహాబాహీ..
నగరి అభ్యర్థి ఎంపిక కోసం గాలి ముద్దుకృష్ణమ నాయుడు భార్య ఎమ్మెల్సీ సరస్వతమ్మ, కుమారుడు గాలి భాను, అశోక్‌రాజుతో పాటు మండలాలు, మున్సిపాలిటీల్లోని నాయకులు, కార్యకర్తలను సీఎం చంద్రబాబు అమరావతికి పిలిపించుకున్నారు. వారితో పరిశీలకులు సమావేశమయ్యారు. ఓ వర్గం వారు గాలి భానుకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ సరస్వతమ్మ వర్గీయులు భాను అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల వారు కుర్చీలతో బాహాబాహీకి దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో టీడీపీ కార్యాలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని వెలుపలకు పంపేసి పది మందిని చొప్పున పిలిపించుకుని మంగళవారం రాత్రి చర్చించారు. మూకుమ్మడిగా చర్చలయ్యాక తిరిగి ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది. అభిప్రాయ సేకరణలో గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగినట్లు టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. నగరి అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పటికే మూడుసార్లు మాట్లాడినట్లు టీడీపీ శ్రేణులు వెల్ల డించాయి. ఇదిలావుండగా నగరి నియోజకవర్గం టీడీపీ టికెట్‌ రేసులో ఉన్న అశోక్‌ రాజు, గాలి భానును పక్కనపెట్టి మాజీ ఎమ్మెల్సీ జయచంద్రనాయు డు కుమారుడు కె.కల్యాణ చక్రవర్తి పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతికి రమ్మని పిలుపురావడంతో జయచంద్రనాయుడు మంగళవారం బయలుదేరి వెళ్లారు. పూతలపట్టు, గంగాధరనెల్లూరు టికెట్‌ ఆశిస్తు న్న వారు అమరావతిలో సీఎం, పరిశీలకుల పిలుపు కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top