చలో 'పోల్‌'వరం!

Chandrababu Naidu Missuse APS RTC on Polavaram Project Tour - Sakshi

సమస్యలు పక్కన పెట్టి పోలవరం సందర్శన  డ్రామా..!

రూ.కోట్లు దుబారా నిర్వాసితులకు మొండిచేయి

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఊసేలేదు ఇప్పటికే నష్టాల్లో ఆర్టీసీ

అయినా వందలాది   బస్సులు సందర్శనకు..

ఇదంతా  ఎన్నికల  స్టంటే ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు పాట్లు

అవసరమైన  చోట కాకుండా అనవసరమైన చోట కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూప్రభుత్వం దుబారా చేస్తోంది. పోలవరం  నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారం కోసం కళ్ళుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని వదిలేసి అనవసర వ్యయంతోప్రచార ఆర్భాటానికి తెరలేపింది. రైతుల పోలవరం సందర్శన పేరుతో రూ.కోట్లు తగలేస్తోంది. ఇదంతాఎన్నికల్లో ఓట్ల రాజకీయం కోసమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పశ్చిమగోదావరి, వేలేరుపాడు: ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని అయిన పోలవరం  ప్రాజెక్ట్‌ వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు మాత్రం శాపమే. అయినా ప్రాజెక్టును ఈ మండలాల ప్రజలు వ్యతిరేకించడం లేదు. తమ విలువైన భూములను ప్రాజెక్టు కోసం త్యాగం చేశారు. అయితే తమకు న్యాయం చేయాలని, తాము కోరుకున్న చోట జీవించే స్వేచ్ఛ కల్పించాలని సర్కారును  కోరుతున్నారు. కానీ నిర్వాసితులకు అందాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూనష్ట పరిహారం విషయంలో ప్రభుత్వం పరిహాసమాడుతోంది.

ప్రభుత్వ పథకాల నిలిపివేత
ఈ రెండు మండలాల్లో 29,545 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నిర్వాసితులను కనీసం  మనుషుల్లా కూడా ప్రభుత్వం  చూడటంలేదు. ముంపు పేరుతో అనేక ప్రభుత్వ  పథకాలను నిలిపివేసింది.   నిర్వాసిత రైతులకు నేటికీ భూనష్టపరిహారం అందించలేదు. భూసేకరణలో అనేక అక్రమాలూ చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మండలాల నిర్వాసితులకు  మాయమాటలు చెప్పి   అధికారులు పోలవరం ప్రాజెక్ట్‌  సందర్శన పేరుతో విహారానికి తీసుకెళ్తున్నారు. ఆ మాటలు విని నిర్వాసితులు  సందర్శనలకు  వెళ్తున్నారు.   ప్రాజెక్ట్‌ సందర్శనకు రాకుంటే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రాదంటూ కొందరు ముంపు ప్రాంతవాసులను   బెదిరిస్తుండటంతో ఇష్టంలేకపోయినా   బస్సులు ఎక్కుతున్నారు. 

ఆర్టీసీకి సందర్శన  గుదిబండే
అసలే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి  పోలవరం సందర్శన గుదిబండగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్ట్‌ సందర్శన పేరుతో 13 జిల్లాల్లో  ఉన్న 128  ఆర్టీసీ డిపోల  బస్సులు  ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఆర్టీసీ డిపో  నెలకు 300 బస్సులు పంపుతోంది. పల్లె వెలుగు బస్సులకైతే కిలోమీటరుకు రూ.41  చెల్లిస్తుండగా, ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు రూ.52 చెల్లిస్తున్నారు. ఏ బస్సుకైనా రోజుకు 15,000 ఆర్టీసీకి  అద్దె చెల్లించాల్సిందే. మన జిల్లాలో ఉన్న 8 డిపోల బస్సులనూ పోలవరం సందర్శనలకే వినియోగిస్తున్నారు. ఒక్క జంగారెడ్డిగూడెం డిపో నుంచే రోజుకు 15 నుంచి 18 బస్సులు ఈ సందర్శనకు తిరుగుతున్నాయి. రోజుకు సుమారు 250 నుంచి 300 బస్సుల వరకు  పోలవరం సందర్శనకు వస్తున్నాయి. ఇప్పటి వరకు పదివేల బస్సుల్లో సుమారు రూ.6 లక్షల  వరకు సందర్శకులను తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. వీరికోసం కేవలం బస్సులకే  సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు  లెక్కలు చెబుతున్నాయి.  ఒక పక్క  సమ్మెబాటలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. రెండేళ్ల క్రితం వారికి పీఆర్సీ ఇవ్వాలి. దీనిని నిరసిస్తూ..  ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేస్తున్నట్లు వారు  ప్రభుత్వానికి నోటీసులూ పంపారు. పలుమార్లు చర్చలు జరిపినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ స్పష్ట మైన హామీ ఇవ్వడంలేదు. ఇదిలా ఉండగానే బస్సులను పోలవరం సందర్శన ప్రచారానికి వాడుకోవడం గమనార్హం.

మంత్రి సహచరుడికే భోజనాల కాంట్రాక్ట్‌
రోజుకు 250 నుంచి 300 బస్సుల్లో తరలి వచ్చిన సందర్శకులకు భోజనం పేరుతో అధికారపార్టీ నేతలు రూ.కోట్లు దోచుకుంటున్నారు. సాక్ష్యాత్తు భారీనీటి పారుదల శాఖమంత్రి సహచరుడికే పోలవరం సందర్శనకు వచ్చే ప్రజలకు  భోజనాలు ఏర్పాటు చేసే  కాంట్రాక్టును అప్పగించారు. ఈ కాంట్రాక్టర్‌కు  ఒక్కొక్క భోజనానికి రూ.125  టిఫిన్‌కు రూ. 75  బిల్లులు ప్రభుత్వం  చెల్లిస్తోంది. రోజూ 6వేల నుంచి ఎనిమిదివేల  మంది వరకు సందర్శకులు వస్తున్నారు. దీనిని బట్టి ఒకొక్కరికి రూ.200 చొప్పున రోజుకు సుమారు రూ.16లక్షలు  ఖర్చవుతోంది. ఇలా ఇప్పటివరకు రూ.30 కోట్లు వెచ్చించారు.

ముంపు నిర్వాసితులకు మొండిచెయ్యి
ఒక పక్క నిర్వాసితులు సవాలక్ష సమస్యలతో సతమవుతుండగా, వారి సమస్యల æగురించి  ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  ఈ రెండు మండలాల్లో  గత ఏడాది ఆగస్టులో వచ్చిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. ఇది జరిగి ఐదునెలలు దాటుతున్నా మరమ్మతులు చేపట్టడంలేదు. రెండు గిరిజన గ్రామాలు పెదవాగు ప్రవాహానికి కొట్టుకుపోయినా   నేటికీ  పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. కనీసం సామాన్యుడు ఇల్లు నిర్మించుకోవడానికి ఇసుక, మట్టి తోలుకోవాలన్నా మైనింగ్‌ అనుమతి కావాలంటున్నారు. అదే పోలవరం కాలనీలు నిర్మించుకునే కాంట్రాక్టర్లకు మాత్రం అన్ని అనుమతులూ ఇస్తున్నారు. కుక్కునూరు మండలం దాచారం నుంచి కుక్కునూరు వరకు రహదారి నిర్మాణానికి ఇటీవల  రూ.మూడున్నర కోట్లు మంజూరయ్యాయి. దాచారం గ్రామం 41.15 ప్రాజెక్ట్‌ కాంటూర్‌ లెవల్‌కు  మూడోదశ ముంపులో ఉంది. ఈ గ్రామం అప్పుడే మునగదు. రెండు దశలు గ్రామాలు ఖాళీ చేశాక, మూడో దశలో  దాచారం ఖాళీ చేయాల్సి  ఉంది. మరి నివాసమున్నంత కాలం రహదారి ఉండకూడదనో ఏమో అధికారులు ముంపుప్రాంతం అంటూ పనులు నిలిపివేశారు. ప్రభుత్వం దుబారా చేసే దాంట్లో  ఇది ఒక లెక్కకాదు. ఇలాంటి ప్రధాన సమస్యలుæ పట్టించుకోని ప్రభుత్వం పోలవరం సందర్శన  పేరుతో తన మందీమార్బలానికి రూ.కోట్లు దోచిపెడుతోంది. 

ఇదంతా  ఎన్నికల  స్టంటే!
ప్రభుత్వం ఎన్నికల కోసమే పోలవరం ప్రాజెక్టును వాడుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. నిర్వాసితులకు న్యాయం చేయకుండా వారిని బాధ పెడుతూ  ప్రచారార్భాటం కోసం రూ.కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది.  విలీన మండలాల్లో ఇప్పటి వరకు ఆర్‌అండ్‌ఆర్‌ తుది జాబితానే ప్రకటించలేదు. దీనికి తోడు బస్సుల్లో  సందర్శకులను ఎక్కించే బాధ్యతను ఆయా ప్రాంతాల టీడీపీ నేతలకే సర్కారు అప్పగిస్తోంది.  గతంలో శ్రీశైలం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు నిర్మించిన పాలకులు ఇలాంటి సందర్శనలు పెట్టలేదు. ఎక్కడైనా ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయ్యాక చూపిస్తారు. లేకుంటే ఇష్టమైతే ప్రజలే స్వచ్ఛందంగా వెళ్తారు.  కానీ పోలవరం పూర్తికాకుండానే  ఓట్లు   కొల్లగొట్టడం కోసం ప్రభుత్వం  దుబారా ఖర్చుచేస్తోంది.

నిర్వాసితుల  కష్టాలు కనపడట్లేదా?
వేలేరుపాడు మండలంలో నిర్వాసితులు  సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం కళ్లకు కనబడటం లేదు. ముంపులో ఉన్న మండలాల్లో  వైద్యాధికారుల పోస్టులు భర్తీ చేయడంలేదు.  కనీసం గ్రామాల్లో రహదారులు నిర్మించడంలేదు. రైతులకు పవర్‌  స్ప్రేయర్లూ ఇవ్వడం లేదు.  పోలవరం  సందర్శనకు మాత్రం  రూకోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం?– సున్నం వెంకటేశ్వర్లు, కొయిదా వేలేరుపాడు మండలం

మా త్యాగాలను విస్మరిస్తున్నారు
మమ్మల్ని త్యాగధనులన్నారు.. కానీ మా సమస్యలు పట్టించుకోవడంలేదు.  ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని  మభ్యపెడుతూ ప్రభుత్వం మా జీవితాలతో ఆటలాడుకుంటోంది.  ఇప్పటికీ ఆర్‌అండ్‌ఆర్‌ తుది జాబితా ప్రకటించలేదు. ఆన్‌లైన్‌లో జాబితా పెట్టాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ ప్రకటించలేదు.  నిర్వాసితులకు నిధులు లేవంటూ సందర్శనలకు రూ.కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారు.
– కారం దారయ్య, కన్నాయిగుట్ట వేలేరుపాడు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top