మళ్లీ పత్రాలేంటి బాబూ...!

chandrababu naidu government distributing bonds again for loan waiver

మహారాజ శ్రీ సీఎం చంద్రబాబునాయుడిగారికి జిల్లా రైతాంగం రాసుకున్న విన్నపమేనగా...

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు : ఆయ్యా మీరు ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. సంతోషపడ్డాం. ఓట్లు వేసి గెలిపించాం.  రైతు రుణమాఫీకి వైఎస్‌ మాదిరే మొదటి సంతకం కాకపోయినా ఎందో సంతకం చేస్తే చాలనుకున్నాం. కానీ మా ఆశలు నిరాశే అయ్యాయి.   జిల్లాలో దాదాపు ఏడులక్షల మంది రైతులుండగా వీరిలో ఆరు లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. వీరందరూ రుణమాఫీ అవుతుందని ఆశించారు. తీరా మాఫీ ప్రకటించే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టారు.   చివరకు కుటుంబానికి రూ.1.50లక్షలు మాత్రమే మాఫీ అన్నారు. దీంతో ఒకసారిగా రెండు లక్షల మంది అనర్హులయ్యారు. ఆన్‌లైన్‌లో పేర్లు లేవని, పత్రాలు అందించాలని... ఇలా ఎన్ని పర్యాయాలు కార్యాలయాల చుట్టూ్ట తిరిగామో దేవుడికి తెలుసు. ఇంత జరిగినా డబ్బులు వచ్చాయా అంటే లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత మొదటి విడత వేశారు. అప్పటికే రుణాలను రెన్యూవల్‌ చేయకపోవడంతో చాలా మంది డిఫాల్టర్స్‌గా మారారు. వడ్డీలు పెరిగి పోయాయి. చావు కబురు చల్లగా చెప్పినట్లు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అపసోపాలు పడి మొదటి విడతను ఏడాదిన్నరకు అందించారు. మొదటి విడతలో కేవలం 3.52 లక్షల మంది రైతులకు రూ.463 కోట్లు అందించారు. ఒక్కో రైతుకు సగటున రూ.13 వేలు అందాయి. అది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి.
 
రెండో విడత ప్రహసనమే..
రెండో విడతకొస్తే తీరా ఏడాది కిందట రైతులకు బాండ్లు అందిస్తున్నాం. వీటిని తీసుకుంటే రుణమాఫీ అని అన్నారు. బాండ్లను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంపిణీ చేస్తామనడంతో  అక్కడ క్యూ కట్టాల్సి వచ్చింది. తీరా బాండ్లు పొందాక వాటిని రుణాలున్న అన్ని బ్యాంకుల్లో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బాండు జెరాక్స్‌ పత్రాలను అందించాలని సూచించారు. కొన్ని బ్యాంకుల్లో రూ. వంద కూడా రుణమాఫీ అయిందంటే మీ హామీ ఎంత మేర సఫలమైందో మీరే ఆలోచించుకోవాలి.  ఈ ఏడాది రుణమాఫీతో 2.54లక్షల మందికి రూ.206 కోట్లు ఇచ్చామన్నా ఒక్కో రైతుకు వచ్చింది రూ.ఎనిమిది వేలు మాత్రమే.

మళ్లీ బాండ్లా..!
గతేడాది బాండ్‌ తీసుకునే సమయంలో ఈ బాండ్‌ను దాచుకోవాలి. నాలుగేళ్లకు ఇదే బాండు వర్తిస్తుందని, పోతే రుణమాఫీ రాదని చెప్పారు కదా. గత నెల మొదటి వారం రుణమాఫీ నగదు ఇస్తామని అన్నారు. తరువాత పదిహేనో తేదీ వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. బ్యాంకర్లు మళ్లీ పత్రాలు ఇవ్వమని చెప్పడంతో ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం, బాండు జెరాక్స్‌ కాపీలను అందించాం. నెల చివరలో వేస్తామని చెప్పారు.  ప్రస్తుతం మరో దఫా పత్రాలు ఇస్తామంటున్నారు. మళ్లీ డబ్బులు ఖాతాల్లోకి ఎన్నాళ్లకు పడతాయో చెప్పలేని పరిస్థితి. ఇకనైనా రుణమాఫీ పేరు చెప్పి పబ్బం గడుపుకుందామనుకునే ప్రకటనలు చాలించి వెంటనే నగదును రైతు ఖాతాల్లో వేస్తే మంచిది.
ఇట్లు

కడప జిల్లా రైతాంగం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top