నాలుగేళ్ల 'చంద్రమామ' కథలు

Chandrababu Naidu Cheat With Schemes In AP People - Sakshi

హామీలతో సీఎం చంద్రబాబు మాటల గారడీ

నాలుగేళ్లలో 62 సార్లు జిల్లాకు వచ్చిన బాబు

వచ్చినప్పుడల్లా మోసపూరిత హామీలు

ఇప్పటి వరకు కార్యరూపం దాల్చని వాగ్దానాలు

ఆచరణ సాధ్యం కాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ తర్వాత కూడా తన పంథాను వీడడం లేదు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ జిల్లాకు అత్యధిక హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 62 సార్లు పర్యటించారు. వచ్చినప్పుడల్లా మోసపూరిత వాగ్దానాలు ఇస్తూనే ఉన్నారు. మాటల గారడీతో ప్రజలను ఏమారుస్తూనే ఉన్నారు.  ఈ నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అందరూ బలంగా విశ్వసిస్తున్నారు. నాలుగేళ్లలో అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో మీరే చదవండి.

సాక్షి, విశాఖపట్నం : కోతలరాయుడి మాటల గారడీ ఇదీ..
2014 సెప్టెంబర్‌ 29న మధురవాడ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిగ్నేచర్‌ టవర్స్‌ నిర్మిస్తామని, దశల వారీగా 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచు తామని ప్రకటించారు. ఈ టవర్స్‌కు 2015 జనవరిలో శంకుస్థాపన చేస్తానన్నారు. కాగా ఇటీవలే శంకుస్థాపన చేశారు.
హుద్‌హుద్‌ సమయంలో 2014 అక్టోబర్‌ 13 నుంచి 17 వరకు విశాఖలోనే చంద్రబాబు మకాం వేశారు. నగరానికి అండర్‌ గౌండ్‌ కా మన్‌ డెక్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, 10 వేల మందికి సరిపడా ఐటీ టౌన్‌ షిప్‌ను ఇన్ఫోసిస్‌తో కలసి నిర్మిస్తామని చెప్పారు. రెండేళ్లలో మెట్రో రైల్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఏ ఒక్కటీ అమలు కాలేదు.
బీచ్‌రోడ్‌లో 2014 నవంబర్‌ 17న జరిగిన హుద్‌హుద్‌ పునరంకిత సభలో బర్డ్స్‌ పార్కు, బొటానికల్‌ గార్డెన్, ఓషన్‌ రివర్, బీచ్‌ రిసా ర్ట్స్, సైన్స్‌ సిటీలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పాడేరు సర్క్యూట్‌ ద్వారా అరకు, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్, ఇంటర్నేషన్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఎగ్జిబిషన్‌ సెంటర్, ఇంటర్నేషనల్‌ çహోటల్స్‌ వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. లాజిస్టిక్‌ హబ్‌గా విశాఖను తీర్చిద్దడంలో భాగంగా ఐటీ పార్కు కోసం టెండర్లు పి లుస్తున్నామన్నారు. విశాఖలో ఉన్న రెండు పోర్టులకు అదనంగా మరో డీప్‌ వాటర్‌ పోర్టు ను తీసుకొస్తామని, వుడా స్థానంలో వీఎండీఏ ఏర్పాటు చేస్తామన్నారు. లాజిస్టిక్‌ పార్కు, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, అండర్‌ గ్రౌం డ్‌ కేబుల్‌ వ్యవస్థ పనులు మొదలయ్యాయి. మిగిలిన హామీలు అమలుకాలేదు. వుడా పేరును ఇటీవల వీఎండీఏగా మార్చారు.

2014 డిసెంబర్‌ 10న సబ్బవరం మండలం ఆరిపాకలో జరిగిన జన్మభూమి మా ఊరులో  సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సబ్బవరంలో 700 ఎకరాల ప్రభుత్వ భూమిలో భారీ పరిశ్రమ లేదా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తానన్నారు. ఆ జాడే లేదు.
2014 డిసెంబర్‌ 17న పారిశ్రామిక సంస్థల సీఈవోల సదస్సులో భీమిలి–కాకినాడ కారిడార్‌ పొడవున తీర రహదారిని నిర్మిస్తామని, విశాఖ బీచ్‌ను చెన్నై మెరీనా బీచ్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని, భీమిలి నుంచి విశాఖపట్నం పోర్టు వరకు రూ.44 కోట్లతో బీచ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ–భీమిలి నాలుగు లైన్ల రహదారి పూర్తి కాలేదు. మిగిలినవి అమలుకు నోచుకోలేదు.
2014 డిసెంబర్‌ 17న జాతీయ స్థాయి పారిశ్రామిక సంస్థల సీఈవోల సదస్సులో నగరంలో అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, అమెరికా భాగస్వామంతో విశాఖతో పాటు ఉత్తరాం ధ్రకు ఉపయోగపడే విధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా విమ్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం రూ.60 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  కుర్లాన్, బయోకాన్, ఏషియన్‌ పెయింట్స్‌ తదితర సంస్థలు విశాఖలో తమ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయన్నారు. ఇందులో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ సిటీ పనులు నత్తనడకన సాగుతున్నా యి. విమ్స్‌ ఆస్పత్రిని ప్రైవేటు బాట పట్టిం చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు ఇటీవల భాగస్వామ్య సదస్సు సందర్భంగా శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏడు మిషన్లలో ఒకటైన మౌలిక సదుపాయాల మిషన్‌ను 20 15 మార్చి 13న సీఎం చంద్రబాబు విశాఖలోనే ప్రారంభించారు. ఈ మిషన్‌ ఏమైపోయిందో ఎవరికి తెలియ ని పరిస్థితి. ఈ సందర్భంగా ఏపీలో 100 కోట్లతో మూడు కూచిపూడి కళాక్షేత్రాలు నిర్మిస్తున్నామని, ఇందులో ఒకటి విశాఖలో నిర్మించ తలపెట్టామని ప్రకటించారు. రాష్ట్రం లో మూడు జాతీయ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని, వీటిలో ఒకటి విశాఖలో నిర్మించనున్నామని చెప్పుకొచ్చారు. కానీ వి శాఖలోనే కాదు.. రాష్ట్రంలో కూడా వీటి జాడ లేదు. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రణాళిలకు రూపొందిస్తున్నామని, విశాఖ పోర్టు సామర్థ్యాన్ని 600 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచేలా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. విశాఖ–గంగవరం–కాకినాడ పోర్టుల ద్వారా ఏడు రాష్ట్రాలకు పోర్టు ఆథారి త సేవలందుతున్నాయి. ఏడు రాష్ట్రాలకు ప్రస్తుతం సింగిల్‌ రైల్వే లైన్‌ ఉంది. మరో లైన్‌ నిర్మాణంతో రైల్వే రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. అవేమి అమలుకు నోచుకోలేదు.
2015 జనవరి 17న  ఐఐఎం శంకుస్థాపన సందర్భంగా విశాఖలో ఐఐఎంతో పాటు బిట్స్‌ పిలానీ, సరళ–బిర్లా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రాబోతున్నట్టు ప్రకటించారు. వాటికి స్థల కేటాయింపులు జరిగాయే తప్ప శంకుస్థాపన జరగలేదు.  స్కిల్‌ డెవలప్‌మెం ట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, అనుబంధంగా వర్సిటీని నెలకొల్పుతామన్నారు. కార్యరూపం దాల్చలేదు.
2015 ఏప్రిల్‌ 08న  నాలెడ్జ్‌ మిషన్‌ ప్రారంభం సందర్భంగా ఇచ్చాపురం నుం చి కాకినాడ వరకు 8 లైన్ల రహదారిని ఏర్పా టు చేయనున్నట్టు ప్రకటించారు. పీపీపీ పద్ధతిలో పవర్, వాటర్, గ్యాస్, టూ రిజం, సర్వీస్‌ సె క్టార్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్రం లో స్పోర్ట్స్, మెరై న్‌  వర్సిటీలను నెలకొల్పనున్నట్టు చెప్పా రు. వాటిని విశాఖలోనే ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు.  అడుగు ముందుకు పడలేదు.
2015 ఏప్రిల్‌ 10న సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇన్‌ టెస్టినల్‌ ఎండోస్కోపీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఈఐ) 16వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ఏపీని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, విశాఖపట్నం– కృష్ణపట్నంల మధ్య 15–16 పోర్టులు తీసుకొస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. కేజీహెచ్‌లో ఉదర కోశ వ్యాధుల విభాగంలో మెరుగైన వసతులను కల్పిస్తామని, సూపర్‌ స్పెషాలిటీ వార్డుగా తీర్చిదిద్దుతామన్నారు.  కేజీహెచ్‌లో ఉదర కోశ వ్యాధుల విభాగంలో సూపర్‌ స్పెషాలిటీ వార్డుగా తీర్చిదిదడం మినహా మిగిలిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు.
2015 ఏప్రిల్‌ 29న పారిశ్రామిక మిషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖలో 35, 740 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన 47 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిలో ప్రధానంగా హెచ్‌పీసీఎ ల్‌ను రూ.17వేల కోట్లతో విస్తరించేందుకు, స్టీల్‌ప్లాంట్‌ ఏపీఎండీసీ భాగస్వామంతో పశ్చి మ గోదావరిలో రూ. 4 వేల కోట్లతో మాంగనీస్‌ ఖనిజ తవ్వకాలు చేసేందుకు ఒప్పం దాలు కుదిరాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒçప్పందాల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. ఒక్క సం స్థ కూడా జిల్లాకు రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు వద్ద ముడి ఇనుము గనులు ఇటీవలే ప్లాంట్‌కు కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన నాలుగేళ్లలో 62 సార్లు వచ్చిన సందర్భాల్లో ఇచ్చిన అమలు కాని హామీల జాబితా చాంతాడంత ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top