మాట తప్పి ముంచేసిన చంద్రబాబు

Chandrababu Naidu Cheat APIIC Lands Farmers In Praja Sankalpa Yatra - Sakshi

ఏపీఐఐసీ సేకరించిన భూముల్ని డీ నోటిఫై చేస్తామని దగా

తమ్మవరం, సూర్యారావుపేట, పెనుమర్తి  రైతుల ఆవేదన

సమస్యను పరిష్కరించి, ఆదుకోవాలని జననేతకు అభ్యర్థన

తూర్పుగోదావరి ,పిఠాపురం: ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు స్వయంగా మా భూముల్లోకి వచ్చారు. మీ భూములను డీ నోటిఫై చేస్తానని మాట ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాకా మొహం చాటేసి మమ్మల్ని నిండా ముంచేశారు’ అంటూ తమ్మవరం, సూర్యారావుపేట, పెనుమర్తి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం సామర్లకోట మండలం అచ్చంపేట వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వారు గోడు చెప్పుకొన్నారు.

తమ మూడు గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 600 ఎకరాల ఆయకట్టుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఆ భూముల్లో కొంత గతంలో సేకరించి, ఎస్సార్‌ గుజరాత్‌ కంపెనీకి ఇవ్వగా మిగిలిన సుమారు 295 ఎకరాలను చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నామన్నారు. అయితే ఏపీఐఐసీ తమను సంప్రదించకుండా, ఎలాంటి సమావేశాలు పెట్టకుండా ఏకపక్షంగా మిగిలిన 295 ఎకరాలకు అవార్డును ప్రకటించేసి, డబ్బు కోర్టులో డిపాజిట్‌ చేశామని చెపుతూ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేసిందని వాపోయారు.  తామంతా ఆందోళనకు దిగి బోర్డులు తీసివేయగా, అప్పటి నుంచి ఆ భూముల్లోకి ఏపీఐఐసీ వాళ్లు రావడం మానేశారన్నారు.  అయితే ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో పాటు ఎటువంటి అమ్మకాలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతింటే ఇచ్చే నష్ట పరిహారాలను ఆపేశారని వాపోయారు.

ఆ భూముల్ని ఏపీఐఐసీకి ప్రభుత్వం ఇచ్చిందని చెబుతున్నారే తప్ప రైతులకు ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. తాము మునుపటిలాగే ఎవరి భూముల్లో వారు పంటలు సాగు చేసుకుంటున్నామని, గతంలో తీసుకున్న భూముల్లో కొంత మేరకు ఎకరం రూ.1.80 కోట్ల చొప్పున ఏపీఐఐసీ కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేసుకుందన్నారు. ప్రభుత్వం అటు నష్టపరిహారం ఇవ్వకుండా, ఇటు అమ్ముకోవడానికి లేకుండా చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాలకు భూములు విక్రయించే అవకాశం లేక నానాయాతన పడుతున్నా ఎవరు పట్టించుకోడం లేదన్నారు. భూములు ఉండి కూడా ఏమీ లేని వారుగా, కూలీలుగా మారిపోయామని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌కు వచ్చినప్పుడు తమ గోడు వెళ్లబుచ్చినా పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు. అనేకసార్లు స్థానిక ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి తమ బాధలు చెప్పుకున్నా ఫలితం కనిపించలేదన్నారు. తాము 1999లోనే ఆ భూములను స్వాధీన పర్చుకున్నట్లు ఏపీఐఐసీ వారు ప్రకటిస్తున్నా ఇప్పటి వరకూ ఎవరి భూముల్లో వారే ఉన్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుని తమ భూములు తమకు తిరిగి డీనోటి ఫై చేయించి ఆదుకోవాలని జగన్‌ను అభ్యర్థించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top