అది సర్కారు కత్తే

Chandrababu Naidu Ban On CBI In AP - Sakshi

ఏపీలో ‘సీబీఐకి నో ఎంట్రీ’తో పరోక్షంగా అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం

విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని బలపరుస్తున్న టీడీపీ సర్కారు వరుస చర్యలు

సీబీఐ ఏపీలో అడుగుపెట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా ఇది సుస్పష్టం 

చంద్రబాబు సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ జీవో జారీ చేయడం ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం వెనుక ‘సర్కారు కత్తి’ దాగి ఉన్నట్లు టీడీపీ సర్కారు పరోక్షంగా ఒప్పుకున్నట్లైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు, హత్యాయత్నం కుట్రలపై స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐ దర్యాప్తు జరపడానికి    వీల్లేదంటూ, అసలు ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికే వీల్లేదంటూ టీడీపీ సర్కారు రహస్యంగా జారీ చేసిన జీవో 176పై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, రాజధాని ముసుగులో రైతుల నుంచి భూములు గుంజుకుని అరాచకాలకు పాల్పడటం, సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచి సొమ్ము చేసుకోవడం, విశాఖలో సాగించిన భూ దందాలతోపాటు ఓటుకు కోట్లు కేసులో ఆడియో,

వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశిస్తే తమ అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ఏపీలో సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలు లేకుండా టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. దీని ద్వారా ఏపీలో అవినీతి వ్యవహారాలు జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అంగీకరించినట్లైందని వ్యాఖ్యానిస్తున్నాయి. తాజా పరిణామాలు విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేననే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు, పథకాల్లో అవినీతి చోటు చేసుకుందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమ గుట్టు రట్టవుతుందనే భయంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రవేశాన్ని నిరాకరిస్తూ జీవో జారీ చేశారని పేర్కొంటున్నారు.  
అవినీతి, కుట్రలో ప్రభుత్వ

పెద్దల పాత్రను నిర్ధారిస్తోంది! 
ఏ ప్రభుత్వమైనా అక్రమాలు చోటు చేసుకుంటే దర్యాప్తునకు ఆదేశిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌లో నిషేధిస్తూ జీవో జారీ చేయడాన్ని చూస్తుంటే ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, కొందరు ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే విషయం తేటతెల్లం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ అవసరం లేదంటేనే తప్పు చేసినట్లు అంగీకరించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందనే విషయాన్ని సీబీఐ విచారణను నిషేధించడం ద్వారా చంద్రబాబు సర్కారు అంగీకరించినట్లైందని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గత ప్రభుత్వాలన్నీ ఎప్పటికప్పుడు జీవోలను జారీ చేస్తూ వస్తున్నాయి. టీడీపీ సర్కారు కూడా గత ఏడాది డిసెంబర్‌ 5వ తేదీన జీవో 184, ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన 109 జీవో ద్వారా సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతి తెలిపింది. అయితే గతంలో సాధారణ సమ్మతి ఇస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో 176 జారీ చేసింది. ఈ జీవోను రహస్యంగా ఉంచింది. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయడానికి ప్రధాన కారణం టీడీపీ సర్కారు పాల్పడుతున్న అక్రమాలతోపాటు ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కుట్రను చేధించకుండా చూసేందుకేనని స్పష్టం అవుతోంది. 

ఇంటికి వెళ్లి పడుకున్నారంటూ అవాస్తవాలు..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్టోబర్‌ 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ఈ దారుణ హత్యాయత్నం నుంచి ప్రతిపక్ష నేత తృటిలో తప్పించుకోవడం తెలిసిందే. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే డీజీపీ ఠాకూర్‌ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుడు.. ప్రతిపక్ష నేత అభిమాని అని, ప్రచారం కోసమే ఈ చర్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే టీడీపీ నేతలు కూడా కూడా ప్రచారం కోసం ప్రతిపక్ష నేతే కత్తితో పొడిపించుకున్నారంటూ దారుణంగా మాట్లాడారు. అదేరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ నిందితుడు వైఎస్సార్‌ సీపీకి చెందిన వ్యక్తి అంటూ వెకిలిగా నవ్వుతూ హత్యాయత్నం ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ప్రతిపక్ష నేత విమానంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఘటన అనంతరం ప్రతిపక్ష నేత జగన్‌ హైదరాబాద్‌లోని విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జగన్‌ ఇంటికి వెళ్లి పడుకుని ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లారంటూ విలేకరుల సమావేశంలో అవాస్తవాలు చెప్పారు.

బండారం బయటపడుతుందనే ‘అసమ్మతి’ ఎత్తుగడ
ఈ పరిణామాలన్నీ గమనించిన తరువాత ప్రతిపక్షనేతపై హత్యాయత్నం వెనుక పెద్దల కుట్ర దాగి ఉందనే అనుమానాలు అందరిలోనూ బలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ (థర్డ్‌ పార్టీ)తో విచారణకు ఆదేశించి హత్యాయత్నం వెనుక కుట్రదారులను వెలికి తీయాలని కోరుతూ ప్రతిపక్ష నేత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్‌కు కూడా ఈమేరకు వినతిపత్రం అందించారు. దీంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమ బండారం బయటపడుతుందని బెంబేలెత్తిన టీడీపీ పెద్దలు దీన్ని అడ్డుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమ కుట్ర కోణం వెలుగు చూస్తుందనే ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబులో కనిపిస్తోందని, ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ ఎత్తుగడ వేశారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

న్యాయస్థానాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తును ఆపలేరు...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, సహాయ పునరావాసంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు కాగ్‌ నివేదికలు తప్పుబట్టాయి. రాజధాని విషయంలోనూ టీడీపీ సర్కారు అక్రమాలకు పాల్పడినట్లు పలుసార్లు తేలింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల బినామీలు ఆదాయపు పన్ను ఎగ్గొట్టి ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలతో నిరూపితమైంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే సమ్మతిని రద్దు చేసినంత మాత్రాన సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం నిలువరించలేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాల్లో అక్రమాలు జరిగితే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది.

కేసును ఢిల్లీలోనే నమోదు చేస్తారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఏ రాష్ట్రానికైనా వెళ్లి ఎవరినైనా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయవచ్చు’ అని పేర్కొన్నారు. ‘సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది. అలాగే రాష్ట్రం కోరకపోతే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదనుకోవడం పొరపాటే అవుతుంది. న్యాయస్థానాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తును ఎవరూ ఆపలేరు. ఇందుకు పలు ఉదాహరణలున్నాయి. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలపై సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు’ అని స్పష్టం చేశారు.

విపక్షంలో ఉండగా పలుసార్లు సీబీఐ దర్యాప్తునకు బాబు డిమాండ్‌
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా పలు అంశాలపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయటాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. వోక్స్‌ వ్యాగన్‌ కార్ల పరిశ్రమ స్థాపన వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు గతంలో సీబీఐ విచారణను కోరారు. ఈ నేపథ్యంలో ఆయన డిమాండ్‌ మేరకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా నాడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను ఆ శాఖ నుంచి తప్పించి మార్కెటింగ్‌ శాఖకు పంపించారు.

పరిశ్రమల శాఖ మంత్రిగా బొత్స కొనసాగితే దర్యాప్తు ప్రభావితం అవుతుందనే చిత్థశుద్ధితో వైఎస్సార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆధికారులు పేర్కొంటున్నారు. అలాగే టీడీపీ నేత పరిటాల రవి హత్యపై చంద్రబాబు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడమే కాకుండా దీని వెనుక జగన్‌ హస్తం ఉందని ఆరోపించారు. తన కుమారుడి పేరు ఉందని ఆరోపణలు వచ్చినప్పటికీ నాడు వైఎస్సార్‌ దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. తప్పు చేయనివారికి సీబీఐ దర్యాప్తు అంటే భయం ఉండదని, అదే తరహాలో దివంగత సీఎం వైఎస్సార్‌ వ్యవహరించారని పలువురు అధికారులు గుర్తు చేస్తున్నారు. 

అంతా డ్రామా అన్నప్పుడే పెద్దల పాత్ర రుజువైంది!
హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేయగా వెంటనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పలుసార్లు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థతో విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు తేలిగ్గానే బోధపడుతోందంటున్నారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దారుణమైన హత్యాయత్నాన్ని కోడి కత్తి డ్రామాగా సీఎం వ్యాఖ్యలు చేసినప్పుడే ఈ ఘటన వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విషయం సామాన్య ప్రజలకు సైతం అర్థమైపోయిందని, ఇప్పుడు రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదని నిషేధిస్తూ జీవో జారీ చేయడంతో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక కచ్చితంగా సర్కారు కుట్ర ఉందని ప్రజలకు మరింత స్పష్టత వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top