ఒక్క ఇటుకా పడలేదు!

Chandrababu Foundation Stones In Guntur - Sakshi

సీఎం శంకుస్థాపన చేసి మూడేళ్లయినా నేటికీ        అతీగతీలేని వైనం

శిలాఫలకాలకే పరిమితమైన డిపార్ట్‌మెంట్‌ భవనాల నిర్మాణం

ఇరుకు గదుల్లో విద్యార్థులు, అధ్యాపకుల ఇబ్బందులు

నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇదీ పరిస్థితి

ఏదైనా ప్రారంభించడమే మనచేతిలో ఉంది.. పూర్తి చేయడం ఆ పైవాడి చేతిలో ఉంది.. అన్నట్లుంది ప్రభుత్వ పనితీరు. టీడీపీ అధికారంలోకి వచ్చాక శంకుస్థాపన జరుపుకొన్న అనేక పనులు నేడు ఒక్క ఇటుక కూడా పడని దుస్థితిని చూస్తున్నాం. వాటిలో ఒకటి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో డిపార్ట్‌మెంట్‌ భవనాల నిర్మాణం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన జరిగి మూడేళ్లయినా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ఆవరణలోని శిలాఫలకాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ప్రభుత్వ అసమర్థతను ్రçపశ్న్రిస్తున్నాయి...

గుంటూరు, నూజివీడు: స్వయనా ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన భవనాల పనులు మూడేళ్లుగా ప్రారంభమే కాని దారుణ పరిస్థితి ఇది. రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శాఖా భవనాలకు 2015, డిసెంబరు 23న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆర్జీయూకేటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  అయితే ఇది జరిగి 34 నెలలవుతున్నా దీని గురించి పట్టించుకున్న వారే లేరు. వచ్చేపోయే వారికి స్వాగతం పలుకుతున్నట్లుగా శిలాఫలకాలు ప్రధాన గేటు పక్కనే ఉండి దర్శనమిస్తున్నాయి. శాఖల వారీగా వసతులు కల్పించాల్సిన డిపార్ట్‌మెంట్‌ భవనాల జాప్యంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  రూ.60కోట్ల అంచనాలతో నిర్మించాల్సి ఉన్న ఈ భవనం మొత్తం 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో ఒక్క మెకానికల్‌ బ్రాంచికి మాత్రమే పూర్తిస్థాయిలో ల్యాబ్‌ సదుపాయం ఉంది. మిగిలిన ఐదు బ్రాంచీలకు పూర్తిస్థాయిలో ల్యాబ్‌  సదుపాయం లేదు. అలాగే హెచ్‌వోడీలకు సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. ఉన్న వాటిల్లోనే ప్రస్తుతం సర్దుకుంటున్నారు. ఎంతో ముఖ్యమైన ఇలాంటి భవన నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

పది డిపార్ట్‌మెంట్‌లు.. ఒక భవనం !
ట్రిపుల్‌ఐటీలను స్థాపించి 10ఏళ్లు గడిచినా విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్, మెస్, గ్రంథాలయం తదితర వసతులు మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, సబ్జెక్టుల వారీగా అవసరమైన వసతులు బోధనా సిబ్బందికి మాత్రం అందుబాటులోకి రాలేదు. పీయూసీకి సంబంధించి గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లిషుతో పాటు ఇంజినీరింగ్‌కు సంబంధించి మెకానికల్, సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, కెమికల్, మెటలర్జీ బ్రాంచిలకు సంబంధించి డిపార్ట్‌మెంటుల వారీగా వసతులు లేవు. దీంతో హెచ్‌ఓడీలు అకడమిక్‌ భవనాలలో, పరిపాలన భవనంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులతో సర్దుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ పదిశాఖలకు సంబంధించి వసతులతో పాటు హెచ్‌ఓడీలు, స్టాఫ్, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిం చుకోవడానికి అవసరమైన అన్ని రకాల వసతులు ఉండేలా నిర్మించాల్సి ఉంది. ఈ నేపధ్యం లోనే అప్పట్లో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో శిలాఫలకాలపై పేర్లు వేసుకోవడానికి శంకుస్థాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ భవనం నిర్మాణ పనులు ప్రారంభించాలని ట్రిపుల్‌ఐటీ హెచ్‌ఓడీలు, అధ్యాపకులు కోరుతున్నారు.

టెండర్ల దశలో ఉంది
భవన నిర్మాణాన్ని ఇంజినీర్స్‌ ప్రాజెక్ట్సు ఇండియా లిమిటెడ్‌(ఈపీఐఎల్‌)కు అప్పగించడం జరిగింది. టెండర్ల దశలో ఉంది. నెలరోజుల లోపు పనులు ప్రారంభిస్తారు. శంకుస్థాపన చేసిన ప్రదేశంలో కాకుండా నూతనంగా సేకరించిన 69ఎకరాల స్థలంలో నిర్మించడం జరుగుతుంది.– వీరంకి వెంకటదాసు,డైరెక్టర్, నూజివీడు ట్రిపుల్‌ఐటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top