పోలవరంలో ‘పిక్నిక్‌ వాక్‌’

Chandrababu Family gallery walk At Polavaram - Sakshi

గ్యాలరీ వాక్‌ పేరిట ప్రచారం కోసం ముఖ్యమంత్రి పాకులాట

కోట్లాది రూపాయల ప్రజాధనంతో హంగామా 

ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తయిపోయినట్లు హడావుడి 

ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అభాసుపాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సాక్షిగా సకుటుంబ కథా చిత్రాన్ని చూపించారు. ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. బుధవారం గ్యాలరీ వాక్‌ను ఫ్యామిలీ పిక్నిక్‌లా మార్చేశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్లతో కలిసి ప్రాజెక్టులోని గ్యాలరీలో నడిచారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. మనవడిని చూసి మురిసిపోవడం, అతడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సీఎం చంద్రబాబు కేవలం ప్రచారం కోసం పాకులాడుతూ ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టి, గ్యాలరీ వాక్‌ పేరిట హంగామా చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. 

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అందరినీ రమ్మని పిలిచిన సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేస్తూ తమను పట్టించుకోకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. చాలామంది గ్యాలరీలోకి దిగి మళ్లీ వెంటనే వెనక్కి వచ్చేశారు. ముఖ్యమంత్రి గ్యాలరీ వాక్‌ పూర్తి చేసి వచ్చేసరికే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు నుంచి వెనుతిరిగారు. వచ్చిన వారికి ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను తెలియజేసే వారే లేకుండా పోయారు. 

ప్రజలను ఏమార్చే ఎత్తుగడ 
ప్రాజెక్టు జలాశయం నుంచి వరద నీటిని స్పిల్‌ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే భద్రత కోసం దానికి దిగువన గ్యాలరీ నిర్మించారు. 2 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో గ్యాలరీ ఉంటుంది. జలాశయంలో నిల్వ ఉండే నీటి ఒత్తిడి స్పిల్‌వేపై పడకుండా చూడటం కోసం దీన్ని నిర్మిస్తారు. ఏ ప్రాజెక్టులో అయినా గ్యాలరీ నిర్మించడం సహజమే. ఇది పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తయినట్లు కాదు. పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఇటీవల కేంద్ర నిపుణుల కమిటీ పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కప్పిపుచ్చి, ప్రజలను ఏమార్చేందుకే టీడీపీ ప్రభుత్వం గ్యాలరీ వాక్‌ నిర్వహించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికీ 58 శాతమే పూర్తి
గ్యాలరీ వాక్‌కు ప్రజాప్రతినిధులంతా కుటుంబాలతో సహా తరలి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అయితే, ఒకరిద్దరు మాత్రమే కుటుంబాలతో సహా రాగా, మిగిలినవారు ఒక్కరు మాత్రమే వచ్చారు. మంత్రులతో సహా పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. ప్రాజెక్టులో భాగమైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టును ఇప్పటిదాకా 27 సార్లు సందర్శించారు. 72 వారాలు రాజధాని అమరావతి నుంచి సమీక్షించారు. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టు పూర్తయ్యింది 58 శాతమే. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు మిగిలిన పనులను మరో 9 నెలల్లో పూర్తి చేయడం ఎలా సాధ్యమని పలువురు ప్రజాప్రతినిధులు చర్చించుకోవడం కనిపించింది.  

పూర్తి కాకుండానే జాతికి అంకితమా! 
పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. డయాఫ్రం వాల్‌ను ఏకంగా జాతికి అంకితం కూడా చేసేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వడం ఆనవాయితీ కాగా, పునాదులను కూడా జాతికి అంకితం చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు. పోలవరం హెడ్‌వర్క్స్‌ స్పిల్‌వేలో కాంక్రీట్‌ పనుల ప్రారంభోత్సవం, కాఫర్‌ డ్యామ్‌ పనులకు శంకుస్థాపన, మరోసారి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు శంకుస్థాపన, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పునాది (డయాఫ్రమ్‌ వాల్‌)ని జాతికి అంకితం చేయడం, కాఫర్‌ డ్యామ్, పునాది పనులు, కాంక్రీట్‌ పనుల ప్రారంభం కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి తీరు ప్రజల్లో అభాసుపాలైంది. గ్యాలరీ వాక్‌ కోసం జిల్లాలోని మీడియాతోపాటు విజయవాడ, దేశ రాజధాని ఢిల్లీ నుంచి మీడియా ప్రతినిధులను తీసుకొచ్చారు. వారికి ఏసీ బస్సులతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసం 8 ఏసీ బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, ప్రజాప్రతినిధులు అనుకున్నంత మంది రాకపోవడం, రైతులు కూడా రాకపోవడంతో ప్రాజెక్టు వద్ద పనులు చేస్తున్న సిబ్బందినే సమావేశంలో కూర్చోబెట్టారు. పోలవరం సందర్శన పేరుతో ప్రభుత్వం ప్రతిరోజూ రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మందిని బస్సుల్లో తరలిస్తోంది. ఇప్పటివరకూ 1.20 లక్షల మందిని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. దీనికోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.కోట్లు బకాయి పడినట్లు సమాచారం.  

14 నుంచి జలసిరికి హారతి
ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులకూ జల హారతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి మహా సంగమానికి శ్రీకారం చుడతామన్నారు. బుధవారం సీఎం చంద్రబాబు కుటుంబంతో కలసి పోలవరం ప్రాజెక్టు సందర్శించారు.  ప్రాజెక్టు వద్ద సీఎం కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్షులతో కలిసి గ్యాలరీవాక్‌లో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, ఇపుడు గ్యాలరీ వాక్‌ చేశానని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు తాను కో–ఆర్డినేటర్‌గా ఉన్నానని అన్నారు. ఈనెలలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.  ప్రాజెక్టుపై 14,600 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం రూ.6,724 కోట్లే ఇచ్చిందని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తర్వాత రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. 80 ఏళ్ల ఆలోచన సాకారం అవుతోందన్నారు. పర్యటనలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని ఆయన అనుచరుల కారు బోల్తా పడింది. పలువురు గాయపడ్డారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top