బాధితురాలిపై బండలేస్తారా?

Chandrababu on the complaint of Sharmila To get offensive - Sakshi

షర్మిలకు భరోసా ఇవ్వాల్సింది పోయి బెదిరిస్తారా?

ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా ఇది..

వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ మండిపాటు

సాక్షి, అమరావతి: తనకు అన్యాయం జరుగుతోందని చెప్పిన బాధితురాలిపై బండలు వేయడం సీఎం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల మీద సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై స్వచ్ఛందంగా కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు.. తన హోదాను మరచి ఎదురుదాడికి దిగడం, ఆమెపై బండలు వేయడం ఎక్కడైనా ఉంటుందా? అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

పోలీసు వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న సీఎం గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య షర్మిల హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాన్ని కూడా చంద్రబాబు తప్పుపడతారా? వేరే రాష్ట్రంలో ఫిర్యాదు ఇవ్వడమేంటని బెదిరిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. షర్మిల ధైర్యంగా ముందుకు వచ్చినందుకు అభినందించాల్సిందిపోయి ఎదురుదాడి చేయడం దారుణమన్నారు. ఆమెపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం చంద్రబాబు, ఆయన గ్యాంగ్‌కు తప్ప ఎవరికీ లేదన్నారు.

ఈ తరహా ప్రచారమే చంద్రబాబు ఇంట్లో వాళ్లపై జరిగితే ఆయన కళ్లప్పగించి చూస్తారా? అని ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఓ కుటుంబానికి చెందిన మహిళపైనే ఇంతటి దుష్ప్రచారం జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు ఉసిగొల్పితేనే వర్ల రామయ్య, శోభా హైమావతి, బాబు రాజేంద్రప్రసాద్, జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వాళ్లు షర్మిల గురించి మాట్లాడారని ఆరోపించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ విషయంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునన్నారు. మహిళా అధికారి వనజాక్షితో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దురుసుగా ప్రవర్తిస్తే అతన్ని ఏం చేశారని ప్రశ్నించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top