నైపుణ్యముంటే డబ్బు దానంతటదే వస్తుంది

Chandrababu comments at us tour - Sakshi

అమెరికా పర్యటనలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ‘‘డబ్బు సమస్య కాదు. నైపుణ్యాలు పెంచుకుంటే దానంతట అదే వస్తుంది. ఇప్పుడు సంపాదించిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు. నేను కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడినే. పుట్టడం అంతా చిన్నగానే పుడతాం. కానీ తెలివితేటలతో.. కష్టపడితే ఈ స్థానానికి వస్తాం’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తన తొమ్మిది రోజుల విదేశీ టూరులో భాగంగా మూడురోజులపాటు అమెరికాలోని చికాగో, ఐయోవా, న్యూయార్క్‌లలో పర్యటించిన ఆయన శుక్రవారం రాత్రి అక్కడినుంచి బయల్దేరి దుబాయ్‌కు చేరుకున్నారు. శనివారం దుబాయ్‌లోని తెలుగువారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మీరు కూడా నైపుణ్యాలు పెంచుకుంటే తేలిగ్గా ఆదాయాలు పెరుగుతాయన్నారు.

మనవాళ్లు ఎక్కడున్నా రాణిస్తారంటూ.. మీరు రాష్ట్రానికొచ్చి వ్యాపారాలు చేయాలనుకుంటే సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట్రం రూ.40 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిందని చెప్పారు. దుబాయ్‌కంటే విశాఖపట్నమే బాగుందనే ప్రశంసలు రావడం అభినందనీయమన్నారు. అన్నింటా అభివృద్ధి చెందుతున్నామని చెప్పారు. విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేశానని, అభివృద్ధి, ఆనందం రెండూ కావాలని, ఈ రెండే తన డాక్యుమెంట్‌ అని అన్నారు. ఆనందలహరి, హ్యాపీ సండే కార్యక్రమాలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. వివిధ దేశాల్లో 25 లక్షలమంది ఎన్నార్టీ(నాన్‌ రెసిడెంట్‌ తెలుగూస్‌)లు ఉన్నారని, వారంతా ఏపీ ఎన్నార్టీతో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్‌ పేరుతో 24 గంటలూ సేవలందించే ‘హెల్ప్‌లైన్‌’ను ప్రారంభించాలని ఎన్నార్టీకి సూచించారు. ఇక్కడికి వలస వచ్చినవారికి అత్యవసర సాయం కింద ‘ప్రవాసాంధ్ర నిధి’ ఏర్పాటు చేశామని, ఏడాదికి రూ.50 ప్రీమియం చెల్లిస్తే, వారిలో ఎవరైనా మృతి చెందితే రూ.10 లక్షల వరకూ బీమా చెల్లిస్తామన్నారు. దుబాయ్‌ వచ్చి సంపన్నులైనవారు జన్మభూమికి సాయపడాలని కోరారు.

న్యూయార్క్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రసంగం.. 
అంతకుముందు శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మేర్ల్‌ లించ్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. డబ్బుల్లేకపోయినా మేధస్సే పెట్టుబడిగా పెట్టి రాజధాని నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. అమరావతిని పరిపాలన నగరంగానే గాక ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. తన కలల ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరాన్ని వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలు వాణిజ్య, వ్యవసాయ, ఆహార సంస్థల ప్రతినిధులడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ఆర్గానిక్‌ ఫుడ్‌ ఇండస్ట్రీకి ఎటువంటి ప్రోత్సాహకాలైనా కల్పిస్తామని, టేస్టీబైట్‌ ఈటబుల్స్‌ లిమిటెడ్‌ సంస్థ చైర్మన్‌ అశోక్‌ వాసుదేవన్‌ రాష్ట్రానికొచ్చి పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.

ఏపీలో ఆటోమొబైల్‌ పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలున్నాయని మాగ్నా ఇంటర్నేషనల్‌ సీఈవో స్వామి కోటగిరి అడగ్గా.. ప్రపంచం ప్రస్తుతం విద్యుత్‌ వాహనాలకు మళ్లేదిశగా వెళుతోందని, ఈ పరిణామానికి ఆంధ్రప్రదేశ్‌ తప్పక మార్గదర్శిగా ఉంటుందని సీఎం అన్నారు. నలంద 2.0 విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా.. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు షాయిల్‌కుమార్‌ సుముఖత తెలిపారు. తొలుత యూఎస్‌–ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌ బోర్డ్‌ మెంబర్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మేర్ల్‌ లించ్‌ గ్లోబల్‌ కార్పొరేట్‌ అండ్‌ ఇన్వెస్టుమెంట్‌ బ్యాంకింగ్‌ చైర్మన్‌ పూర్ణ సగ్గుర్తితో సీఎం సమావేశమయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top