జెండాలు లేకుండా ప్రచారం చేయండి

జెండాలు లేకుండా ప్రచారం చేయండి

బీజేపీని కోరిన చంద్రబాబు

 

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష బీజేపీ మద్దతు కోరింది. అయితే పార్టీ నాయకులు మెడలో బీజేపీ కండువాలు వేసుకోకుండా.. ప్రచారానికి వచ్చే కార్యకర్తలు కమలం పార్టీ జెండాలు పట్టుకోకుండా తమ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయాలని టీడీపీ పెద్దలు కోరడంపై బీజేపీలో దుమారాన్ని రేపింది. శనివారం విజయవాడ సిటీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పార్టీ పదాధికారుల (రాష్ట్ర కమిటీ) సమావేశంలో ఈ అంశంపై ఘాటుగా చర్చ జరిగింది.సమావేశంలో కర్నూలు జిల్లా నేతలు, రాష్ట్ర పార్టీ నాయకుల మధ్య వాదనలు తీవ్రంగా జరిగాయి. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబే తనకు ఫోను చేసి కోరినట్టు కంభంపాటి హరిబాబు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న కర్నూలు జిల్లాకు చెందిన కపిలేశ్వరయ్య (పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు), మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో బీజేపీ నేతలను పార్టీ కండువాలు వేసుకొని రావద్దని, జెండాలను పట్టుకుని రావద్దని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అంటున్న విషయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు. అందువల్లే తాము ప్రచారానికి దూరంగా ఉంటున్నామని తెలిపారు. జెండాలు లేకుండా రమ్మనడం టీడీపీ తప్పేనని హరిబాబు వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు కోరిక మేరకు టీడీపీ గెలుపునకు సహకరించాల్సిందేనన్నారు. 
Back to Top