ప్రజా గళంలా.. జన దళంగా

Chandra babu Government Neglects Farmers : Y S Jagan - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : సెంటు భూమి లేదని పేదల గోడు... పొలాలకు నీళ్లు రావడం లేదని అన్నదాత ఆవేదన...తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆక్వా రైతుల కష్టాలు... ఏళ్ల తరబడి పనిచేస్తున్నా రెగ్యులరైజ్‌ చేయడం లేదన్న కాంట్రాక్టు ఉద్యోగుల బాధ... తమకు కనీసం పింఛన్‌ కూడా ఇవ్వడం లేదన్న వికలాంగుల వేదన... ఇలా కన్నీరు పెడుతున్న పల్లె కష్టాలు చూసి జననేతను కదిలించాయి. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణుల కష్టాలు చూసి చలించిపోయారు. గ్రామీణ జీవితాన్ని కష్టాలపాలు చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. సాగు, సంక్షేమాలకు పెద్దపీట వేస్తానని... పల్లె సీమలకు కళకళలాడేలా చేస్తానని భరోసా ఇచ్చారు. 

భూమీ లేదు...ఇళ్లూ లేవు
‘300 కుటుంబాలవాళ్లం గ్రామంలో ఎప్పటి నుంచే వ్యవసాయం చేసుకుంటున్న భూములను మావి కావంటూ బెదిరిస్తున్నారు. ఆ భూములపై పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాకు మీరే న్యాయం చేయాలి’ అని కొత్త మల్లయ్యపాలెంకు చెందిన షేక్‌ రహీతులీషా, రఫీజునీషా, వజుమున్సీషాలు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రొయ్యల చెరువుల నుంచి  కాలుష్యంతో తమ భూములు దెబ్బతింటున్నాయని మల్లాయిపాలెంకు రైతులు వై.ఎస్‌.జగన్‌కు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొలాలు, రొయ్యల చెరువులకు ఇబ్బందిలేని శాస్త్రీయ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘ విజయనగరం జిల్లా నుంచి 80 కుటుంబాలు ఎన్నో ఏళ్ల క్రితమే వలసవచ్చాం. రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డులుఇక్కడే ఉన్నాయి. కానీ మాకు ఇంతవరకు ఇల్లు మంజూరు చేయలేదు’అని మల్లయ్యపాలెంలో స్థిరపడిన పేదలు మొరపెట్టుకున్నారు. 

ఆక్వాను ఆదుకోండి..
ప్రభుత్వం సక్రమంగా నీరు సరఫరా చేయకపోవడంతో ఆక్వా పరిశ్రమ దెబ్బతింటోందని కైకలూరు ఆక్వా రైతులు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. కలవపూడి అగ్రహారం వద్ద ఆయన్ని కలసిన ఆక్వా రైతులు దశాబ్దాలుగా వేధిస్తున్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. నీటి కొరతతోపాటు ఆక్వా రైతుల  ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.  

రేషన్‌కార్డు లేదు...పింఛన్‌ రాదు
మహానేత వైఎస్సార్‌ హయాంలో దివ్యాంగులకు నెలకు 35 కిలోల బియ్యం ఇచ్చేవారు కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని పలువురు జననేతకు మొరపెట్టుకున్నారు. దివ్యాంగులకు పింఛన్లు కూడా ఇవ్వడం లేదని గుడివాడకు చెందిన అహ్మద్, శ్రీకాంత్, సత్యన్నారాయణ, ఎం.రాజేష్, తులసీరామ్, బాషా, అజీమ్, అహ్మద్‌లు వివరించారు.   వికలాంగుడినైన తాను ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా రేషన్‌కార్డు ఇవ్వలేదని గుడివాడకు చెందిన గన్నాబత్తుల పూర్ణచంద్రరావు జననేత వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు. 

చిరుద్యోగులను ఆదుకోండి సార్‌.. 
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీఆర్‌సీ అమలు చేయాలని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.

156వ రోజు 8.10కి.మీ.
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 156వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. గుడివాడలో మంగళవారం ఉదయం 8.35 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి మల్లయ్యపాలెం క్రాస్, చౌటుపల్లి మీదుగా సాగి  పెదపాలపర్రు వద్ద కైకలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. అనంతరం కలవపూడి అగ్రహారం క్రాస్, కోడూరు క్రాస్, చిన్న పాలపర్రు క్రాస్‌ల మీదుగా ముదినేపల్లి వరకు పాదయాత్ర చేశారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  మంగళవారం 8.10కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. 

గుడివాడ పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), నాయకులు సామినేని ఉదయభాను, రైతు విభాగం ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కె.కన్నబాబు, వంగవీటి రాధాకృష్ణ, కైలే అనిల్, ఉప్పాల రాంప్రసాద్,  దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్, జోగి రమేష్, డాక్టర్‌ పీఎస్‌రావు, దుట్టా రామచంద్రరావు, ఏలూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ పాల్గొన్నారు.  

కైకలూరులో....
కైకలూరు నియోజకవర్గానికి పాదయాత్రగా విచ్చేసిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, సామినేని ఉదయభాను, ఆళ్ల నాని విచ్చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top