మళ్లీ తెరమీదకు శ్రీవారి ఆభరణాల వివాదం

Central Information Department Question To TTD On Jewellery - Sakshi

సద్దుమణిగిందనుకున్న అంశంపై మళ్లీ చర్చ

టీటీడీపై ప్రశ్నల అస్త్రాన్ని సంధించిన కేంద్ర సమాచార శాఖ

పురాతన కట్టడాలపైనా నిర్లక్ష్యమంటూ ఆగ్రహం

రాజుకుంటున్న టీటీడీ వివాదం టీటీడీ అధికారుల్లో గుబులు

శ్రీవారి ఆభరణాల అదృశ్యం.. వేయికాళ్ల మండపం కూల్చివేత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనిపై జవాబు చెప్పాలంటూ ఇప్పటికే కేంద్ర సమాచారశాఖ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడంతో మరోమారు దుమారం లేచింది.  శ్రీవారి ఆలయంలో స్వామి వారి ఆభరణాలు మాయమయ్యాయని, ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పోటులో తవ్వకాలు జరిపారని, తిరుమల ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు విమర్శలు సంధించిన విషయం తెలిసిదే. ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వ్యక్తే ఇలాంటి ఆరోపణలు చేయడంతో అందరి దృష్టి ఈ అంశాలపై పడింది.  జాతీయ స్థాయిలో కూడా    చర్చనీయాంశమైంది.  

సాక్షి, తిరుపతి: తిరుమలేశుని ఆభరణాలపై  రమణ దీక్షితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు లేఖ  రాసింది. ఇదే అంశంపై సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు.  హైకోర్టులోనూ కేసు నడుస్తోంది. ఈనేపథ్యంలో తాజాగా కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌ జోక్యం చేసుకుని టీటీడీపై అక్షింతలు వేశారు. ఈ అంశాలపై బదులివ్వాలంటూ టీటీడీని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి కూడా ఈ అంశాలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వంపైనా, టీటీడీ అధికారులపైనా ధ్వజమెత్తారు. టీటీడీఅధికారులపై పలు ప్రశ్నలను సంధించారు. కృష్ణదేవరాయల కాలంలో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల వివరాలు శాసనాల్లో కనిపిస్తున్నా టీటీడీ వద్ద ఎందుకు లేవు అని సమాచారశాఖ కమిషనర్‌ ప్రశ్నించారు.

1952లో నగల నమోదు రికార్డులు (తిరువాభరణ రిజిస్టర్‌) ప్రారంభించినప్పటి నుంచి ఆభరణాలకు లెక్కలున్నాయని చెబుతున్నారని,  అంతకు ముం దున్న ఆభరణాలు ఏమయ్యాయో తెలియదని చెబుతుండటంతో శ్రీవారి భక్తుల్లో  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరుకు చెందిన బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆభరణాల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. టీటీడీతో మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరిని అడిగినా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో నేరుగా  కేంద్ర సమాచార కమిషన్‌కు వెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర సమాచారశాఖ కమిషనర్‌టీటీడీతో పాటు ఆర్కియాలజి సర్వే ఆఫ్‌ ఇండి యా, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండేళ్లకోసారి శ్రీవారి ఆభరణా లను లెక్కిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. గతంలో పలుమా ర్లు శ్రీవారి ఆభరణాలు లెక్కించినట్లు చెబుతున్నా చూపించిన దాఖలాలు లేవు. దీంతో మరోసారి ఆభరణాలను లెక్కించాల్సిన అవసరం ఏర్పడింది.

పురాతన కట్టడాలపై నిర్లక్ష్యం..
తిరుమలలోని పురాతన కట్టడాలను పరిరక్షించడానికి తీసుకున్న చర్యల గురించి కూడా కేంద్ర సమాచార శాఖ ప్రశ్నించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి వెయ్యేళ్లకుపైనే చరిత్ర కలిగిన కట్టడాన్ని సంరక్షిత కట్టడాల జాబితాలోకి ఎందుకు చేర్చలేదని పురావస్తుశాఖను ఆరా తీసింది. సంరక్షిత కట్టడాల జాబితాలో తిరుమల కట్టడాలను చేర్చితే ముప్పు ఉండేది కాదనే వాదనను వినిపిస్తోంది. అభివృద్ధి పేరుతో ఆలయంలో ఇష్టారాజ్యంగా మార్పులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులు కూడా చూస్తూ ఏమీ చేయలేకపోయారనే విమర్శలున్నాయి. ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళితే పూజలకు కూడా ఇబ్బంది అవుతుందని అధికారులు వాదిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు తీసుకోవటం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కనుక సమాచార హక్కు చట్టం వర్తించబోదంటూ ఆర్‌టీఐ దరఖాస్తును తిరస్కరిస్తూ వస్తోంది. టీటీడీ పాలకమండలి నియామకం ప్రభుత్వమే నియమిస్తున్నందున టీటీడీకి ఆర్‌టీఐ వర్తిస్తుందనేది సమాచారశాఖ కమిషన్‌ అభిప్రాయం.. ఆలయ సంప్రదాయాలు, పూజాది కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను మినహాయించి, పరిపాలనా వ్యవహారాలు, ఆర్థిక విషయాలకు సంబంధించిన వివరాలను ఆర్‌టీఐ కింద ఇవ్వాలని కోరుతున్నా టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారు. కేంద్ర సమాచార శాఖ కమిషన్‌ జోక్యం చేసుకుని టీటీడీకి ఆర్‌టీఐ వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top