పోలీసుల ‘లాక్‌డౌన్‌’ సేవలు భేష్‌

Center Officials Priced Hyderabad Police For Lockdown Services - Sakshi

కోవిడ్‌–19 (కరోనా) మహమ్మారి నియంత్రణ నిమిత్తం చేపట్టిన లాక్‌డౌన్‌ తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం పర్యటన ఆదివారం రెండోరోజూ నగరంలో కొనసాగింది. కేంద్ర బృందం గాంధీ ఆస్పత్రితోపాటు మెహిదీపట్నం రైతుబజార్, ఓల్డ్‌ మలక్‌పేటలోని కంటైన్మెంట్, నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఆయా ప్రాంతాల్లో కోవిడ్‌ నివారణకు చేపట్టిన అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ బృందంలోని సభ్యులు తెలుసుకున్నారు. కోవిడ్‌ని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం.. పోలీసుల చర్యలను వారు అభినందించారు.

గోల్కొండ: లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీసులు పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్‌ బకోరా అన్నారు. ఆదివారం ఆయన మెహిదీపట్నంలోని రైతుబజార్‌ను సందర్శించారు. రైతుబజార్‌లో రైతులతోపాటు కొనుగోలుదారులు కూడా సోషల్‌ డిస్టెన్సీ పాటించడం చూసిన ఆయన అధికారులను అభినందించారు. అనంతరం ఆయన రైతుబజార్‌లోని రైతులతో మాట్లాడి కూరగాయల రవాణాలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? అని ప్రశ్నించారు. అధికారుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయని ఆయన రైతుల నుంచి తెలుసుకున్నారు.  అనంతరం అరుణ్‌ బకోరా ఇతర అధికారులతో కలిసి మెహిదీపట్నంలోని కంటైన్మెంట్‌ ఏరియాలను సందర్శించారు. కంటైన్మెంట్‌ ఏరియాలలో ఉన్నవారికి నిత్యవసర వస్తువులతో పాటు నీటిసరఫరా తదితర విషయాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్, ఆరోగ్య సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, కేంద్ర ప్రభుత్వ కంజూమర్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.ఠాకూర్, ఎన్‌ఐడీఎం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది, మార్కెటింగ్‌ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మలక్‌పేట్‌ ‘కంటైన్మెంట్‌’లో...
చాదర్‌ఘాట్‌: మలక్‌పేట నియోజకవర్గం పరిధి ఓల్డ్‌ మలక్‌పేటలో కరోనా వ్యాధి బారిన పడి కంటైన్మెంట్‌లో చికిత్స పొందుతున్న వారిని కేంద్ర బృందం ఆదివారం పరిశీలించింది. కరోనా వ్యాధిగ్రస్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన స్పెషల్‌ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది డిశ్చార్జ్‌ అయ్యారు... ఎంత మంది చికిత్స పొందుతున్నారనే అంశాలపై వైద్యులను, అధికారులను కేంద్ర బృందం ఆరా తీసింది.

ప్రకృతి చికిత్సాలయంలో...
అమీర్‌పేట: అమీర్‌పేట ప్రకృతి చికిత్సాలయంలోని క్వారంటైన్‌ను కేంద్ర బృందం సందర్శించింది. మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లను బృదం సభ్యులు పరిశీలించారు. క్వారంటైన్‌లో కల్పించిన సదుపాయాలు, అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్‌కు వచ్చే వారికి అందిస్తున్న ఆహారం గురించి నోడల్‌ అధికారులు శ్యామల, రేవతి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైద్యం కోసం వచ్చే వారికి ఇచ్చినట్లుగానే ఆహారం, లంగ్స్‌లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌ నుంచి త్వరగా ఉపశమనం కలిగేలా ప్రత్యేకంగా తయారు చేసిన కషాయాన్ని అందిస్తున్నామని కేంద్ర బృందానికి వివరించారు.

మెట్టుగూడ కంటైన్మెంట్‌లో...
అడ్డగుట్ట: సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని మెట్టుగూడలోని కంటైన్మెంట్‌ జోన్‌ను కేంద్ర బృందంతోపాటు జీహెచ్‌ఎంసీ జెడ్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ రవికుమార్, డీసీపీ కల్మేశ్వర్‌లు  ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికులకు నిత్యావసర సరుకులతో పాటు ఇతర సామగ్రి అందుతున్నాయా.. లేదా అని నిశితంగా పరిశీలించారు.

పాతబస్తీలో...
చార్మినార్‌: కేంద్ర ప్రతిని«ధి బృందం శనివారం రాత్రి పాతబస్తీలో పర్యటించింది. పాతబస్తీలోని పరస్థితులను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, నగర ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ అనిల్‌కుమార్, నగర ట్రాఫిక్‌ డీసీపీ కె.బాబురావు తదితరులు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి అరున్‌ బరోకా తదితరుల ప్రతినిధి బృందానికి వివరించారు. ముందుగా చార్మినార్‌ కట్టడానికి చేరుకున్న కోవిడ్‌–19 కేంద్ర ప్రతినిధుల బృందం కాలినడకన మక్కా మసీదు, లాడ్‌బజార్‌లను సందర్శించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎంత మంది వ్యాపారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతున్నారనే విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ సయ్యద్‌ రఫిక్, చార్మినార్‌ ఏసీపీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top