ఈ కోతులు చాలా ఖరీదు గురూ!

Catching Monkeys In Prakasam - Sakshi

గతంలో ఒక్కో కోతికి రూ. 250 చెల్లింపు

ప్రస్తుతం రూ. 400కు పెంపు

తొలిరోజు బోనుకు చిక్కిన 40 కోతులు

సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కోతులను నియంత్రించేందుకు నగర పాలక సంస్థ రంగంలోకి దిగింది. కోతులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ బోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకు కోతులు పట్టుకునే వారితో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకొంది. ఒక్కో కోతిని పట్టుకునేందుకు 400 రూపాయలు చెల్లించేందుకు నగర పాలక సంస్థ అంగీకరించింది. గతంలో ఒక్కో కోతికి 250 రూపాయలు చెల్లించగా, ఈసారి మాత్రం కోతి ఖర్చు పెరిగింది.

ఖర్చుకు వెనుకాడకుండా ప్రజలకు కష్టాలు తప్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కోతులు పట్టే వ్యక్తిని మాట్లాడించి అతన్ని రంగంలోకి దించింది. ఒంగోలు నగరంలోని గాయత్రీ మందిరం వద్ద, హౌసింగ్‌ బోర్డు కాలనీలో, పేర్నమిట్టలో రెండు ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బోన్లతో కోతులను పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తొలిరోజు పేర్నమిట్ట వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఏకంగా 40 కోతులు చిక్కాయి. కోతులు పట్టుకునేందుకు వారం పదిరోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించిన అనంతరం పట్టిన కోతులన్నింటినీ అడవిలో వదిలి పెట్టనున్నారు.

కోతి కష్టాలకు చెక్‌
ఒంగోలు నగరంలో కోతుల బెడద ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా గుంపుగా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో రావడంతో వాటిని తోలేందుకు కూడా ప్రజలు భయపడేవారు. కొన్ని కోతులు అయితే ఏకంగా ఇళ్లల్లోకి కూడా జొరబడేవి. ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను తీసుకువెళ్లి దూరంగా పడవేసిన సంఘటనలు కూడా నగరంలో చోటు చేసుకున్నాయి. దీంతో నగర ప్రజలకు కోతుల రూపంలో సరికొత్త సమస్య వచ్చిపడింది. ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ పిడతల నిరంజన్‌రెడ్డికి ప్రతిరోజూ వచ్చే ఫోన్‌ కాల్స్‌లో కోతుల బెడద నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ వచ్చేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి కోతులను పట్టే వ్యక్తిని ఏర్పాటు చేశారు. 

వేచి చూస్తూ..
కోతులను పట్టేందుకు నగరంలో నాలుగు పెద్ద బోన్లను ఏర్పాటు చేశారు. కోతులు ఎక్కువగా సంచరిస్తున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో బోనులో పండ్లు ఉంచుతారు. ఆ బోనుకు సమీపంలో ఒక వ్యక్తి కూర్చొని దానిని అదేపనిగా గమనిస్తూ ఉంటాడు. ఆ పండ్లను తినేందుకు ముందుగా ఒకటి రెండు కోతులు వస్తే వాటిని తిననిస్తాడు. అవి వెళ్లిన తరువాత మరికొన్ని పండ్లు బోనులో ఉంచుతాడు. ఒకేసారి గుంపుగా కోతులు వచ్చి పండ్లు తినే సమయంలో దానికి ఏర్పాటు చేసి ఉన్న డోర్‌ను వేస్తాడు. దీంతో ఆ కోతులన్నీ అందులో చిక్కుకుంటాయి. తొలి ప్రయత్నంగా పేర్నమిట్టలో ఒకేసారి 40 కోతులు బోనులోకి వచ్చి చిక్కుకున్నాయి. పదిరోజులపాటు కోతులు పట్టుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఒక్కో కోతికి 400 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. బోనులో పడుతున్న కోతులన్నింటినీ పీవీఆర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ వద్ద ఉంచి, డ్రైవ్‌ పూర్తయిన వెంటనే వాటిని అడవిలో వదిలి పెడతామని శానిటరీ సూపర్‌వైజర్‌ మోహన్‌రావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top