నిజాలూ జలసమాధే..!

Case Filed on Five Members In Boat Accident - Sakshi

కృష్ణానదిలో బోటు ప్రమాదాన్ని మరుగున పర్చే ప్రయత్నం

ఐదుగురిపై కేసులు నమోదుచేసి పెద్దలను తప్పించే చర్యలు

మూడేళ్ల అక్రమాల దందా కారణంగానే 22 మంది జలసమాధి

కాలయాపన కోసమే విచారణ కమిటీ అన్న ఆరోపణలు

కృష్ణా నదిలో పర్యాటకం ముసుగులో ప్రభుత్వ పెద్దలు మూడేళ్లుగా సాగించిన దందాను మరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయా? బోటు ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తే పెద్దల అవినీతి బాగోతం వెలుగు చూసి పరువుపోతుందని ప్రభుత్వం భయపడుతోందా? అందుకే బోటింగ్‌ మాఫియాకు అండగా నిలిచి, 22 మంది మృతి నెపాన్ని కిందిస్థాయిలో ఐదుగురిపై నెట్టేసి, వారిపై కేసులు నమోదు చేసి, ఆపై విచారణ కమిటీ పేరుతో కాలయాపన చేయనున్నారా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి.

సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా నదిలో పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బోటింగ్‌కు అనుమతులు ఇచ్చేసింది. అమరావతి రాజధాని ప్రకటనకు ముందు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి ఎగువున కృష్ణానదిలో బోట్లు నడిపేది. అయితే నదీలో పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రైవేటు సంస్థలు కన్నేశాయి. వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక మంత్రులతో సంప్రదించి, వచ్చే ఆదాయంలో వాటాలు సమర్పించుకునేలా ఒప్పం దం కుదుర్చుకుని, నాలుగు ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయి. ముందుగా చాంపియన్‌ యాచ్‌ క్లబ్‌ అనుమతులు లేకుండానే రంగంలోకి దిగింది.

గోవాలో ఆ కంపెనీని నిషేధించడంతో అక్కడ పెట్టేబేడ సర్దుకుని వచ్చి కృష్ణాలో బోట్లు తిప్పుతోంది. సీఎం నివాసానికి కూత వేటు దూరంలోనే అనుమతి లేని బోట్లను దర్జాగా తిప్పుతుంటే అధికార యం త్రాంగం, ప్రభుత్వ కళ్లు మూసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రితో యాచ్‌ క్లబ్‌వారికి స్వల్ప విభేదాలు రావడంతో విజిలెన్స్‌ అ«ధికారులు దాడులు చేసి, కొన్ని రోజులు బోట్లను నిలిపివేశారు. మళ్లీ రాజీ పడి అనుమతులు ఇప్పించారు. సింపుల్‌ బోటింగ్‌ క్లబ్, అమరావతి బోటింగ్‌ క్లబ్, రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్‌ సంస్థ కృష్ణానదిలో పాగావేశాయి.

300 బోట్లలో అనుమతి లేనివి 200లకుపైనే
నదీలో 300 బోట్లు తిరుగుతున్నాయి. అయితే వాటిలో 200 పైగా సరైన అనుమతులు లేనివేనని సమాచారం. కాకినాడలోని ఫిషర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఒక సంవత్సరం శిక్షణ పొందిన వారికే బోటు డ్రైవర్‌గా లైసెన్స్‌ ఇవ్వాలి. బోట్ల డ్రైవర్లలో 13 మందికే లైసెన్స్‌ ఉందని సమాచారం. గుంటూరుకు పొరుగునే ఉన్న మరో జిల్లా మంత్రి ప్రోద్భలంతోనే ఓ సంస్థ ప్రకాశం బ్యారేజీ ముందు భాగాన నదిలో రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. అందులో ఆ మంత్రికీ వాటా ఉందని సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రికి వాటా విషయమై తేడా రావడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. నదిలో ప్రమాదానికి గురైన బోటు నడిపిన రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వెంచర్‌ సంస్థ కూడా కృష్ణా జిల్లా మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో పవిత్ర సంగమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు బోట్లు తిప్పేందుకు రూట్‌ మ్యాప్‌ తయారవుతోంది.

పవిత్ర సంగమంలో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజధానికి బోటింగ్‌ కూడా ఫెర్రీ కేంద్రం గానే నడవనుంది. ఈ నేపథ్యంలో ఆ మంత్రి కాకినాడ నుంచి బోట్లు తెప్పించారని, తొలుత ట్రయిల్‌ రన్‌ వేయించిన క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పర్యాటక శాఖ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పర్యాటక శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులకూ బోటింగ్‌ మాఫియాతో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు వాటాలు పంచుకుంటూ బోటింగ్‌ మాఫియాకు అండగా నిలిచి 22 మందిని జలసమాధి చేశారు.

అనుమతులు లేని బోట్లు మాయం
బోటు ప్రమాదం ఘటన తెలియగానే నదిలో తిరిగే అనుమతులు లేని బోట్లను మాఫియా మాయం చేసింది. వివిధ మార్గాల్లో ఇక్కడి నుంచి దాటించేసింది.  ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అనుమతులు లేని బోట్లను సీజ్‌ చేయాల్సిన అధికారులు పట్టించుకోలేదు. దీంతో బోటింగ్‌ మాఫియా తన బోట్లను దారిమళ్లించిందన్న ఆరోపణలున్నాయి. 

ఐదుగురిపై కేసుతో సరా?
బోటు ప్రమాదంపై పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ప్రభుత్వ పెద్దల అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రభుత్వం పరువు పోతుందన్న భయంతో ముందుగా రివర్‌బోటింగ్‌ సంబంధించిన నలుగురుతో పాటు పర్యాటక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిపై కేసులు నమోదు చేశారు. శేషం కొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శీను, వి.విజయసారథి, చిట్టిపై కేసు నమోదు చేశారు. ప్రమాదంపై విచారణకు ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో విచారణ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బోటింగ్‌ మాఫీయా వెనుక ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉన్నందున అయితే ఆ కమిటీ నిస్పక్షపాతంగా విచారణ చేసే అవకాశం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top