సింగపూర్‌ పేరిట పంగనామాలు!

Capital Region Development Authority's Singapore tour for farmers - Sakshi

రాజధాని రైతులకు మళ్లీ మబ్బులు చూపెడుతున్న ప్రభుత్వం

100 మంది రైతులతో సింగపూర్‌ పర్యటనకు సన్నాహాలు

ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఈ యాత్రపై ఆసక్తి చూపని రాజధాని రైతులు

సాక్షి, అమరావతి బ్యూరో : సింగపూర్‌ యాత్ర పేరుతో రాజధాని ప్రాంత రైతులను మభ్యపెట్టేందుకు సీఆర్‌డీఏ అధికారులు సిద్ధమయ్యారు. సింగపూర్‌ యాత్రంటూ కొత్తపల్లవి అందుకున్నారు. ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో చాలా మందికి ఇంత వరకూ ప్లాట్లు కేటాయించలేదు. ఇప్పుడు వంద మంది రైతులను సింగపూర్‌ తీసుకెళ్తామంటూ సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. రాజధాని రైతుల పేరు చెప్పి అధికారపార్టీ కార్యకర్తలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే రైతులను తీసుకెళ్లేందుకే ఈ ఎత్తుగడని రైతులు విమర్శిస్తున్నారు. నిత్యం సాగు, పాడి పనులతో బిజీగా ఉండే తమ వద్ద పట్టాదారు పాస్‌పుస్తకాలే ఉంటాయని, పాస్‌పోర్టులు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. సింగపూర్‌ అభివృద్ధిని చూసేదేముంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపండి అని సూచిస్తున్నారు.

ప్లాట్లు ఎక్కడో చూపనేలేదు..
రాజధాని కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు తమ భూములు భూసమీకరణ (పూలింగ్‌)లో ఇచ్చారు. ఆ సమయంలో వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే సీఆర్‌డీఏ అధికారులు కొందరికే ప్లాట్లు కేటాయించారు. చాలా మందికి ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. కనీసం ఏ రైతు ప్లాటు ఎక్కడుందో అధికారులకు సైతం తెలియని పరిస్థితి. లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్తు, పైప్‌లైన్‌ గ్యాస్‌ వంటి సౌకర్యాలు కల్పించకుండానే ప్లాట్లను కేటాయించిన అధికారులు వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా లేఅవుట్లను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో స్పష్టం చేయడం లేదు. ఇప్పుడేమో సింగపూర్‌ తీసుకెళ్తామంటున్నారు. ‘సింగపూర్‌ పేరు చెప్పి మమ్మల్ని మరోసారి మోసం చేయడానికి టీడీపీ సర్కారు కుట్రలు పన్నుతోంది. ముందు మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపండి. ఆ తర్వాతే సింగపూర్‌ సంగతి’ అంటూ ఎర్రబాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగపూర్‌ పర్యటనపై ఆసక్తి చూపని రైతులు..
రాజధాని పరిధిలో దాదాపు 25 గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు ఇచ్చేశారు. అయితే వారందరూ మూడేళ్లుగా బంగారు పంటలు భూములను సర్కారుకు అప్పగించి సాగుకు దూరమయ్యారు. ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి సమీకరించిన భూముల్ని కార్పొరేట్‌ సంస్థలకు విక్రయించేస్తోంది. రైతులకు అభివృద్ధి చేసి ఇస్తామన్న ప్లాట్ల సంగతి మర్చిపోయింది.
కనీసం లేఅవుట్లను అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో రైతుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో తలలుపట్టుకున్న సీఆర్‌డీఏ అధికారులు చివరకు బీడు భూముల్లో రాళ్లు పాతి ప్లాట్లుగా చూపి లాటరీ ద్వారా కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని తెలుసుకున్న రైతులు సింగపూర్‌ పర్యటనపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

రైతుల వద్ద పాసుపుస్తకాలే ఉంటాయ్‌
రాజధాని రైతుల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలను తీసుకెళ్లడానికి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ వేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వాటిని విస్మరించి రకరకాల పేరుతో మోసం చేయడం సమంజసం కాదు. రైతుల దగ్గర భూములకు సంబంధించిన పాస్‌బుక్‌లు మాత్రమే ఉంటాయి. వారి వద్ద పాస్‌పోర్టులు ఉండవనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహించాలి.
– ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top