అమ్మో..వీధివీధిలో ‘కాల్‌’నాగులు

Call Money Sex Rocket Again Rise In Vijayawada - Sakshi

మళ్లీ బుసలు కొడుతున్న ‘కాల్‌’ నాగులు

కొనసాగుతున్న దాష్టీకాలు

బలవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు

కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌.. బెజవాడలో అందరి వెన్నులో వణుకు పుట్టించి, నగరం పరువు చిన్నబోయేలా చేసిన కుంభకోణం. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, మరికొంతమంది అవినీతి అధికారులు, ఇంకొంతమంది డబ్బున్న వారు కుమ్మక్కై.. చీడపురుగులుగా మారి పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేసిన ఉదంతం. పోలీసుల హడావుడితో అప్పట్లో ఈ ‘కాల్‌’ నాగుల హవా కాస్త తగ్గినట్లు కనిపించినా.. అందులో నిజం లేదని తాజాగా పెనమలూరు సంఘటనతో స్పష్టం అవుతోంది. మళ్లీ చాప కింద నీరులా పాకుతున్న ఈ వ్యవహారంలో వందలాది మంది సామాన్యులు సమిధలు కావడం పరిపాటి అవుతోంది. నూతన ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ‘కాల్‌మనీ’పై కత్తి దూయండని ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.

సాక్షి, అమరావతి : ఒకప్పుడు ఎవరైనా డబ్బు అవసరమైతే స్నేహితులు, బంధువుల వద్ద అప్పు తీసుకునేవారు. వారికి అతి తక్కువ వడ్డీ చెల్లించేవారు. కాలక్రమంలో ఇదొక వ్యాపారంలా మారింది. ప్రజల అవసరాలకు ప్రైవేటు సంస్థలు డబ్బులు ఇస్తున్న వ్యవహరాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అధీకృత వ్యాపార సంస్థలకు కొన్ని నిబంధనలు విధించింది. ప్రజలకు అప్పులిచ్చే వారు ఎంత వడ్డీ వసూలు చేయాలి? అసలు, వడ్డీ ఎలా ఉండాలి? అప్పు ఇచ్చే వారికి, తీసుకునే వారికి ఇరు పక్షాలకు పూర్తి భద్రంగా ఉండేలా నిబంధనలను పెట్టింది.

రూ. 100లకు నెలకు అత్యధికంగా రూ. 2లకు వడ్డీ మించకూడదని నిబంధన ఉంది. అప్పు ఇచ్చే వారి రక్షణ కోసం ప్రామిసరి నోట్లు, అవసరమైతే చెక్కులు తీసుకునేలా నిబంధన విధించారు. ప్రామిసరి నోటును తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించింది. అయితే ఈ నిబంధనలేవీ సక్రమంగా అమలు కాకపోవడం.. అప్పులిచ్చే వాళ్లు తమకు తెలిసిన వారికే అప్పులివ్వడంతో  కాలక్రమంలో ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత బంగారం, స్థిర, చరాస్థులను తనఖా పెట్టుకుని వడ్డీకి ఇచ్చేవారు.. ఇవన్నీ నగర ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చలేకపోవడంతో అనధికార వడ్డీ వ్యాపారులను జనం ఆశ్రయిస్తున్నారు.

వీధివీధిలో ‘కాల్‌’ నాగులు.. 
జనం అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ప్రైవేటు వ్యక్తులు అధిక వడ్డీలకు తెరలేపారు. ఒకప్పుడు రూ. 100కు వడ్డీ రూ. 5లు అంటే అమ్మో అనుకునేవారు. తర్వాత అది రూ. 10లు అయ్యింది. ప్రస్తుతం రూ. 20 నుంచి రూ. 25లకు పెరిగింది. ఇలా అధిక వడ్డీని కాల్‌మనీగా  పిలుచుకుంటున్నారు. ఇలా రూ. లక్షల్లో అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేవలం 5 నెలల్లోనే అసలు రాబట్టుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేదంతా కొసరు కావడంతో చాలా మంది వ్యాపారులు ఈ దందాను ఎంచుకున్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సాయం కావాలంటూ నాయకులను ఆశ్రయిస్తున్నారు. అతికొద్ది కాలంలో అధిక లాభం వస్తుండటంతో కొంత మంది నాయకులే పెట్టుబడిదారులుగా మారి అనుచరులతో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాయకులే వారి వెనుక ఉండటంతో బాధితులు వారిపై ఫిర్యాదులు చేసేందుకు జంకుతున్నారు. వడ్డీలను వసూలు చేసేందుకు బౌన్సర్లును రంగంలోకి దింపేశారు. ఇలా వీధి వీధిలో తిష్టవేసిన కాల్‌నాగులు ఒక్క విజయవాడలోనే ఒక రోజులో రూ. 50 లక్షల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిద్దరోతున్న నిఘా..! 
ఈ వ్యవహారంలో గట్టి నిఘా ఉంచడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఒకప్పుడు అధిక వడ్డీకి ఆశపడ్డ కాల్‌మనీ వ్యాపారులు ఇప్పుడు ఏ మాత్రం భయం లేకుండా మహిళలను ప్రలోభ పెట్టేస్థాయికి చేరుకున్నారు. ఇలాంటి వాటిపై నిఘా ఉంచాల్సిన స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ వంటి నిఘా సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. ఒక వ్యక్తి అనతికాలంలోనే రూ. కోట్లు సంపాదించాడంటే దాని వెనుక ఇలాంటి దందాలుంటే తప్ప అసాధ్యమని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచిన సందర్భాలు అతి తక్కువ. ఫలితంగా నగరప్రజలు, ఇటువంటి దందాల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

ఇలా చేస్తే మేలు.. 
విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసే బడాబాబులపై నిఘా ఉంచి.. వారి ఆర్థిక మూలాలను తెలుసుకోవాలని.. తద్వారా దందాపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.. దీంతోపాటు ప్రజల నుంచి ఇలాంటి వ్యక్తులపై వచ్చే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే ప్రజల్లో పోలీసు, ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top