కబళిస్తున్న కడలి!

Beach Cutting Coconut Crops in Krishna - Sakshi

సముద్రపు కోతకు గురవుతున్న ద్వీపం

చిన్నగొల్లపాలెం, ఏటిమొగ గ్రామాల్లో మోగుతున్న ప్రమాద ఘంటికలు

నీళ్లల్లో కలిసిన సరుగుడు, కొబ్బరి తోటలు

గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం

సముద్రపు కోత.. రైతులు దీన స్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం

సాక్షి, మచిలీపట్నం: కృష్ణా–పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దున బంగాళాఖాతం, ఉప్పుటేరు నడుమ పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలంలో ప్రకృతి వరప్రసాదంగా చినగొల్లపాలెం ఆవిర్భవించింది. తొలుత కృష్ణా తూర్పు డెల్టాతో కలిపి ఉండే ఈ గ్రామం ఉప్పుటేరు స్ట్రయిట్‌కట్‌ తవ్వకంతో దీవిలా రూపాంతరం చెందింది. దీవి సుమారు 10 కిలో మీటర్ల పొడవు 4 కిలో మీటర్ల విస్తీర్ణంలో చిన్నగొల్లపాలెం, ఏటిమొగ, పల్లిపాలెం, సీపేట, జానకీపురం, రాళ్లరేవు, ఏటిపొగరు గ్రామాలు ఉన్నాయి. దీని పరిధిలో ఉన్న 5,000 ఎకరాల సాగు భూమిలో సరుగుడు, కొబ్బరి తోటలు సాగు చేస్తుంటారు. 

కడలి కోత..
దీవి పరిధిలోని చిన్నగొళ్లపాలెం, ఏటిమొగ గ్రామాల్లో కడలి కోత తీవ్రంగా ఉంది. ఈ రెండు గ్రామాల పరిధిలో 500 మీటర్లు సముద్రం ముందుకు చొచ్చుకురాగా.. 2015 నుంచి ఇప్పటి వరకు 250 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. ఇలాగే కొనసాగితే ఇంకో 35 ఏళ్లకు ఈ రెండు గ్రామాలు కనుమరుగు కావడం ఖాయమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  

స్ట్రయిట్‌ కట్‌తో తెగిన బంధం..
కృష్ణా తూర్పు డెల్టాతో కలిసి ఉన్న చినగొల్లపాలెం గ్రామం బంధం స్ట్రయిట్‌కట్‌ తవ్వకంతో తెగిపోయింది. కృష్ణా–పశ్చిమగోదావరి నడుమ విస్తరించిన కొల్లేరులో వరద తీవ్రత పరిష్కారానికి 1965లో మిత్ర కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి చినగొల్లపాలెం–పడతడిక గ్రామాల మధ్య ఉప్పుటేరుకు స్ట్రయిట్‌ కట్‌ తవ్వాలని ప్రతిపాదించారు. తద్వారా వరద నీరు సముద్రంలోకి వెళుతుందని భావించిన ప్రభుత్వం 1977లో ఉప్పుటేరు ఓల్డ్‌కోర్సుకు సమాంతరంగా చినగొల్లపాలెం–పడతడిక గ్రామాల మధ్య స్ట్రయిట్‌ తవ్వారు. దీంతో కృష్ణా డెల్టాలో కలిసి ఉన్న చినగొల్లపాలెం విడిపోయి దీవిలా మారింది.

సారవంతమైన భూములు
సారవంతమైన చినగొల్లపాలెం భూములు కోతకు గురవుతూనే ఉన్నాయి. ఏటా వందల ఎకరాల భూమికి గుండెకోత తప్పడంలేదు. పడతడిక–చినగొల్లపాలెం ఉప్పుటేరుకు తవ్విన స్ట్రయిట్‌కట్‌ ఎం29 కారణంగా చినగొల్లపాలెం వెళ్లే సాగునీరు, తాగునీటి కాలువలు, రహదారి సౌకర్యాలు తెగిపోయాయి. వందలాది ఎకరాల భూమి కోతకు గురికావడంతో దీని నివారణకు 1994 ప్రాంతంలో యనమదుర్రు కాలువ ప్రవాహం ఉప్పుటేరు ఓల్డ్‌ కోర్సుకు వెళ్లేలా మరోస్ట్రయిట్‌కట్‌ తవ్వి ఓల్డ్‌కోర్సుపై అడ్డుకట్ట వేశారు. ఆ ప్రయత్నం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.   

ప్రాణాలు కడలిపాలు..
బతుకుపోరులో చలించని ధైర్యంతో జీవనం సాగిస్తున్న చినగొల్లపాలెం వాసులను కలవరపెట్టిన ఎన్నో ఘటనలు ఉన్నాయి. గ్రామానికి ఆనుకుని   ఉన్న బీచ్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో ఏడుగురు ఎస్‌ఆర్‌కేఆర్‌(భీమవరం) ఇంజినీరింగ్‌ కాళాశాల విద్యార్థులు ఉండటం కలకలం రేపింది.

ప్రధాన సమస్యలు
గతంలో దీవికి తూర్పు వైపున పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుగా పాతకాలువ పేరుతో ఉప్పుటేరు పాయ ఉండేది. దీని ద్వారా ఎగువనున్న భీమవరం కాలువ, మొగల్తూరు కాలువ, కొల్లేరు ముంపునీరు సముద్రంలో కలిసేది. వరద నీటి తాకిడి ఎక్కువగా ఉండటంతో దీవికి ముప్పుగా భావించి 1970 ప్రాంతంలో దీవికి పశ్చిమాన పడతడికి పంచాయతీ సరిహద్దుగా మరో కాలువను తవ్వారు. కొల్లేరు నుంచి వచ్చే ముంపు నీరు ఈ కాలువ ద్వారానే బంగాళాఖాతంలో కలుస్తుంది. పాతకాలువ, కొత్తకాలువల ముఖద్వారాలు పూడుకు పోవడంతో సముద్రం నీరు మైదాన ప్రాంతంలోకి చొచ్చుకు వస్తోంది.   

చేయాల్సిందిదీ..
కాలువ ముఖద్వారాలు పూడికతో నిండిపోయాయి. వాటిలో పూడికతీర పనులు చేపట్టాలి. సముద్రం వెంబడి రాతి కట్టడాన్ని నిర్మించి నీరు ముందుకు చొచ్చుకురాకుండా అరికట్టాలి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాబార్డ్‌ నిధులతో నీటిని నివారించే పనులు చేపట్టాలని ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.

ఐదేళ్లలో చాలా పోయింది..
నాది తూర్పుగోదావరి జిల్లా.  ఐదేళ్లుగా చినగొల్లపాలెం ద్వీపానికి వస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాను. నేను ఇక్కడకు రావడం మొదలుపెట్టిన కొత్తలో ద్వీపం అందాలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అసలు పొంతనలేదు. చాలా వరకూ కోతకు గురయ్యి కడలిలో కలిసిపోయింది. ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే చిన్నగొల్లపాలెం అసలు కనిపించదు.
– ప్రభుదాస్, మత్స్యకారుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top