జాబేది బాబూ!

జాబేది బాబూ! - Sakshi


రాష్ట్రంలో భర్తీ కావాల్సిన ఉద్యోగాల సంఖ్య 1.38 లక్షలు

ఇది ప్రభుత్వమే అధికారికంగా తేల్చిన సంఖ్య

వీటి భర్తీకి ఎలాంటి అడ్డంకులూ లేవు

అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు... ఇస్తారో లేదో తెలీదు

జాబు రావాలంటే బాబు రావాలన్న హామీ గాలికి

ఇంటికో ఉద్యోగం మాటేమో.. ఉన్న ఖాళీలే భర్తీ చేయని చంద్రబాబు

మరోవైపు ఆర్థిక, ప్రణాళిక, మున్సిపల్ శాఖల నిండా కన్సల్టెంట్లు

వారికోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పటివరకూ నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడా మాటే ఎత్తడంలేదు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ఊరూవాడా ఊదరగొట్టిన తెలుగుదేశంపార్టీ... అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగ ఖాళీలు 1.38 లక్షలున్నా పట్టించుకోవడంలేదు.రాష్ట్ర విభజన జరిగి ఉద్యోగుల కేటాయింపులు చేయాల్సిన సమయంలో రెండు ప్రభుత్వాలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న మొత్తం ఉద్యోగాలు, ఖాళీల వివరాలను సేకరించాయి. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,97,686. భర్తీ కావాల్సిన ఉద్యోగాల సంఖ్య 1,42,828. అందులో 4,081 ఉద్యోగాలు రాష్ట్రస్థాయికి చెందినవి. జిల్లా స్థాయిలో మొత్తం 1,15,101 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే తేల్చింది. ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవలేని పేద వర్గాలకు చెందిన విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌తో సరిపెట్టుకుంటారు.అలాంటివారు లక్షలాదిమంది ప్రభుత్వంలో నాలుగోతరగతి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ఉద్యోగాలు జిల్లా స్థాయిలోనే 22,519 ఖాళీలున్నాయి. రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో 4,081 ఖాళీలను పక్కనపెడితే... జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో ఖాళీలున్న 1.38 లక్షల పోస్టుల భర్తీకి ఎలాంటి అడ్డంకులూ లేవు. వీటి భర్తీకి రాష్ట్ర విభజనతో గానీ, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీకి ఏర్పాటైన కమలనాథన్ కమిటీతో గానీ ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపట్టలేదు. ఉద్యోగాల భర్తీ కోసం బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. పైగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయవద్దని ఏపీపీఎస్సీకి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో మెమో జారీ చేసింది.

 

కన్సల్టెంట్లకు రూ.100 కోట్లు

నిరుద్యోగుల ఆకలిబాధలను ఏమాత్రం పట్టించుకోని టీడీపీ సర్కారు సూటు, బూటు వేసుకుని ల్యాప్‌టాప్‌లు పట్టుకుని తిరిగే స్వదేశీ, విదేశీ కన్సల్టెంట్ల సేవలో మాత్రం నిత్యం తరిస్తోంది. ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, మున్సిపల్ శాఖలను కన్సల్టెంట్ల మయం చేసింది. కన్సల్టెంట్ల కోసం ఏకంగా రూ.100 కోట్లు వ్యయం చేస్తోంది. ఒక్క ప్రణాళికా శాఖలోనే ఏకంగా 70 మంది కన్సల్టెంట్లను నియమించి, వారికోసం రూ.50 కోట్లు కేటాయించారు.ఆర్థిక శాఖలో పది మంది కన్సల్టెంట్ల నియామకం జరగ్గా, మున్సిపల్ శాఖలో కూడా పలురంగాల్లో కన్సల్టెంట్ల నియామకం జరిగింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని పట్టించుకోకుండా ఈ విధంగా నెలకు లక్షల్లో చెల్లిస్తూ కన్సల్టెంట్లను నియామకం చేపట్టడం అన్యాయమని సచివాలయ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించి దాని ఆధారంగా రంగు రంగుల ప్రజెంటేషన్లను రూపొందిం చడం తప్ప కన్సల్టెంట్లు చేసేదేమీ లేదని విమర్శిస్తున్నారు.

 

25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు

చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇవ్వడం మాటెలా ఉన్నా... అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులపై వేటేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే 15 వేలమంది ఆదర్శ రైతులను తొలగించింది. ఆ తర్వాత గృహనిర్మాణశాఖలో 7,000 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను ఇంటికి పంపింది. ఉపాధిపథకంలో పనిచేస్తున్న 2,000మంది క్షేత్రస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్టులు తదితర పోస్టుల్లో ఉన్న 1,500 మంది కాంట్రాక్టు ఉద్యోగాలను రద్దు చేసింది. ఇలా దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top