ఆర్టీసీ.. ఆనంద హారన్‌

APSRTC Employees Happy on Permanent Status - Sakshi

జిల్లాలోని 9 డిపోల్లోనుంచి 3285 మంది ప్రభుత్వ ఉద్యోగులవుతున్న వేళ..

నేటి సాయంత్రం 3 గంటలకు రాజమహేంద్రవరం డిపోలో విలీన సంబరాలు

రాజమహేంద్రవరం : ఈ ఘడియ కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూపులు...ఆ సమయం రానే వచ్చింది... ఇంకా తెలవారదేమీ అంటూ బుధవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లూ సాధ్యం కాదంటూ పాలకులు పక్కన పెట్టేసిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు వైఎస్సార్‌ సీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జీవం పోయడంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం అర్ణవమైంది.రాజమహేంద్రవరం సిటీ: ఏళ్ల తరబడి కార్మికులుగా నానా అగచాట్లు పడిన ఆర్టీసీ కార్మికులు తెల్లవారితే చాలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతుండటంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయడంతోఇన్నేళ్లు జీతం భద్రత, ఉద్యోగ భద్రత లేని తమ జీవితాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు కురిపించారంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

కొత్త సంవత్సరమైన 2020 సంవత్సరం మొదటి రోజు నుంచీ జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 3285 మంది ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతున్నారు. దేశవ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలు జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కార్మికులుగా ఉన్న సమయంలో అధికారుల వ్యక్తిగత స్వార్ధానికి దాసోహం చేయాల్సిన ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని, ప్రభుత్వ ఉద్యోగిగా స్వేచ్ఛాపూరిత వాతావరణం నెలకొననుందని అంటున్నారు. సంస్థ లాభాలతో కూడిన జీతాల చెల్లింపుల నుంచి ట్రెజరీ ద్వారా ప్రతీనెలా ఒకటో తేదీన అందుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కార్మికులు కక్ష సాధింపుల నుంచి బయటపడే అవకాశం ఏర్పడింది.  విలీన విధానంలో కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సమయంలో ప్రతి ఉద్యోగి బాధ్యత  మరింత పెరుగుతుందని డిపో మేనేజర్‌ టి.పెద్దిరాజు పేర్కొన్నారు.

నేడు విలీన సంబరాలు
ప్రభుత్వలో ఆర్టీసీ విలీనమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం డిపోలో విలీన సంబరాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్‌ టి.పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నగరంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని యూనియన్ల ప్రతినిధులు పాల్గొంటున్నాయన్నారు.

అద్భుతమైన నిర్ణయం
ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం అద్భుతమైన నిర్ణయం. ఏళ్ల తరబడి కార్మికులుగా విధులు నిర్వహించిన వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఉద్యోగాలకు భద్రత ఏర్పడుతుంది. పల్లెలకు పట్టణాలకు అనుసంధానం ఏర్పడుతుంది. ఉద్యోగులు మరింత బాధ్యతతో విధులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది.– టి.పెద్దిరాజు, డిపో మేనేజర్, రాజమహేంద్రవరం

కార్మికుల సంక్షేమమే మారిపోనుంది
ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన కార్మికుల సంక్షేమం పూర్తిగా మారిపోనుంది. నూతన ఆవిష్కరణలు, కొత్త విధానాలతో ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో లక్షలాది కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి.– బాలకృష్ణ, అసిస్టెంట్‌ డిపో మేనేజర్, రాజమహేంద్రవరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top