వైఎస్సార్‌సీపీ నాకు కన్నతల్లి లాంటిది : వాసిరెడ్డి పద్మ

AP Women Commission Chairperson Vasireddy Padma Praises CM Jagan - Sakshi

ఏపీ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తనకు కన్నతల్లి లాంటిదని అన్నారు. ‘మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా పని చేయడం నా అదృష్టం. మహిళలకు నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో 50 శాతం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. మహిళా కమిషన్ అంటే అన్యాయం జరిగిన తరువాత వెళ్లి పరామర్శించడం కాదు. మహిళలకు అన్యాయం, వారిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామ వాలంటీర్, సచివాలయ ఉద్యోగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించారు. మహిళలకు చిరస్మరణీయంగా నిలిచిపోయే కార్యక్రమాల్ని సీఎం జగన్‌ చేపడుతున్నారు’అన్నారు.
(చదవండి : వాసిరెడ్డి పద్మ ప్రమాణ స‍్వీకారం)

కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం వాసిరెడ్డి పద్మ చాలా కష్టపడ్డారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్టీల్‌ లేడీ అని పిలుస్తారని చెప్పారు. మహిళల సమస్యలపై వాసిరెడ్డి పద్మకు మంచి అవగాహన ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టిందని విమర్శించారు.

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ఆడవాళ్ల పట్ల తనకున్న గౌరవాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారని అన్నారు. గిరిజన మహిళలకు అవకాశాలు కల్పించారని తెలిపారు. ఎస్సీ,ఎస్టీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని ధ్వజమెత్తారు. ఇద్దరు ఎస్సీ మహిళలకు సీఎం జగన్‌ మంత్రులుగా అవకాశం కల్పించారని వెల్లడించారు. వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారని, వాయిస్‌లేని మహిళలకు  ఆమె గొంతుకగా మారుతారని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో చట్టం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు.

ఆమె అర్హత కలిగిన వ్యక్తి : స్పీకర్‌ తమ్మినేని సీతారాం
‘వాసిరెడ్డి పద్మ, నేను అధికార ప్రతినిధులుగా పని చేశాం. ప్రజా సమస్యలపట్ల ఆమెకు మంచి అవగాహన ఉంది. అర్హత కలిగిన వ్యక్తిని అర్హత గలిగిన పదవికి చైర్ పర్సన్‌గా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మహిళకు సామాజిక న్యాయం చేస్తారని వినేవాడిని. దాన్ని చట్టరూపంలో పెట్టారాయన. ఆకాశంలో సగం కాదు అవకాశాల్లో కూడా మహిళలు సగమని సీఎం జగన్‌ నిరూపించారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వం పనుల్లో మహిళలకు 50 శాతం అవకాశం చట్టం చేశారు. రేపు నా స్థానంలోకి కూడా మహిళ వస్తారేమో చెప్పలేం’ అని తమ్మినేని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top