డిసెంబర్‌లోగా హైకోర్టు భవనం

AP Referral to Supreme Court about High Court building - Sakshi

సుప్రీంకోర్టుకు ఏపీ నివేదన

మూడేళ్లుగా ఇదే చెబుతున్నారన్న కేంద్రం, తెలంగాణ

అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీకి ధర్మాసనం ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణం పూర్తవుతుందని, అప్పటివరకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలని 2015లో ధన్‌గోపాల్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను గత ఆగస్టు 30న విచారించిన ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు ఇచ్చింది. తాజాగా సోమవారం జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌.నారీమన్‌ వాదనలు ప్రారంభించారు. జస్టిస్‌ సిక్రీ జోక్యం చేసుకుని.. ‘మీరు ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఎంత సమయం అవసరం?’ అని ప్రశ్నించారు. ‘హైకోర్టు భవనం, న్యాయమూర్తులు, సిబ్బంది వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. డిసెంబరులోగా పూర్తవుతుంది..’ అని నారీమన్‌ నివేదించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఏపీకి వదిలిపెట్టి తాము తాత్కాలికంగా మరోచోట ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం గత విచారణలో ప్రతిపాదించింది...’ అంటూ గుర్తుచేశారు. జస్టిస్‌ సిక్రీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు అక్టోబర్‌లోకి వచ్చాం. డిసెంబర్‌ దగ్గర్లోనే ఉంది.

ఇప్పుడు ఆ ప్రతిపాదన అవసరం లేదు కదా..’ అని వ్యాఖ్యానించారు. అయితే ఏపీ గత మూడేళ్లుగా ఇదే చెబుతోందని కేకే వేణుగోపాల్, తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేస్తుందని, అప్పటివరకు పరిష్కారం కానిపక్షంలో తిరిగి తమను ఆశ్రయించవచ్చని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అఫిడవిట్‌ సిద్ధంగా ఉంది.. ఇప్పుడే సమర్పిస్తామని నారీమన్‌ చెప్పగా.. ‘ఇన్నేళ్లుగా చెబుతున్నది ఇదే కదా..’ అంటూ వేణుగోపాల్‌ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ‘ఏంటి ఇబ్బంది’ అంటూ జస్టిస్‌ సిక్రీ ఏపీ న్యాయవాదిని ప్రశ్నించారు. ‘ఏమీ లేదు.

ఇప్పుడు ఏపీలోని అధికార పార్టీ ఎన్డీయేలో లేదు..’ అని ఆయన బదులిచ్చారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్రం రాజధాని నిర్మాణానికి, హైకోర్టు భవనాలు, ఇతర భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చిందని వేణుగోపాల్‌ తెలిపారు. ఇప్పుడు ఏపీ అఫిడవిట్‌ ఇస్తే కేసు పరిష్కారమైనట్టే కదా? అని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. వాదనల అనంతరం పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలుకు 2 వారాల గడువిస్తూ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ తరఫున అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ ఎస్‌.ఉదయకుమార్‌ సాగర్, ఏపీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top