పోలీస్‌ తంత్రం

AP police announced to VIS for village crimes

నేర నియంత్రణకు వి.ఐ.ఎస్‌ను వెలుగులోకి తెచ్చిన పోలీసు శాఖ

విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ద్వారా గ్రామాల సమాచారం సేకరణ

ఒక్కో కానిస్టేబుల్‌కు పల్లెల కేటాయింపు

ఇప్పటికే మార్కాపురం డివిజన్‌లో అమలు

బరితెగించిపోతున్న దొంగలు శృతి మించుతున్న వాహనాల తస్కరణ రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు జనం ఊపిరి తీస్తున్న కాల్‌ మనీ వ్యాపారులు మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు
మెట్టినిళ్లలో రక్షణ కోల్పోతున్న గృహిణులు మోసాల అడ్డాగా ఆన్‌లైన్‌ ఎటు చూసినా బ్రేకింగ్‌ న్యూస్‌

ప్లీజ్‌ వెయిట్‌ ఎ సెకండ్‌ ఇప్పుడు వి.ఐ.ఎస్‌. వచ్చేస్తోంది అదే విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం జిల్లాలోని ప్రతి పల్లె సమాచారం పోలీసుల గుప్పెట్లోకి వెళ్లిపోనుంది ఇంకా క్రిమినల్స్‌ ఆగడాలు చెల్లవు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేవారికి దండన తప్పదు అదేంటో వివరంగా తెలుసుకుందాం!

ప్రకాశం , మార్కాపురం: నేరాలు ఎక్కువవుతున్నాయి. బాధితులు పెరిగిపోతున్నారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతోంది. దీనిని ఎలా నివారించాలి? అని ఒక పోలీస్‌ అధికారికి వచ్చిన ఆలోచన ఆ తర్వాత జిల్లా మొత్తానికి ఆదర్శమైంది. మార్కాపురం డీఎస్పీ ఎన్‌.వి.రామాంజనేయులు సబ్‌ డివిజన్‌లో అమలు చేసిన విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (వి.ఐ.ఎస్‌) ద్వారా గ్రామాల సమగ్ర సమాచారం పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం వి.ఐ.ఎస్‌ జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీస్‌ శాఖ శరవేగంగా పని చేస్తోంది.

నిర్ణీత ఫార్మెట్‌..
ఓ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గ్రామాలన్నింటినీ పోలీసులు దత్తత తీసుకుంటారు. ఒక్కో కానిస్టేబుల్‌కు రెండు, మూడు గ్రామాలను కేటాయిస్తారు. నిర్ణీత ఫార్మెట్‌ ప్రకారం సమగ్ర సమాచారాన్ని ఆ కానిస్టేబుల్‌ సేకరించాలి. మార్కాపురం డివిజన్‌లోని 198 గ్రామ పంచాయతీల్లోని 12 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం పూర్తి కాగా, జిల్లాలోని దర్శి, ఒంగోలు, చీరాల, కందుకూరు సబ్‌ డివిజన్లలో సమాచారం సేకరిస్తున్నారు.

వి.ఐ.ఎస్‌ ఏం చేస్తుంది?
ప్రతి కానిస్టేబుల్‌ వారికి కేటాయించిన గ్రామ మ్యాప్‌ను, జీపీఎస్‌ లోకేషన్, హద్దులు, గ్రామ చరిత్ర నమోదు చేయాలి.
గతంలో ఆ గ్రామంలో భూతగాదాలు, హత్యలు, కులమతాల మధ్య గొడవలు, అనుమానితులు, సివిల్, క్రిమినల్‌ తగదాల వివరాలు నమోదు చేయాలి.
కులాలు, మతాల వారీగా గ్రామ జనాభా సేకరించాలి. వీరిలో ఉద్యోగులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, వివిధ వృత్తుల వారు, వారి నేరచరిత్రను నమోదు చేయాలి.
గ్రామంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, తదితర అంశాలను రికార్డు చేయాలి.
గ్రామ ప్రధాన ఆదాయ వనరులు, గ్రామస్తుల ప్రధాన వృత్తి, పంటలు, ఆర్‌ఎంపీ, పీఎంపీలు, హాస్టల్స్, సెల్‌ఫోన్‌ టవర్స్, రైస్‌మిల్లులు, ఇటుకబట్టీలు, డ్వాక్రా గ్రూపుల వివరాలు సేకరించాలి.
గతంలో జరిగిన దొంగతనాలు, తగాదాలు, ప్రమాదాలు, అవి జరిగిన ప్రాంతాలు, రౌడీషీటర్ల వివరాలు నమోదు చేస్తారు.
ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న గన్‌లు, బ్లాస్టింగ్‌ సంఘటనల వివరాలు తెలుసుకుంటారు.
గతంలో మావోయిస్టు సానుభూతిపరులు, ప్రస్తుతం వారి జీవన విధానం పరిశీలిస్తారు.
గ్రామంలో ఉన్న ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, యజమానుల వివరాలు నమోదు చేస్తారు.
 గ్రామంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, చర్చిలు, నిర్వాహకుల వివరాలతో పాటు వీరందరి ఫోన్‌ నంబర్లు నమోదు చేస్తారు.

ఉపయోగం తథ్యం
గ్రామంతో పాటు అక్కడ నివాసముంటున్న అందరి వివరాలు నమోదు చేయటం ద్వారా పోలీసుల వద్ద  సమగ్ర సమాచారం నిక్షిప్తమవుతుంది. నేరస్తుల కదలికలు, పాతనేరస్తుల జీవన విధానం తెలుసుకోవచ్చు. ఎక్కడైనా ఆటోలు, ట్రాక్టర్ల దొంగతనాలు జరిగితే ఆ సమాచారాన్ని వెంటనే చేరవేయటం, గ్రామంలోని ముఖ్యమైన వ్యక్తులతో నేరుగా సంభాషించడం ద్వారా సమాచారం త్వరగా లభిస్తుంది. కులాల వారీగా వివరాలు సేకరించటం ఉపయుక్తమవుతుంది. నిరక్షరాస్యులు ఉన్న చోట అసమానతలు, మూఢనమ్మకాలు, కులవివక్ష అమలయ్యే ప్రభావం ఉంటుంది కాబట్టి పోలీసులు ముందస్తుగా గ్రామసభలు పెట్టి గొడవలు నివారించవచ్చు. ముందుగానే బైండోవర్‌ చేసే అవకాశం లభిస్తుంది. వాహనాల వివరాల సేకరణ ద్వారా లైసెన్స్‌ ఎంత మందికి ఉందో ఎంతమందికి లేదో తేలిపోతుంది. సివిల్‌ వివాదాలు ఉన్నట్లయితే ఇరువర్గాలను పిలిపించి రాజీ చేసి తద్వార గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పవచ్చు.

పాచిక పారింది..
ఇటీవల కంభం పోలీసులు ట్రాక్టర్ల దొంగలను అదుపులోకి తీసుకునేందుకు విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఉపయోగపడింది. పశ్చిమ ప్రకాశంలో ట్రాక్టర్ల దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు తమ పరిధిలో ఉన్న ట్రాక్టర్ల యజమానులను అప్రమత్తం చేశారు. ఎవరైనా ట్రాక్టర్లను అమ్మేందుకు ప్రయత్నిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. దొంగలు తమ ప్రయత్నాన్ని మొదలు పెట్టగానే అరెస్టు చేయగలిగారు.

నేరనియంత్రణ కోసమే: రామాంజనేయులు: డీఎస్పీ: మార్కాపురం
పశ్చిమ ప్రకాశంలో నేరనియంత్రణ కోసం ఆలోచించి విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ప్రారంభించాం. డివిజన్‌ మొత్తం సమాచారం సేకరించాం. రెండు వారాల్లో సమాచారాన్ని అంతా క్రోడికరించి సిద్ధం చేస్తాం. దీని వలన ఏ గ్రామంలో ఏ సంఘటన జరిగినా వెంటనే మాకు తెలిసిపోతుంది. అనుమానితుల వివరాలు కూడా క్షణాల్లో తెలుస్తాయి.

జిల్లా అంతటా అమలు: సత్యఏసు బాబు: ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా విలేజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ప్రారంభించాం. ఇప్పటికే 50వేల మంది సభ్యులతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశాం. సమగ్ర సమాచారం మా దగ్గర ఉంటుంది. ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి విలేజ్‌కి కానిస్టేబుళ్లు వెళ్లి అన్ని వివరాలు సేకరిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top