ప్రజాగ్రహం..

ప్రజాగ్రహం.. - Sakshi


రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ పట్ల నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హోదా సాధన పోరాటంలో భాగంగా విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకొని, విమానాశ్రయంలో నిర్బంధించడంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను నిర్బంధించడం రాక్షసత్వమని నిప్పులు చెరిగారు.



శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు, వివిధ రూపాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రజా ఉద్యమాలపై సర్కారు అణచివేత వైఖరిని తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యమకారులపై  పోలీసులు ఉక్కుపాదం మోపారు. అదుపులోకి తీసుకొని, కేసులు నమోదు చేశారు.     – సాక్షి నెట్‌వర్క్‌


సిక్కోలులో 180 మంది అరెస్టు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు 180 మంది వైఎస్సార్‌సీపీ సహా వివిధ పార్టీల కార్యకర్తలను అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు తదితరులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


విజయనగరంలో రోడ్లపై బైఠాయింపు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్తవలస జంక్షన్‌లో 15 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరంలో పార్టీ నేతలు పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.





చంద్రబాబు దావోస్‌ దాబా

విశాఖ జిల్లాలోని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు దేవారపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం కొత్తూరు జంక్షన్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అమర్‌నాథ్‌తో సహా పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని మనోరమ థియేటర్‌ జంక్షన్‌లో నడిరోడ్డుపై ‘చంద్రబాబు దావోస్‌ దాబా’ పేరిట దోశలు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శలు, మానవ హారాలు నిర్వహించారు. విశాఖలో వైఎస్‌ జగన్‌కు మద్దతుగా సీపీఎం కార్యకర్తలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. సింహాచలం తొలిపాంచాల వద్ద వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం పూజలు చేశారు. ఏయూలో విద్యార్థి సంఘాల నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.


సముద్రంలో జలదీక్ష

తూర్పు గోదావరి జిల్లా అంతటా నిరసనలు మిన్నంటాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం, అమలాపురంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కాకినాడ బీచ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సముద్రంలో జలదీక్ష నిర్వహించారు. తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ కడియంలో పందుల ప్రదర్శన నిర్వహించారు. అమలాపురంలో పార్టీ నేతలు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, రంపచోడవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రాజమహేంద్రవరంలో జక్కంపూడి విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు.  



‘పశ్చిమ’లో సీఎం దిష్టిబొమ్మ నిమజ్జనం

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు వామపక్ష పార్టీలు, జనసేన నాయకులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు  దిష్టిబొమ్మను నిమజ్జనం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో నేతలు రోడ్డుపై బైఠాయించారు.


కదం తొక్కిన కార్యకర్తలు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఉయ్యూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ రోహిణీదేవికి వినతిపత్రం అందించారు. జిల్లావ్యాప్తంగా నిరసన చేపట్టిన పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రాభివృద్ధితోపాటు యువత భవిష్యత్తు బాగుంటుందని వైఎస్సార్‌సీపీ నేతలు  కొలుసు పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు.


సుజనా చౌదరిపై ఫిర్యాదు

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకులు, విద్యార్థులు, యువతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు విజయవాడలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ప్రత్యేక హోదాగ్ని

గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత మర్రి రాజశేఖర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. నరసరావుపేటలో  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరులో షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి, బాపట్లలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులు పలుచోట్ల కార్యకర్తలను అరెస్టు చేశారు. బైండోవర్‌ కేసులు పెట్టారు. తెలుగు సినీ హీరోలు ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.




ప్రకాశం జిల్లాలో నేతల గృహ నిర్బంధం

ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు వామపక్షాల నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. నేతలతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.



తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ  మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు.  



‘హోదా’  అంటే అరెస్టులే

తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతియుత «నిరసన ప్రారంభించారు. దీనికి నేతృత్వం వహించిన భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు మరో 20 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర బైఠాయించిన సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోదా మాట ఎత్తితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. తుమ్మలగుంట చౌరస్తాలో ఆర్టీసీ బస్సుల అద్దాలు తుడుస్తూ నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామిలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top