ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు వేళాయె

AP Model Schools Admissions Open in PSR Nellore - Sakshi

గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట

జిల్లాలోని 10 పాఠశాలల్లో 800 సీట్లు

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

నెల్లూరు, దుత్తలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులకు విద్యాశాఖ కార్పొరేట్‌స్థాయి విద్యను ఏపీ ఆదర్శ పాఠశాలల్లో కల్పిస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండే ఈ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 11 వరకు ఇది కొనసాగనుంది.

ఒక్కో పాఠశాలలో 80 సీట్లు
జిల్లావ్యాప్తంగా దుత్తలూరు, కలిగిరి, సీతారామపురం, కొండాపురం, వెంకటగిరి, నందవరం, ఒట్టూరు(కావలి), ఏఎస్‌పేట, తడ, మావిళ్లపాడు(డీవీసత్రం)ల్లో మొత్తం 10 పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 80 సీట్లు కేటాయించారు. ఈ లెక్కన 800 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందనున్నారు.

ప్రవేశ అర్హత
2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4, 5 తరగతులు విధిగా చదివి ఉండాలి. ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01–09–2007 నుంచి 31–08–2009 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01–09–2005 నుంచి 31–08–2009 మధ్య జన్మించి ఉండాలి.

రిజర్వేషన్‌
ప్రతి తరగతిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం సీట్లు కేటాయించారు. వికలాంగులకు 3 శాతం, బాలికలకు 33.31 శాతం సీట్లు కేటాయించారు. నిర్దేశించిన విభాగాల్లో దరఖాస్తులు రాకపోయినా, అభ్యర్థులు లేకపోయినా ఇతర కులాల నుంచి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం సీట్లను జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

దరఖాస్తు విధానం
ఏపీ ఆన్‌లైన్‌ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఠీఠీఠీ.ఛిట్ఛ.్చp.జౌఠి.జీn, ్చ pఝట.్చp.జౌఠి.జీ n వెబ్‌సైట్ల ద్వారా ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్‌ ఫీజు రుసుమును నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.30 చెల్లించాలి.

మార్చి 31న ప్రవేశపరీక్ష
మార్చి 31న ప్రవేశ పరీక్ష ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఆయా మండలాల్లోని మోడల్‌ పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 వరకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. 5వ తరగతి సామర్థ్యాలకనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లీష్‌ పాఠ్యాంశాలకు సంబంధించి 25 మార్కుల చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు కనీసం 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. ఏప్రిల్‌ 11న మెరిట్‌ జాబితా విడుదల చేసి 15న ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. 17 నుంచి 19 వరకు కౌన్సిలింగ్‌ ఉంటుంది. ఏప్రిల్‌ 22న అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆదర్శ పాఠశాలలో ఒక్కసారి ఆరో తరగతిలో ప్రవేశిస్తే ఇంటర్‌మీడియట్‌ పూర్తయ్యేవరకు అన్ని సౌకర్యాలు ఉచితంగా అందుతాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top