‘అమ్మకు వందనం’ కోసం విరాళాల సేకరణ

‘అమ్మకు వందనం’ కోసం విరాళాల సేకరణ


► హెడ్మాస్టర్లు, టీచర్లకు సర్కారు ఆదేశంసాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో వింత నిర్ణయం తీసుకుంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు కొత్త పని అప్పగించింది. విద్యాభ్యాసం చేయించాల్సిన వారికి విరాళాలు సేకరించాలని వింత ఆదేశం జారీచేసింది. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కొత్తగా చేపట్టనున్న ‘అమ్మకు వందనం’  కార్యక్రమం కోసం విరాళాలు సేకరించాలని ప్రభుత్వం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేసింది. దసరా సెలవులకు ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, తేదీని త్వరలోనే వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.ఈ కార్యక్రమానికి రూ.2.5 కోట్లు అవసరమవుతాయని, ప్రభుత్వం తరఫున రూ.1.25 కోట్లు అందజేస్తామని తెలిపారు. మిగతా మొత్తాన్ని హెడ్మాస్టర్లు, టీచర్లు విరాళాల రూపంలో సమీకరించుకోవాలని సూచించారు. పాఠశాలల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి విరాళాలు తీసుకోవాలని చెప్పడం సిగ్గుచేటని విద్యారంగ నిపుణులు దుయ్యబడుతున్నారు.గతంలోను అమరావతి నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.10 తక్కువ కాకుండా విరాళం తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కుతీసుకుంది.

Back to Top