యూసీలు ఇవ్వలేదు.. నిధులు రాలేదు..

AP Government Not Submitted UCs For Medical College Funds - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినియోగ ధృవపత్రాలు(యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు) సమర్పించనందునే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు నిధులను విడుదల చేయలేకపోతున్నట్లు రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే సమాధానం చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సులు ప్రవేశపెట్టి, పీజీ కోర్సులలో సీట్లు పెంచడానికి వీలుగా కాలేజీలను పటిష్ట పరచి, అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. వాటిలో ఆంధ్రా మెడికల్‌ కాలేజీ-విశాఖపట్నం, గుంటూరు మెడికల్‌ కాలేజీ, సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ-విజయవాడ, రంగరాయ మెడికల్‌ కాలేజీ-కాకినాడ, కర్నూలు మెడికల్‌ కాలేజీ, ఎస్వీ మెడికల్‌ కాలేజీ-తిరుపతి, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ-అనంతపురం ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు. 2016-17, 2018-19 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులను పటిష్ట పరచి అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేంద్ర సాయం కింద రెండేళ్లలో మొత్తం 81 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.

అయితే, జీఎఫ్‌ఆర్‌ నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిధులకు సంబంధించి వినియోగ ధృవ పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి నిధుల విడుదల సాధ్యపడుతుందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి కర్నూలు మెడికల్‌ కాలేజీకి 76 లక్షలు, అనంతపురం గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీకి 79 లక్షల రూపాయలు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అందిన తర్వాత విడుదల చేస్తామని చౌబే తెలిపారు. సాధ్యమైనంత త్వరలో యూసీలను తమ మంత్రిత్వ శాఖకు  సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.

ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చలేం
న్యూఢిల్లీ : 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను(టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్సెస్‌) మార్చే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్‌ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. ఏ అథారిటీకైనా విధివిధానాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం సిఫార్సు చేయబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా నిర్ధారణ కోసం 15వ ఆర్థిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 24,340 కోట్ల మేర నష్టపోయే అవకాశం ఉన్న విషయం వాస్తవమేనా? అలాంటి పరిస్థితులలో ఆర్థిక సంఘం విధివిధానాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసే అవకాశం ఉందా? అని వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280కి అనుగుణంగానే ఆర్థిక సంఘం ఏర్పాటు జరిగిందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వాములందరితో సంప్రదించిన మీదటే ఆర్థిక సంఘం తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ఈ సంప్రదింపుల ప్రక్రియలో నిమగ్నమై ఉందన్నారు. ఇంకా సిఫార్సులను కేంద్రానికి సమర్పించలేదని మంత్రి అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top