మద్యం దుకాణాలు తగ్గాయ్‌ !

AP Government New Liquor Policy - Sakshi

దశలవారీ మద్య నిషేధానికి శ్రీకారం

ఇకపై జిల్లాలో  168 దుకాణాలే

588 మందికి  ఉద్యోగావకాశాలు

నూతన మద్యం విధానం  ప్రకటించిన ప్రభుత్వం

విజయనగరం రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీ మద్యనిషేధం అమలుకు పక్కా వ్యూహం రూపొందించారు. తొలిదశలో బెల్టుషాపులు నిరోధించడమే గాకుండా... ఇకపై ప్రభుత్వ మే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన సందర్భంలో అక్కచెల్లెమ్మల వినతి మేరకు అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే దశలవారీ మద్య నిషేధానికి అడుగులు వేశారు. ఇందులో భాగంగా 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 210 మద్యం దుకాణాల్లో 20 శాతం పోగా 168 దుకాణాలు ఏర్పాటు యనున్నారు. ఈ దుకాణాలు అక్టోబర్‌ ఒకటో తేదీనుంచి నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్‌..
ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. లాభాలే పరమావధిగా వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి మద్యం విక్రయాలు సాగించడంతో మద్యం ఏరులై పారేది. కల్తీ మద్యం, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలతో యథేచ్ఛగా నిబంధనలకు పాతరేసేశారు. నూతన మద్యం విధానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడవనున్న నేపథ్యంలో వీటికి చెక్‌పడనుంది. మద్యం దుకా ణాలను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌బీసీఎల్‌) ఏర్పాటు చేసి రిటైల్‌గా విక్రయాలు సాగించనుంది. ఇందుకోసం సిబ్బందిని నియమించి అమ్మకాలు సా గించనుంది. ఇప్పటివరకు మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు జరిగేవి. నూతన మద్యం విధానంలో ఒక గంట ముందే అంటే రాత్రి 9 గంటలకే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

588 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం..
మద్యం దుకాణాల్లో పని చేసేందుకు ఏడాదిపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మన్లను నియమించగా, గ్రామీణ ప్రాంత దుకాణాల్లో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మన్లను నియమించనున్నారు. వీరితోపాటు ప్రతీ దుకాణం వద్ద ఒక వాచ్‌మన్‌ను కూడా నియమించనున్నారు. డిగ్రీ విద్యార్హతతో సూపర్‌వైజర్లను నియమించనుండగా సేల్స్‌మన్లుగా ఇంటర్మీడియట్‌ విద్యార్హతలున్న వారిని నియమిస్తున్నారు. అలాగే 21 ఏళ్లు పైబడి 40 ఏళ్ల లోపు ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. వీరి నియామకానికి సంబందించి ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు.

మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు..
ఎక్సైజ్‌ అధికారులు ఎక్సైజ్‌ చట్టం–1968 నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల ఏ ర్పాటుకు సంబంధించి స్థలాల గుర్తింపు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్థలంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌ జారీ చేశాం..
ప్రభుత్వం నూతన మద్యం విధానం ప్రకటించిన నేపథ్యంలో దానిని సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం. ముఖ్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నందున నిబంధనల ఉల్లంఘనలకు ఆస్కారం ఉండదు. దుకాణాల నిర్వహణకు ప్రదేశాల గుర్తింపు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సామగ్రి ఏర్పాటుకు టెండర్‌ ప్రక్రియ చేపట్టనున్నాం. అలాగే ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశాం. అక్టోబర్‌ 1నుంచి మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి.
– వై.బి.భాస్కరరావు, డిప్యూటీ కమిషనర్, అబ్కారీశాఖ, విజయనగరం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top