ఎలాగంటా!

AP DSC 2018: Notification release date postponed - Sakshi

ఊరించి ఉసూరుమనిపించారు

విడుదల కాని డీఎస్సీ నోటిఫికేషన్‌ 

అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలతో సరి 

అయోమయంలో ఉద్యోగార్థులు 

కోచింగ్‌లకు రూ.లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థులు

డీఎస్సీపై మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటనలన్నీ నీటి మూటల్లా మిగిలాయి. నిరుద్యోగులకు మరోమారు సర్కారు మొండిచెయ్యి చూపింది. బుధవారం నోటిఫికేషన్‌ అని చెప్పి ఉసూరుమనిపించింది. 

నిడమర్రు/ఏలూరు ఆర్‌ఆర్‌పేట: డీఎస్సీపై గత నాలుగేళ్లుగా ఉన్న సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబరు 10న ప్రాథమిక షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు నిరుద్యోగులను నమ్మించిన టీడీపీ సర్కారు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చెయ్యకుండా ఉపాధ్యాయ అభ్యర్థులకు మొండి చెయ్యిచూపింది. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల ప్రతిపాదనల్లోనూ సర్కారు భారీగా కోత విధించింది. జిల్లాలో మైదాన ఏరియాలో ఒక్క సెంకడరీ గ్రేడ్‌ పోస్టు కూడా ఖాళీల్లో చూపించలేదు. అలాగే ఐదు పీఈటీ పోస్టులే ఖాళీగా ఉన్నట్టు చూపారు. మొత్తమ్మీద మున్సిపల్, మైదానం, ఏజెన్సీలు కలిపి జిల్లాలో 326 పోస్టులకు మాత్రమే కుందించి నియామకాలు చేపడుతున్నట్లు  టెట్‌ కం డీఎస్సీ–2018 ప్రకటించి వాయిదా వేశారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు  తీవ్రనిరాశకు గురవుతున్నారు. ఇలా వరుస వాయిదాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలుత ప్రకటించిన పోస్టుల్లో భారీగా కోత పడటం, జిల్లాల వారీగా ఖాళీల విషయంలో తేల్చకుండా నాన్చడం వల్ల డీఎస్సీపై డైలమా నెలకొంది. 

ఊగిసలాటలో అభ్యర్థులు
డీఎస్సీ  ప్రకటనలు, వాయిదాల నేపథ్యంలో అభ్యర్థులు ఆశనిరాశల మధ్య  ఊగిసలాడుతున్నారు. అదిగో నోటిఫికేషన్‌.. ఇదిగో నోటిఫికేషన్‌ అంటూ రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లుగా నిరుద్యోగుల్లో ఆశలు రేకిత్తిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెట్‌ పరీక్ష  నిర్వహించింది. ఐదుసార్లు నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పి ఉసూరుమనిపించింది. 

వాస్తవానికి 2వేలకుపైగా ఎస్జీటీ ఖాళీలు
తాజా డీఎస్సీలో ప్లెయిన్‌ (మైదానం) ఏరియాలో ఎస్జీటీ పోస్టులు సున్నాగా విద్యాశాఖ చూపించింది. పీఈటీ పోస్టులూ 5మాత్రమే ఖాళీ ఉన్నట్టు పేర్కొంది.  ఎస్జీటీ ఖాళీలు చూపించకపోవడంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆత్యహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు  కానీ  వాస్తవంగా జిల్లాలో 2వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. 

ముందు 560.. ఇప్పుడు 326 పోస్టులే!
ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తే 560  ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారులు తొలుత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో ప్లెయిన్‌ ఏరియాలో 428 పోస్టులు, ఏజెన్సీ ఏరియాలో 132 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులు ఉండవని ప్రకటించడంతో ఈ పోస్టులు కాస్తా ఏజెన్సీ ఏరియాలో 132, ప్లెయిన్‌ ఏరియాలో 194 మొత్తం కలిపి 326 పోస్టులకు తగ్గించేశారు.  కాగా  జిల్లాలో 12,210 ఉపాధ్యాయ పోస్టులు మంజూరవగా ప్రస్తుతం 10,858 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 1,359 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అయితే 2017 డీఎస్సీలో పోటీ మాత్రం అధికంగానే ఉంది. గత డీఎస్సీ తరువాత జిల్లాలోని 39 డీఎడ్‌ కళాశాలలతోపాటు, దూబచర్లలోని ప్రభుత్వ డైట్‌ కళాశాల నుంచి ఇప్పటి వరకూ సుమారు 16 వేల మంది డీఎడ్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లు అంచనా. అలాగే జిల్లాలోని 25 బీఎడ్‌ కళాశాలల నుంచి గత నాలుగేళ్ళలో సుమారు 6 వేల మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు 2014 డీఎస్సీకి ముందు ఆయా కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు రాని వారు మరో 10 వేల మంది కూడా ఈ డీఎస్సీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అంటే ఈ డీఎస్సీలో సుమారు 32 వేల మంది పోటీపడే అవకాశం ఉన్నట్లు అంచనా.

మంత్రి  ప్రకటనలు అపహాస్యం
ఎన్నికల హామీల్లో ఏటా డీఎస్సీ అని ప్రకటించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లుగా పలు కారణాలు చూపిస్తూ సాగదీత, దాటవేతతో కాలక్షేపం చేస్తూ నిరుద్యోగులతో ఆటలాడుకుంటుంది.. అదిగో జంబో డీఎస్సీ.. ఇదిగో మొగా డీఎస్సీ అంటూ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు. అయన మాటలు నమ్మిన అభ్యర్థులు అపహాస్యం పాలవుతున్నారు.

శిక్షణ సంస్థలకు లాభం  
నాలుగేళ్లుగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర వ్యాప్తంగా టెట్, డీఎస్సీ శిక్షణ ఇస్తున్న కోచింగ్‌ సెంటర్లుకు లాభాలు చేకూర్చేలా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అభ్యర్థులు ఇప్పటికే టెట్‌ పేరుతో గత కొంతకాలంగా వేలాది రూపాయలు శిక్షణ సంస్థలకు సమర్పించుకున్నారు. జిల్లా అభ్యర్థులు ఎక్కువగా అవనిగడ్డ, కాకినాడ, రామమండ్రి ప్రాంతాల్లోని శిక్షణ సంస్ధల్లో కోచింగ్‌ తీసుకుంటారు. భీమవరం, జంగారెడ్డిగుడెం, ఏలూరులో ఉన్నా 90శాతం మంది కోచింగ్‌ కోసం ఇతర జిల్లాల బాటే పట్టారు. ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు సైతం వదిలి కోచింగ్‌ సెంటర్లలో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఇలా వాయిదాల డీఎస్సీలతో అప్పులపాలవుతున్నామని చెబుతున్నారు.

కుటుంబానికి దూరమై
2014 డీఎస్సీ నియామకాల తర్వాత జిల్లాలో రెండుసార్లు నిర్వహించిన టెట్‌ ద్వారా 26 వేల మందికిపైగా నిరుద్యోగులు అర్హత సాధించారు. వీరిలో చాలామంది వివాహిత మహిళలు. వీరు పిల్లలను ఇంటి పట్టునే వదిలేసి వివిధ ప్రాంతాలకు వెళ్లి రెండేళ్లుగా డీఎస్సీ కోసం అవనిగడ్డ, రాజమండ్రి , గుంటూరు తదితర చోట్ల కోచింగ్‌ తీసుకుంటున్నారు. కోచింగ్‌ కోసమే ఒక్కొక్కరు రూ.60 వేల నుంచి రూ.లక్ష  దాకా ఖర్చు చేసుకున్నారు. అద్దె గదుల్లో ఉంటూ వంట చేసుకొని కోచింగ్‌ పొందే వారు కొందరైతే.. ప్రత్యేకంగా ఉన్న హాస్టళ్లలో ఉంటూ కోచింగ్‌తీసుకునే వారు మరికొందరు. డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి టీచర్‌ ఉద్యోగం పొంది ఆ తర్వాత పెళ్ళి చేసుకుందామనుకున్నవారు కూడా చాలామందే ఉన్నారు. వీరిలో యువకులే కాకుండా యువతులు కూడా ఉన్నారు. అప్పులు చేసిమరీ ఇలా కోచింగ్‌ తీసుకున్న వారి బాధలు  వర్ణనాతీతం.                              

జిల్లాలో పోస్టులు ఇలా.. 
మొత్తం పోస్టులు    :    12,210
ఖాళీగా ఉన్నవి     :    1352
ఇప్పుడు భర్తీచేసేవి     :    326
తొలుత 
ప్రతిపాదించినవి     :    560 

టెట్, డీఎస్సీ శిక్షణ కాలం: 3 నెలలు
చెల్లించాల్సిన ఫీజు: రూ.14 వేల నుంచి రూ. 18 వేలు
వారాంతపు పరీక్షలకు: రూ.2వేలు
భోజన, వసతికి:  రూ18వేలు (రూ. 6వేలు చొప్పున 3నెలలకు)
పుస్తకాలు, ఇతర ఖర్చులకు : రూ.10వేలు 
శిక్షణ నిమిత్తం ఒక్కో అభ్యర్ధికి అయ్యేఖర్చు:   రూ.46 వేల నుంచి రూ.50వేలు 

టెట్‌కు హాజరైన 
అభ్యర్ధుల వివరాలు
∙ఆంగ్లం : 1025  
∙గణితం : 4736 
∙జీవశాస్త్రం :  3503   
∙భౌతికశాస్త్రం : 195
∙సాంఘిక శాస్త్రం : 8759
∙మొత్తం : 17,193 

భాషా పండితులు 
(స్కూల్‌ అసిస్టెంట్లు)
తెలుగు : 2364
హిందీ : 1175
ఆంగ్లం : 1075
మొత్తం : 4,564
ఎస్జీటీలు :  2,867

మోసం చేయడమే
తాజాగా ఎజ్జీటీలు ఖాళీగా చూపిండడం నిరుద్యోగులను మోసం చేయడమే. గత రెండేళ్లుగా అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ విద్యాశాఖ ప్రకటనలు గుప్పించడంతో డీఎస్సీ కోసం ప్రిపేర్‌ అవుతున్నాను. బుధవారం ప్రాథమిక షెడ్యూల్‌ ప్రకటించినా నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం దారుణం.
– ఇంతియాజ్‌బేగం. డీఈడీ, తాడేపల్లిగుడెం

అప్పు చేసి కోచింగ్‌ తీసుకున్నా
మూడేళ్లుగా అప్పు చేసి డీఎస్సీ కోచింగ్‌ తీసుకుటున్నా. శిక్షణ నిమిత్తం అవనిగడ్డలో రూ.70 వేలు ఖర్చయింది. రాజమండ్రిలో కోచింగ్‌లో ఉన్నా. బుధవారం నోటిఫికేషన్‌ అంటే సంతోషించాం. ప్రకటించకపోడంతో నిరుత్సాహంలో ఉన్నా. డీఎస్సీ ప్రకటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 
– దాసి రవికుమార్, బీఈడీ, కోరుమామిడి

ఉన్న ఉద్యోగం వదులుకుని 
డీఎస్సీ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం ఆశతో శశి వేలివెన్నులో  విద్యా సంస్థలో నెలకు రూ. 25 వేల జీతం వదులుకుని శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పుడు జిల్లాలో 5 పీఈటీ పోస్టులే ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ చెబుతోంది. దీంతో  పీఈటీ అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 
– బీవీవీ సత్యనారాయణ, పీఈటీ అభ్యర్థి, మార్టేరు

కోచింగ్‌ సెంటర్లకు లాభం 
డీఎస్సీపై మంత్రి ప్రకటనలతో కోచింగ్‌ సెంటర్లకు లబ్ధి చేకురుతోంది. జిల్లాలో ఎస్జీటీ పోస్టులు సున్నా చూపించి అభ్యర్థులను సర్కారు మోసం చేసింది. విద్యారంగానికి నిధులు కేటాయించడం ఇష్టలేకే నోటిఫికేషన్‌ ప్రకటించకుండా సాగదీస్తోంది. ముందు ప్రకటించినట్లు 23 వేల పోస్టులు భర్తీ చేయాలి.
– షేక్‌ సాబ్జి, రాష్ట్ర అధ్యక్షుడు, యూటీఎఫ్‌

ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని..
డీఎస్సీ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని ఒదులుకుని కోచింగ్‌ తీసుకున్నాను. ఇక ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించే అవకాశం లేదనిపించి తిరిగి ఉద్యోగం చేద్దామని వెళితే అప్పటికే నా స్థానం భర్తీ అయిపోయింది. గతంలో డీఎస్సీలో 340 జీఎస్టీ పోస్టులు చూపిం చగా ఇప్పుడు ఆ పోస్టులన్నీ ఏమయ్యాయి.
– వీపీబీ కిరణ్‌ కుమార్, డీఎస్సీ అభ్యర్థి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top