మెరుగైన మార్కెటింగ్‌తో రైతులకు లబ్ధి

AP CM YS Jagan comments in the Review of Agricultural Mission - Sakshi

అగ్రి ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ కోసం నిపుణులతో ప్రత్యేక విభాగం

వ్యవసాయ మిషన్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పంట కొనుగోలు ప్రణాళిక రూపొందించడంపై ఆరా

గ్రామ వలంటీర్ల ద్వారా పంటల రిజిస్ట్రేషన్‌.. తద్వారా గిట్టుబాటు ధర కల్పనకు మార్గం సుగమం

అక్టోబర్‌ 15 నాటికి పంట కొనుగోలు కేంద్రాలు   

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,830 కోట్లు నెలాఖరు నుంచి చెల్లింపు

వైఎస్సార్‌ రైతు భరోసా అమలుకు ఇబ్బందులు లేకుండా చూడాలి

మామిడి, చీని పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి

అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు, శనగలు తదితర పంటల కొనుగోలు కోసం కేంద్రాలు తెరవాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలను ఆలోచించాలి. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి. ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవాలి. కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచిగా మార్కెట్‌ కల్పించే పద్ధతులు అన్వేషించాలి. తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి.
– అగ్రి మిషన్‌ సభ్యులు,అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ కోసం అత్యుత్తమ నిపుణులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి రైతులకు మేలు చేకూరేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇందుకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని, ప్రస్తుత వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అగ్రికల్చర్‌ కమిటీల నుంచి వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవడానికి ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా రూపొందించాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ  వ్యవసాయ మిషన్‌ మూడవ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయ మిషన్‌ తదుపరి సమావేశంలో రాబోయే పంటల దిగుబడులు, వాటికి లభించే మద్దతు ధర అంచనాలు, మార్కెట్‌లో పరిస్థితులను నివేదించాలన్నారు. మినుములు, పెసలు, శనగలు, టమాటాలకు సరైన ధర రావడం లేదని అధికారులు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ ఈ పంటలకు సంబంధించిన కొనుగోళ్ల ప్రణాళికను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించారు. మద్దతు ధర లభించక, కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయక గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు.

ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని.. దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధర తగ్గడానికి ప్రధాన కారణాలని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్లే టమాటా, ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులున్నాయని వివరించారు. గత ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి నిధులు సమకూర్చలేదని, పంటలకు ధర పడిపోయిన తర్వాత ధరల స్థిరీకరణ పథకం కింద నిధులు తెచ్చుకునే సరికి పుణ్యకాలం గడచిపోయేదన్నారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ప్రతి రైతూ వారి పంటలు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. తద్వారా గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయడానికి వీలవుతుందన్నారు.

రబీ పంట నుంచే ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దశలో సీఎం జోక్యం చేసుకుంటూ అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు, శనగలు తదితర పంటల కొనుగోలు కోసం కేంద్రాలు తెరవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలను ఆలోచించాలని అగ్రి మిషన్‌ సభ్యులు, అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు, కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచిగా మార్కెట్‌ కల్పించే పద్ధతులతో రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చూడాలని ఆదేశించారు. 

తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి
రాష్టంలో వర్షపాతం వివరాలు, ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం వివరాలను, వరద జలాల వినియోగ ప్రణాళికలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1830 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈ నెలాఖరు నుంచి రైతులకు అందజేయాలని ఆదేశించారు. వచ్చేనెల 15న ప్రారంభమయ్యే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయం అందితే కరవు ప్రాంతాల రైతులకు ఊరట లభిస్తుందని చెప్పారు. వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కూడా కీలకమని ముఖ్యమంత్రి చెప్పారు.

టమాటా ధరలపై చర్చ
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టమాటా పంటకు ధర తగ్గడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. టమాటా ధరల్లో తరచూ హెచ్చు తగ్గులు వస్తున్న నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో సూచించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నప్పుడు డైనమిక్‌గా వ్యవహరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎండిపోతున్న మామిడి, చీని తదితర పంటలను కాపాడేందుకూ చర్యలు చేపట్టాలని, నీటి సరఫరా కోసం పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. పశువుల కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. 

సుబాబుల్‌ రైతుల సమస్యకు త్వరలో పరిష్కారం
రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నామని, తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తామని వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సరుగుడు, జామాయిల్, సుబాబుల్‌ సాగు చేస్తున్న రైతులకు సాయం అందించటానికి వచ్చే అగ్రి మిషన్‌ సమావేశం నాటికి పరిష్కార మార్గాలతో రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. రైతుల గురించి ఇవాళ చాలా పెద్ద మాటలు చెబుతున్న చంద్రబాబు.. తాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని గానీ, కనీసం హుద్‌హుద్‌ తుపానులో రైతులకు ఇవ్వాల్సిన సాయాన్ని కానీ ఇవ్వలేదన్నారు.

తమ ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రైతు భరోసా అమలయ్యే వచ్చే నెల 15లోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందితే చాలా వెసులు బాటు ఉంటుందన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతుల కోసం ఏమైనా చేయడానికి తాము సిద్ధమన్నారు. ఉల్లి, టమాటా ధరల సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి ముందు చూపుతో చర్యలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. మినుములు, పెసలు, కందులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను సీజన్‌ కంటే 15 రోజుల ముందుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలి  
రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాటిని మదింపు చేసి రైతులకు వివరించాలి. కొన్ని సందర్భాలలో సగటు వర్షపాతం ఉన్నా కరువు ఎందుకు వస్తుందన్న పరిస్థితులపై అధ్యయనం చేయాలి. రెండు రోజులు భారీగా వర్షం, ఆ తర్వాత రెండు మూడు నెలలపాటు చినుకు పడని ఘటనలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన ఐదు, పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన పద్ధతుల్ని కూడా సమీక్షించాలి. వీలైతే గత పదేళ్ల వ్యవసాయ విధానాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలి. వర్షాభావ ప్రాంతాలలో తృణ ధాన్యాల సాగును ప్రోత్సహించాలి.
– పి.సాయినాథ్, అగ్రి మిషన్‌ సభ్యుడు, ప్రముఖ జర్నలిస్టు
 
అర్హులందరికీ రైతు భరోసా 
వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. కౌలు రైతులు సహా అందరికీ రైతు భరోసా వర్తింపజేస్తాం. రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. కృష్ణా డెల్టా ఆధునికీకరణపై సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top