గ్రామ స్వరాజ్యానికి నేడే అంకురార్పణ

AP CM Jagan Mohan Reddy to launch his ambitious Village Secretariat system on Gandhi Jayanti - Sakshi

ప్రజలకు అందుబాటులోకి రానున్న గ్రామ, వార్డు సచివాలయాలు 

తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు 

ఒకే విడతలో 1,34,918 లక్షల మంది ఉద్యోగులను నియమించిన ప్రభుత్వం 

ఇకపై గ్రామాల్లోనే అందనున్న 500కుపైగా ప్రభుత్వ సేవలు

ప్రజల ఆమోదంతోనే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు

సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పునకు శ్రీకారం చుడుతూ గ్రామ సచివాలయాల వ్యవస్థ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి చోటా 10–12 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం.. జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరేడు సచివాలయాలు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటు రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1,34,918 లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. 

ప్రతి సేవకు నిర్ధిష్ట కాలపరిమితి 
పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇంటి పట్టా వంటి వాటికి కోసం పేదల మండలాఫీసులు, కలెక్టరేట్, రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారం ఉంది. ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రతినెలా కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయంలోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలిసేలా.. 
గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ది పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చర్చించి, నిర్ణయించాలని, ఏడాదిలో తప్పనిసరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను అదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించడానికి గాను ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. 

సచివాలయంతో వలంటీర్ల అనుసంధానం 
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించారు. వీరు పింఛన్, రేషన్‌ సరుకులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తారు. వలంటీర్లు గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతంలో 1,93,421 మంది గ్రామ వలంటీర్లు.. పట్టణ ప్రాంతాల్లో 74,659 మంది వార్డు వలంటీర్లు... మొత్తం 2,68,080 మంది వలంటీర్లను రాష్ట్ర సర్కారు నియమించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top