రూ.2,26,177.53 కోట్లతో నేడు రాష్ట్ర బడ్జెట్‌! 

AP Budget Will Introduce Today - Sakshi

రెవెన్యూ లోటు రూ.2,294 కోట్లు.. ద్రవ్య లోటు రూ.32,390 కోట్లు 

ఆర్థిక వనరులు లేకున్నా భారీగా కేటాయింపులు చూపించే ఎత్తుగడ 

గత ఐదు బడ్జెట్లలో యువత, డ్వాక్రా, రైతు, అన్ని కులాలకు దగా 

డ్వాక్రా మహిళలకు సున్నా, పావలా వడ్డీ బకాయిలు రూ.2,400 కోట్లు 

ప్రతిపక్ష నేత జగన్‌ ప్రకటనతో అన్ని కులాలకు కార్పొరేషన్ల పేరుతో ఉత్తుత్తి కేటాయింపులు 

ఆరోసారి బడ్జెట్‌లోనూ దగాకు చంద్రబాబు సర్కార్‌ సిద్ధం 

నేడు అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల.. మండలిలో మంత్రి నారాయణ సమర్పణ   

సాక్షి, అమరావతి:  చంద్రబాబు నాయుడు... ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన బాసలకు నీళ్లొదిలారు. ఊరూరా తిరిగి చేసిన వాగ్దానాలను గాలిలో కలిపేశారు. ఏదో చేస్తారని ఎదురుచూసిన బడుగు జనాలకు ఐదు బడ్జెట్లలో ఉసూరుమనిపించారు. ఎన్నికలు రెండు నెలలుండగా ఇవాళ ప్రవేశపెడుతున్న తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రం అంకెల గారడీతో అంగరంగవైభవంగా రంగం సిద్ధం చేశారు. కాగితాలపైనే భారీ కేటాయింపులతో మరోసారి వంచనకు సిద్ధమౌతున్నారు. ఈ నాలుగున్నరేళ్లూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కార్‌.. ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ వారిని మళ్లీ దగా చేయబోతోంది. ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఏదో చేసేస్తానంటూ సీఎం చేస్తున్న విన్యాసాలను చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. 

కాగితాలపైనే భారీ కేటాయింపులు 
ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో కూడా అప్పులతో పాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ప్రధాన హామీలైన వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు నిరుద్యోగ భృతికి గండికొట్టిన సర్కార్‌.. ఇప్పుడు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా మళ్లీ ఆయా వర్గాలను మోసం చేయడమే లక్ష్యంగా అంకెల గారడీలతో 2019–20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధంచేసింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ఉ.11.45 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అదే సమయానికి మున్సిపల్‌ మంత్రి నారాయణ శాసన మండలిలో బడ్జెట్‌ను చదవనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో పూర్తిస్థాయి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను యనమల సభలో ప్రవేశపెడతారు. కాగా, రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. రూ.2,294కోట్లను రెవిన్యూ లోటు కింద.. రూ.32,390కోట్లను ద్రవ్య లోటు కింద ఇందులో పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు అంటే నాలుగు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌కు సభ నుంచి ఆమోదం పొందాలని యనమల నిర్ణయించారు. కాగా, 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల రుణమాఫీని రూ.87,612 కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు కుదించిన చంద్రబాబు సర్కారు.. అందులో ఇంకా రూ.8,200 కోట్లను రైతులకు ఇవ్వలేదు. దీంతో రైతుల అప్పులు గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ.1.37 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు కొత్తగా పెట్టుబడి నిధి పేరుతో వారిని మోసం చేసే ఎత్తుగడ వేసింది.

డ్వాక్రా సంఘాలకు టోకరా 
డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తరువాత మాఫీ చేయబోనంటూ చెప్పి పెట్టుబడి నిధి కింద ఒక్కో మహిళకు పది వేలు ఇస్తామంటూ నాలుగున్నరేళ్ల పాటు సాగదీశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మరో పది వేలు ఇస్తామంటూ పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లను పంపిణీ చేస్తున్నారు. అయితే, సకాలంలో రుణాలు చెల్లించిన డ్వాక్రా సంఘాల వారికి సున్నా వడ్డీ వర్తింపజేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీ చెల్లింపులకు నిధులివ్వలేదు. దీంతో ఆ సంఘాల నుంచి బ్యాంకులు ఇప్పటివరకు వడ్డీ కింద రూ.2,400 కోట్లను వసూలు చేశాయి. ఒక్కో మహిళపై రూ.70వేలకు పైగా వడ్డీ భారం పడింది.  

నిరుద్యోగులకూ దగా 
జాబు రావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేయడమే కాకుండా జాబు వచ్చే వరకు ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేలు ఇస్తానని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేసింది. ప్రతిపక్ష నేత జగన్‌ ఒత్తిడి తేవడంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ యువతకు భృతి పేరుతో బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించినప్పటికీ పైసా ఖర్చు చేయలేదు. 2018–19లో నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లను కేటాయించినప్పటికీ నవంబరులో అరకొరగా అనేక ఆంక్షలతో నెలకు రూ.1000 నిరుద్యోగ భృతి ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో కోటి 70 లక్షల కుటుంబాల్లోని ఒక్కో నిరుద్యోగికి భృతి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 3.58 లక్షల మందికి రూ.116.88 కోట్లే ఇచ్చారు. తాజాగా.. ఎన్నికల వేళ నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచుతామంటూ బడ్జెట్‌లో కేటాయింపులతో మళ్లీ మోసం చేయడానికి బాబు సర్కారు సిద్ధమవుతోంది.
 
కులాల కార్పొరేషన్లతో ప్రచారానికి ఎత్తుగడ 
మరోపక్క.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ ప్రకటించడంతో చంద్రబాబు ఇప్పుడు వాటిని కాపీ కొట్టి తానూ కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామంటూ ప్రకటించారు. వీటికి కూడా కాగితాలకే పరిమితమయ్యేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ప్రజల కనీస అవసరాలైన సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారంతో పాటు మంచినీటి సరఫరా, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు చెందిన అన్ని రకాల బిల్లులు, ఆరోగ్యశ్రీతో పాటు ఇతర బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది. సుమారు రూ.15 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉంచారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఊహాజనిత గణాంకాలతో భారీగా బడ్జెట్‌ కేటాయింపులు చేసేద్దామనే రీతిలో సర్కారు వ్యవహరిస్తోంది.  

గ్రాంట్లపై ఊహాజనిత అంచనాలు 
ఇకపోతే.. కేంద్రం నుంచి అత్యధికంగా గ్రాంటు రూపంలో నిధులు వస్తాయనే ఊహాజనిత అంచనాలతో భారీ బడ్జెట్‌ను రూపొందించారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ.60 వేల కోట్లు వస్తాయని లెక్కగట్టడం గమనార్హం. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.36,360 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇది కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న మేరకే పొందుపరిచినప్పటికీ గ్రాంట్ల రూపంలో మాత్రం కేవలం ఊహాజనితంగా లెక్కలు వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంత్రి యనమల ఏకంగా రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అభాసుపాలయ్యారు. ఇప్పుడు రెవెన్యూ మిగులు బడ్జెట్‌ పెడతారా లేదా లోటు బడ్జెట్‌ పెడతారా అనేది చూడాల్సి ఉంది.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top