సీఈవోల ఉత్పత్తి కర్మాగారంగా ఏపీ: సీఎం చంద్రబాబు

సీఈవోల ఉత్పత్తి కర్మాగారంగా ఏపీ: సీఎం చంద్రబాబు


పుత్తూరు/నారాయణవనం: భవిష్యత్తులో ప్రపంచ పారిశ్రామిక రంగానికి సీఈవోలను అందించే కర్మాగారంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా, నారాయణవనం మండల పరిధిలోని సిద్దార్ధ విద్యాసంస్థ 16వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచంలోని బహుళజాతి కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు రాణించడం యువత మేధస్సుకు నిదర్శనమన్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా రాష్ట్రానికి చెందిన సత్యనాదేళ్ల, గూగుల్‌కు తమిళనాడుకు చెందిన సుందర్‌పిచాయ్‌లు ఎంపిక కావడాన్ని ఆయన గుర్తు చేశారు.పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రపంచానికి అమెరికాలోని కాలిఫోర్నియా దిశానిర్దేశం చేస్తూ  అత్యధిక ధనిక ప్రదేశంగా కొనసాగుతోందన్నారు. భవిష్యత్తు టెక్నాలజీదేనని ఆయన వ్యాఖ్యానించారు. యువత ముందుగా ఉద్యోగాల్లో స్థిరపడి, అనంతరం పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీల అవసరాల దృష్ట్యా విద్యావిధానం సిలబస్‌లలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. 23 ఐటీ సంస్థల సీఈవోలతో కళాశాల చైర్మన్‌ అశోక్‌ రాజు ఎంఈవోలు కుదుర్చుకున్నారు.

Back to Top