మా పొట్ట కొట్టి.. రోడ్డున పడేశాడు..

Ap Afternoon meal workers fire on chandrababu govt - Sakshi

చంద్రబాబుకు బుద్ధి చెబుతాం.. గద్దె దిగే వరకు వదిలిపెట్టం

తగరపువలస సభలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆగ్రహావేశాలు

ప్లకార్డులతో  నిరసనలు.. ప్రసంగం పూర్తయ్యే వరకు నినాదాలు

సాక్షి, విశాఖపట్నం: ‘పేదపిల్లల పొట్టనింపుతూ..17 ఏళ్లుగా మా పొట్ట పోసుకుంటున్నాం.. అన్యాయంగా మమ్మల్ని రోడ్డుకీడ్చాడు.. పిల్లా పాపలతో రోడ్డునపడ్డాం.. మా కష్టాలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులు, పార్టీ కార్యకర్తలను దౌర్జాన్యానికి  ఉసిగొల్పుతున్నాడు. పైగా సిగ్గులేకుండా మళ్లీ గెలిపించాలంటున్నాడు. ఏ ముఖం పెట్టుకుని ఆయనకు ఓట్లేస్తాం’..అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. విశాఖ నగర పర్యటనలో భాగంగా తగరపువలస జూట్‌మిల్లు గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం చంద్రబాబుకు మధ్యాహ్న భోజన కార్మికుల నుంచి  తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్ది సేపటికే వేదికపై ముందు గ్యాలరీలో కూర్చున్న సుమారు 200 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఒక్కసారిగా లేచి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలందుకున్నారు. తమ వెంట తీసుకొచ్చిన కాగితాలపై రాసిన ప్లకార్డులు చేతపట్టుకుని బిగ్గరగా నినాదాలు చేశారు.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మీరు గొంతెమ్మ కోర్కెలు ఆపండి..మీరు ఉండండి.. కూర్చొండి..అనవసరంగా మాట్లాడడం కరెక్ట్‌కాదు. దురుద్దేశంతో గోల చేయకండి. నేను చెప్పింది వినండి. ఏమైనా వచ్చి చెప్పుకోండి. ఎంతో మందికి ఎన్నో చేశాను. మర్యాదగా కూర్చోండి. మీడియా కూడా కరెక్ట్‌కాదు.

అక్కడకు వెళ్లకండి, వాళ్లను చూపించకండి..వాళ్లను పట్టించుకోకండి..అరుచుకుని అరుచుకుని వాళ్లే కూర్చుంటారు.’అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తూ మాట్లాడారు. దీంతో వారు మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సీఎం డౌన్‌ డౌన్‌.. మధ్యాహ్న భోజనం ప్రభుత్వమే నిర్వహించాలంటూ బిగ్గరగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సీఎం కనుసైగ చేయడంతో ఏసీపీ బీఎస్‌ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలసి గ్యాలరీ వద్దకు వెళ్లి కార్మికులను వారించే ప్రయత్నం చేశారు. చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాక్కునేందుకు యత్నించగా పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సీఎం సభ పూర్తయ్యే వరకు నినాదాలు చేస్తూనే ఉన్నారు. కాగా వారిచేతుల్లో ఉన్న ప్లకార్డులను తీసుకురమ్మని వేదికపై ఉన్న గంటా సూచించగా... టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న మహిళలను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్లకార్డులను లాక్కుని చించేశారు. దీంతో పలువురు మíßహిళలు చంద్రబాబుకు వేలు చూపిస్తూ శాపనార్ధాలు పెట్టారు. ‘ఏం చేశాడని మళ్లీ ఈయన్ని గెలిపించాలి. మొదట్లో రూపాయి పావలా ఇచ్చేవారు. అప్పటి నుంచి ఎంతో కష్టపడ్డాం. పిల్లలను ఏనాడు ఆకలితో ఉంచలేదు. బిల్లులు ఇవ్వకపోయినా పుస్తెల తాడు  అమ్మి మరీ భోజనాలు పెట్టాం. ఇంతలా కష్టపడితే ఇప్పుడు ఇలా మమ్మల్ని రోడ్డు పాల్జేస్తాడా? మట్టికొట్టుకుపోతాడు అంటూ మండిపడ్డారు. సభ ముగిసిన తర్వాతయినా సీఎం వద్దకు అనుమతిస్తారేమోనని మహిళా కార్మికులు ఆశగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు తన ప్రసంగం ముగియగానే సన్మానాలు, సత్కారాలు చేయించుకుని వేదిక పైనుంచి దిగి నేరుగా కారెక్కి వెళ్లిపోయారు. 

 సరిపడా అన్నం పెట్టడం లేదు..
మేము పాఠశాలలో భోజనం వండి వడ్డించేటప్పుడు పిల్లలు రెండోసారి అడిగినా పెట్టేవాళ్లం. నవ ప్రయాస్‌ వాళ్లు పంపిన ఆహారం పిల్లలకు వంద గ్రాములు కూడా పెట్టడం లేదు. పైగా రెండోసారి అడిగినా అన్నం, పప్పు లేకపోవడంతో ఆకలిని చల్లార్చుకోవడానికి విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారు.
–ఉప్పు లక్ష్మి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

రుచీపచీ లేని ఆహారం..
రాత్రి ఎప్పుడో వండిన ఆహారాన్ని క్యాన్లలో పెట్టి పంపిస్తున్నారు. అందులో రుచీపచీ ఉండటం లేదు. అన్నం ముద్దగా ఉంది. చాలా మంది పిల్లలు తినకుండా పారవేస్తున్నారు. అడుగుదామన్నా ఎవరూ బాధ్యత వహించడం లేదు. మేం వేడి వేడిగా పిల్లలకు వండి వార్చేవాళ్లం.
–చల్లా గౌరి, మధ్యాహ్న భోజన కార్మికురాలు 

ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దుతున్నారు..
రాత్రి ఎప్పుడో వండిన అన్నం, సాంబారు పంపించడంతో విద్యార్థులు తినలేక వాంతులు చేసుకుంటున్నారు. సాంబారులో పప్పుకు బదులుగా శనగపిండి వాడుతుండటంతో పాచి కంపు కొడుతుంది. ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు రుద్ది బలవంతంగా అమలు చేస్తున్నారు. 
–రవ్వ నరసింగరావు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top