వైద్యుడి నిర్వాకం !

Anesthetic Doctor Negligent Duty In Narsipatnam Hospital - Sakshi

మత్తు ఇవ్వనంటూ ఇంటి దారి పట్టిన డాక్టర్‌

నిలిచిపోయిన సిజరైన్‌ ఆపరేషన్లు 

విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే గణేష్‌

వైద్యశాఖ మంత్రితో చర్చించి వైద్యులను రప్పించిన వైనం

సుఖ ప్రసవాలతో  ఊపిరి పీల్చుకున్న బంధువులు

వైద్యుడ్ని దేవుడితో సమానంగా భావిస్తాం. రోగాన్ని నయం చేస్తే అతన్ని జీవితాంతం గుర్తించుకుంటాం. డాక్టర్‌కు ఉన్న గౌరవం సమాజంలో ప్రత్యేకం. కానీ ఓ వైద్యుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళలకు మత్తు మందు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్‌ జోక్యం చేసుకొని.. అనకాపల్లి నుంచి మరో మత్తు వైద్యుడ్ని రప్పించి ఆపరేషన్లను చేయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న మత్తు వైద్యుడు(ఎనస్తీషియా) సుధాకర్‌ వ్యవహారశైలి తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. గతంలో కూడా విధులకు సమయానికి రావాలంటూ హెచ్చరించిన సూపరింటెండెంట్‌ను గదిలో బంధించి తలుపులకు గడియ పెట్టేశారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పట్లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు గడవక ముందే మరో వివాదానికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏడుగురు గర్భిణులకు సోమవారం సిజరైన్‌ ఆపరేషన్లు చేసేందుకు గైనికాలజిస్టు గౌతమి సోమవారం ఏర్పాట్లు చేసుకొని ఆపరేషన్‌ థియేటర్లో మత్తునిచ్చే డాక్టర్‌ సుధాకర్‌ కోసం వేచి చూస్తున్నారు. థియేటర్‌కు వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ ముగ్గురుకి మించి మత్తు ఇవ్వలేనని మొండికేశారు. అయితే వెంటనే అపరేషన్లు చేయకుంటే గర్భిణుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని గైనికాలజిస్టుకు నచ్చచెప్పినప్పటికీ ఆయన పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయారు.

దీంతో ప్రసవ వేదనతో బాధపడుతున్న  జి.ఉమాదేవి, ఎం.స్పందన, పి.సునీత, సీహెచ్‌.దేవి, ఎస్‌.మీనాక్షి, జి.భవాని తదితరులను విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు వైద్యులు సిద్ధపడడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో వైద్యులు లేకపోవటమేమిటని సిబ్బందిని నిలదీశారు. పరిస్థితిని బంధువులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మాకవరపాలెం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌  హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి  చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణలను చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. బాధితుల బంధువులకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు. కావాలనే ఆస్పత్రిలో కొంత మంది ప్రభుత్వానికి, తనకు చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని సూపరింటెండెంట్‌పై  అసహనం వ్యక్తం చేశారు. అక్కడ నుండే ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నానితో ఫోన్‌లో మాట్లాడి జరిగిన సంఘటనను, మత్తు డాక్టర్‌ నిర్వాకాన్ని వివరించారు. ఆస్పత్రిలో ప్రసవవేదనతో ఉన్న గర్భిణులకు అపరేషన్లు జరిగేలా చూడాలని కోరారు. డాక్టర్లు వచ్చే వరకు తాను ఆస్పత్రిలోనే ఉంటానని మంత్రికి వివరించారు.

దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన గైనికాలజిస్టు, మత్తు డాక్టర్‌ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆపరేషన్లు చేసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చచేలా చేశారు. దీంతో బంధువులు, ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ఊపిరి పీల్చుకున్నారు. మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఆస్పత్రికి చెందిన కొందరు కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి, తనకు చెడ్డు పేరు వచ్చే విధంగా వీరు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మత్తు డాక్టర్‌ సుధాకర్‌పై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. ఏడుగురు మహిళలు సుఖప్రసవాలు పోసుకుని తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో ఆయన సంతోసం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top