డీఎస్సీపై దోబూచులాట!

Andhra Pradesh Govt Neglecting DSC From Last Four Years - Sakshi

ఏటా ప్రకటన జారీ చేస్తామని టీడీపీ హామీ 

నాలుగేళ్లలో ఒక్కసారే నోటిఫికేషన్‌ విడుదల  

ఇదిగో డీఎస్సీ అంటూ పలుమార్లు ప్రకటన 

కోచింగ్‌ కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్న నిరుద్యోగులు

ఆగస్టులో డీఎస్సీ అంటూ తాజా ప్రకటనతో మళ్లీ ఆశలు

పోస్టుల సంఖ్యను భారీగా కుదించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు రూ.లక్షలు వెచ్చించి కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు. ఇప్పటిదాకా చేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగాలను సైతం వదులుకుంటున్నారు. మరోవైపు డీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

శిక్షణకు రూ.లక్షలే 
డీఎస్సీ శిక్షణ కేంద్రాలు కృష్ణా జిల్లా అవనిగడ్డతోపాటు హైదరాబాద్, మరికొన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. శిక్షణ కోసం ఆయా నగరాలకు వెళ్లాలి. మూడు నెలల శిక్షణకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. మెటీరియల్‌ కోసం మరో రూ.10 వేలు ఖర్చవుతోంది. హాస్టల్‌/రూములో ఉండడానికి నెలకు రూ.15 వేల దాకా వెచ్చించాల్సిందే. వివాహితలు/మహిళలు పిల్లలను ఇళ్ల దగ్గర వదిలిరాలేక, ఒంటరిగా ఉండలేక కుటుంబ సభ్యులను తమతో పాటే కోచింగ్‌ సెంటర్లున్న ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. దీంతో మూడు, నాలుగు నెలలకు కలిపి దాదాపు రూ.2 లక్షల వ్యయమవుతోంది. డీఎస్సీ సిలబస్‌ మారిస్తే మళ్లీ కోచింగ్‌ సెంటర్లలో చేరాల్సిందే. ఇదో అదనపు ఖర్చు. 

నాలుగేళ్లలో ఒకే డీఎస్సీ 
టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 డిసెంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాదాపు 22,000 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా 10,313 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రకటన ఇచ్చారు. ఆ డీఎస్సీని ఏడాదిన్నరపాటు సాగదీసి అందులో అర్హత సాధించిన వారిని 2016–17లో నియమించారు. మంత్రి గంటా 2016లో ఒకసారి, 2017లో రెండుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తున్నామని ప్రకటించినా ఇవ్వలేదు. గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ అంటూ షెడ్యూల్‌ కూడా ప్రకటించినా వెలువడలేదు. తాజాగా జూలై 6న నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, ఆగస్టులో డీఎస్సీ నిర్వహిస్తామని, సెప్టెంబర్‌లో ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే, గతానుభవాల దృష్ట్యా మంత్రి మాటలపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

పోస్టుల సంఖ్యలో కోత 
హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం స్కూళ్లను మూసివేయిస్తూ టీచర్‌ పోస్టుల సంఖ్యను భారీగా తగ్గించింది. నాలుగేళ్లలో 5 వేలకు పైగా స్కూళ్లు మూతపడినట్లు ఇటీవల ‘కాగ్‌’కు అందించిన నివేదికలో ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఖాళీ పోస్టులు ఉన్నట్లు చూపించారు. గత ఆగస్టులో మంత్రి గంటా ప్రకటన చేస్తూ రాష్ట్రంలో 22,814 ఖాళీ పోస్టులున్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత వాటిని కుదించేశారు. ఈ నాలుగేళ్లలో రిటైరైన వారి పోస్టులనూ కలుపుకుంటే 22 వేలకు పైగా ఖాళీలున్నాయి. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఖాళీల సంఖ్యను కుదించి 9,259గా చూపించింది. ఈ పోస్టులనైనా భర్తీ చేస్తారా అంటే అదీ లేదు. కొద్దికాలం క్రితం విద్యాశాఖ జిల్లాల వారీగా ఖాళీ పోస్టులపై సమాచారం తెప్పించింది. జిల్లాల్లో 10,603 ఖాళీలున్నట్లు వారు తేల్చారు. వాస్తవానికి ప్రభుత్వ టీచర్ల ఖాళీలు 22,804 ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇటీవల విద్యాశాఖ కమిషనరేట్‌ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో 10,351 పోస్టులను పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీలు 7,061 మాత్రమే ఉన్నాయని, మరో 3,290 పోస్టులను అదనంగా భర్తీ చేయాల్సి ఉన్నందున ఆర్థిక శాఖ అనుమతి కావాలని కోరారు. దానికి ఇంకా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదు. ప్రభుత్వం అనుమతిస్తేనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అవకాశముంటుంది. లేదంటే ఈ ఏడాది కూడా నోటిఫికేషన్‌ వెలువడడం సందిగ్ధమేనని అంటున్నారు. 

మంత్రి ప్రకటనలకే దిక్కులేదు 
ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2015 చివర్లో కానీ ఒక నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. డీఎస్సీపై మంత్రి గంటా శ్రీనివాసరావు పలు ప్రకటనలు చేశారు. అవేవీ అమల్లోకి రాకపోవడం గమనార్హం. ఆయన ఎప్పుడేం చేప్పారంటే... 

  • 3–7–2014: టెట్‌ రద్దు. ఏటా డీఎస్సీని వేస్తాం. ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటిస్తాం. 
  • 6–7–2014: సెప్టెంబర్‌ 5న డీఎస్సీ నోటిఫికేషన్‌ రానుంది. 
  • 2017 ఆగస్టు: 22 వేల పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. 
  • 7–12–2017: విజయవాడలో 2018 డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి గంటా. డిసెంబర్‌ 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. 12,370 పోస్టులను భర్తీ చేస్తామని, 2018 మార్చి 23, 24, 25 తేదీల్లో రాతపరీక్షలు  ఉంటాయని పేర్కొన్నారు. జూన్‌ నెల వచ్చినా ఇప్పటివరకు షెడ్యూల్‌ రాలేదు. 
  • 21–12–17: డీఎస్సీ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఏపీపీస్సీ పరీక్ష నిర్వహిస్తుందని, జిల్లా కమిటీల ద్వారా నియామకాలు చేస్తామని ప్రకటించారు.

సర్వశిక్ష అభియాన్‌ ద్వారా గతంలో కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం టీచర్‌ పోస్టుల ఖాళీలు

మొత్తం  పోస్టులు    ఖాళీలు
ప్రైమరీ    93,835    15,463    
యూపీ    33,836    4,005
మొత్తం    1,27,671    19,468

వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి
‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 12 వేలకు పైగా టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం మాట మార్చింది. మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. డీఎస్సీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని చూస్తే ఎన్నికల స్టంట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది’’  – కేఎస్‌ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ

కోచింగ్‌ కోసం చాలా ఖర్చు చేశా.. 
‘‘2014లో డీఎస్సీ రాసినా ఎంపిక కాలేకపోయాను. మళ్లీ నోటిఫికేషన్‌ రాలేదు. ఇప్పటికే కోచింగ్, పుస్తకాల కోసం చాలా ఖర్చు చేశా.  ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి నాలాంటి వారికి అవకాశం కల్పించాలి’’  – సౌజన్య, విశాఖపట్నం

మూడేళ్లుగా ఎదురు చూస్తున్నా... 
‘‘బీఈడీ పూర్తయి ఆరేళ్లవుతోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా టీచర్ల నియామకాలు అని చెప్పి ఒకే ఒక్కసారి నోటిఫికేషన్‌ ఇచ్చారు. 10 వేల పోస్టుల కోసం 6 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నాకు అవకాశం రాలేదు. మూడేళ్లుగా నోటిఫికేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్నా రాలేదు. శిక్షణ తీసుకోవడానికి, మెటీరియల్‌కు ఎంతో డబ్బు ఖర్చయ్యింది. ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నా ఫలితం లేకుండా పోతోంది’’ – కుప్పిలి జ్యోతిర్మయి, విజయనగరం

కాలయాపన తగదు  
‘‘డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం. గతంలో రెండుసార్లు విజయావకాశాన్ని కోల్పోయాను. తెలంగాణలో ఆర్నెల్లు ముందుగా సిలబస్‌ విడుదల చేసి ముందుగా ప్రకటించిన విధంగా రాత పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఏపీలో మాత్రం కాలయాపన చేస్తున్నారు’’  – ఎం. శ్రీనివాసరావు, డీఎస్సీ అభ్యర్థి, రొంపిచర్ల మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top