పాక్‌ ప్రధానిని బాబు విశ్వసించడమా?

Amit shah fire on ap cm chandra babu - Sakshi

రాజమహేంద్రవరం సభలో  అమిత్‌ షా తీవ్రస్థాయిలో ధ్వజం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వెన్నుపోటులో మాస్టర్‌ డిగ్రీ ఇవ్వాల్సి వస్తే అందులో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉంటారు. పుల్వామా ఉగ్రదాడిని కాంగ్రెస్‌ రాజకీయం చేయాలని చూస్తోంది. రాహుల్‌ గాంధీ సైనికుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు’.. అని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అటు కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్‌లో గురువారం నిర్వహించిన ‘శక్తి కేంద్రాల సమ్మేళన్‌’ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, కశ్మీర్‌లోని పుల్వామాలో మన సైనికులు పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల దాడుల్లో వీరమరణం పొందితే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులను ఖండిస్తుంటే చంద్రబాబు మాత్రం పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను విశ్వసిస్తున్నారని, భారతదేశంలో ఉండి భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి, పక్క రాష్ట్రాలు వెళ్లి ధర్నాలు చేయడమేమిటని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తొలుత ఎన్టీఆర్‌ను, తరువాత వాజ్‌పేయ్‌ను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబును సమర్ధించే మీడియా నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను నమ్మించే ప్రయత్నం చేస్తోందని, దీనిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వసించరన్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లులో ఉన్న 14 అంశాల్లో 90 శాతం నెరవేర్చామన్నారు. పదేళ్లలో చేయాల్సిన అభివృద్ధిని మోదీ ఐదేళ్లలో పూర్తిచేశారన్నారు. తీరప్రాంతంలో గ్రీన్‌ ఫీల్డ్‌ అభివృద్ధికి రూ.55,475 కోట్లు మంజూరు చేసామని ఆయన చెప్పారు. గెయిల్, హెచ్‌పీసీఎల్‌ సంస్థలు రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌ నిధులను చంద్రబాబు, టీడీపీ  నేతలు మింగేసి, నిధులు ఇవ్వటంలేదంటూ దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. 

చంద్రబాబు, జగన్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందదు
టీడీపీ, వైఎస్సార్‌సీపీలు కుటుంబ అభివృద్ధి కోసమే పాటు పడుతున్నాయని అమిత్‌ షా అన్నారు. చంద్రబాబు పెద్ద మోసగాడని.. చంద్రబాబు, జగన్‌ వలన రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పారు. రానున్న ఎన్నికలు దేశాన్ని ప్రభావితం చేస్తాయని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, చంద్రబాబును ఓడించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వీరజవాన్ల మరణాన్ని రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారన్నారు. సైనికుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. సైనికులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, గుండెల నిండా దేశభక్తి గల పార్టీ æబీజేపీ అని అన్నారు. అమరులైన సైనికులకు ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు. నెహ్రూ కారణంగానే కశ్మీర్‌ సమస్య తలెత్తిందని, పటేల్‌ ప్రధాని అయి ఉంటే హైదరాబాద్‌ మాదిరిగానే కశ్మీర్‌ సమస్య కూడా పరిష్కారమయ్యేదని అమిత్‌ షా అన్నారు. 

రైతు కోటయ్య హత్యలో బాబు పాత్ర : కన్నా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మోదీ ఇమేజ్‌తో గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం కోసం కేంద్రం నిధులిస్తుంటే చంద్రబాబు, ఆయన సన్నిహితులు కమీషన్లు మింగుతున్నారని ఆరోపించారు. పుష్కరాలు, పట్టిసీమ ప్రాజెక్టులో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలో రైతు కోటయ్య సహా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని హత్యల్లోనూ చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. మోదీ హీరో, చంద్రబాబు జీరో అని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకుంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు సునీల్‌దేవ్, దగ్గుబాటి పురందేశ్వరి, మురళీధర్, ఎంపీలు కంభంపాటి హరిబాబు, గంగరాజు, జీవీఎల్‌ నర్సింహారావు, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top