ఎన్నికల బదిలీలకు రంగం సిద్ధం!


 విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ :

 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో దీర్ఘకాలంగా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులకు స్థాన భ్రంశం కల్గనుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మూడేళ్లపాటు ఒకే జిల్లాలో ఉన్న అధికారులు, సొంత జిల్లాకు చెందిన వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తారు. ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు   కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు, ఉన్నతాధికారుల్లో బదిలీల ఫీవర్ కనపడుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు అధికారుల  మూకుమ్మడి బదిలీలకు  రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే జాబితాలు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. వచ్చే నెల నుంచి మూడు మాసాలపాటు ఇక్కడి అధికారులందరినీ వేరే జిల్లాలకు బదిలీ చేసేందుకు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.  నగరంలో,  జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసిన  రెవెన్యూ,  పోలీసు అధికారులను  గోదావరి  జిల్లాలకు బదిలీ చేస్తారు. జనవరి నెలాఖరు నాటికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో తహశీల్దార్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లాస్థాయిలో  ఎలక్ట్రోల్ అధికారులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు డెప్యుటేషన్‌పై  బదిలీ చేస్తారు. అదే విధంగా ఆ రెండు జిల్లాల నుంచి  తహశీల్దార్లు, సీఐలు ఇక్కడకు బదిలీపై  వస్తారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 49 మండలాల్లో పని చేస్తున్న తహశీల్దార్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన 39 మందిని  బదిలీ చేస్తారు. కమిషనరేట్‌లో 49 మంది సీఐలలో 40 మంది ఇతర జిల్లాలకు బదిలీ అవుతారు. ్ణజిల్లాలోనూ 22 మంది సీఐలను బదిలీపై ఇతర జిల్లాలకు పంపిస్తారు.

 

 రెవెన్యూ కార్యాలయాల్లో  కోలాహలం

 జిల్లాలో రెవెన్యూ అధికారులు బదిలీ అవుతారనే సమాచారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేయించుకునేందుకు జనం హడావిడి పడుతున్నారు. తహశీల్దార్లు బదిలీ అయితే ఎన్నికల సీజన్‌లో డెప్యూటేషన్ అధికారులు ఇతర పనులు చేపట్టే అవకాశం లేదు. దాంతో పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎన్‌ఓసీలు ఇతర పనుల కోసం జనం  ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తు చేస్తున్నారు.   

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top