ప్రభుత్వం అండతో మద్య నిషేధం అమలు 

Alcohol Ban At Machilipatnam In Krishna - Sakshi

గతంలో నాటుసారా ఏరులై పారిన గ్రామం 

అప్పట్లో వందకు పైగా కుటుంబాలు నాటుసారా తయారీలో.. 

2011లో తీవ్ర విషాదకర సంఘటనలు 

పది రోజుల వ్యవధిలో ఐదుగురు యువకులు మృత్యుఒడికి   

మార్పునకు బీజం పడింది అక్కడే..

గత ప్రభుత్వ హయాంలో మళ్లీ పోలాటితిప్పపై ‘బెల్టు’ కాటు

మత్స్యకార గ్రామంలో మళ్లీ ధైర్యంగా మద్య నిషేధం

కొన్ని విషాద సంఘటనలు మనుషుల్లో మార్పునకు బీజం వేస్తాయి. ప్రజల్లో ఐకమత్యాన్ని తీసుకొస్తాయి. మళ్లీ అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే బలమైన సంకల్పానికి పునాది వేస్తాయి. ఈ సంకల్పానికి ప్రభుత్వం  అండగా నిలిస్తే ఆ ప్రాంతంలో సంక్షేమం పరిమళిస్తుంది. సుఖశాంతులకు కేంద్రమవుతుంది. మచిలీపట్నం తీరప్రాంత గ్రామమైన పోలాటితిప్ప గతాన్ని.. వర్తమానాన్ని పరిశీలిస్తే అక్కడి జనం మద్యంపై చేసిన యుద్ధం ఆదర్శంగా నిలుస్తుంది. మత్తుపై సాధిస్తున్న విజయం స్ఫూర్తినిస్తుంది.      

సాక్షి, మచిలీపట్నం: గతంలో పోలాటితిప్ప అంటే గుర్తొచ్చేది నాటు సారా. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలో జరిగిన విషాద సంఘటనలు ఆ గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అప్పటి వరకు పేరుకు మాత్రమే ఉన్న గ్రామ పెద్దలు గ్రామంలో జరుగుతున్న తీరుపై దృష్టి సారించేలా చేసింది. మద్యం సృష్టిస్తున్న మారణహోమాలకు అడ్డకట్ట వేసేందుకు గ్రామస్తులంతా మద్యంపై యుద్ధం ప్రకటించేలా చేసింది. ప్రస్తుతం ఆ మత్స్యకార గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపినా, తాగినా కఠినమైన జరిమానాలు విధిస్తారు.
 
ఒకప్పుడు నాటు సారాకు కేరాఫ్‌ అడ్రస్‌గా..
మచిలీపట్నం సముద్ర తీరానికి అనుకుని ఉండే పోలాటితిప్ప గ్రామంలో ప్రస్తుతం 2,500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గుండేరు డ్రెయిన్‌కు ఆనుకుని ఈ గ్రామం ఉంటుంది. కేవలం చేపలు, రొయ్యల వేట, సేద్యం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. ఈ గ్రామ పరిసరాల్లోని గుండేరు మేజర్‌ డ్రెయిన్‌లో చిన్నచిన్న లంక భూములు ఉంటాయి. ఆ భూములకు పడవలు వేసుకుని మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటును ఆసరాగా తీసుకుని గ్రామంలోని కొందరు నాటు సారా తయారీ కుటీరాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసేవారు. సారా కేంద్రాలపై దాడులు చేయడం అప్పట్లో ఎక్సైజ్‌ అధికారులకు పెద్ద సవాల్‌గా మారేది. అధికారులు ఎవరూ రాలేకపోవడంతో 2011 వరకు అక్కడ సారా తయారీ విచ్చలవిడిగా సాగేది. మచిలీపట్నం, గూడూరు, పెడన, అవనిగడ్డ ప్రాంతాలకు సారా ఈ గ్రామం నుంచే తరలివెళ్లేది. పోలాటితిప్ప నాటు సారాకు అప్పట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. మందుబాబులు సైతం ఈ గ్రామంలో తయారైన సారాను ఇష్టంగా తీసుకునేవారు.

గ్రామంలో వందకు పైగా కుటుంబాలు నాటు సారా తయారీ ద్వారానే జీవనోపాధి సాగించేవారు. గ్రామస్తులు నిత్య కష్టజీవులు కావడంతో ప్రతి రోజూ కనీసం ఓ గ్లాసు సారా తాగకుండా నిద్రపోయేవారు కాదు. చిన్నాపెద్దా తేడా లేకుండా సారాకు బానిసలు కావడంతో అప్పట్లోనే కొందరు పెద్దలు సారా తయారీని అడ్డుకోవాలని కృషి చేశారు. అయితే గ్రామంలో ఓ కుటీర పరిశ్రమగా మారడం, అత్యధిక ప్రజల జీవనాధారంగా కొనసాగడంతో పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అయితే 2011లో పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న లంకే ఏడుకొండలు నాటు సారా తయారీని  ఆపేయ్యాలంటూ మొట్టమొదటిగా గళం విప్పారు. దీనికి కొందరు పెద్దలు అండగా నిలవగా అత్యధిక ప్రజలు ఆపేది లేదంటూ మొండికేశారు. చేసేది లేక అప్పట్లోనే సర్పంచ్‌ లంకే ఏడుకొండలు బోట్లలో ఎక్సైజ్‌ అధికారులను లంక భూముల్లోకి తీసుకెళ్లి కొన్ని సారా కేంద్రాలను ధ్వంసం చేయించారు. అయినప్పటికీ ఆయన ప్రయత్నం కేవలం కలగానే మిగిలిపోయింది.
 
ప్రభుత్వం అండతో మద్య నిషేధం అమలు 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బెల్టు షాపుల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మద్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రకటన ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన గ్రామ పెద్దలకు ఊపిరి పోసింది. ఓ వైపు ఎక్సైజ్‌ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో దాడులు విస్తృతం చేశారు. దీంతో ఇటీవల నూతనంగా గ్రామ పెత్తందార్లుగా ఎన్నికైన మోకా రాంబాబు, లంకే నాగమల్లి, మోకా నాగూర్, సున్నపూడి వసంతరావు, గాడి వెంకటేశ్వరరావు గ్రామంలో మద్యం నిషేధాన్ని మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు. 20 రోజుల క్రితం పెద్దలు గ్రామస్తులకు ఈ నినాదం వినిపించారు. అయితే కొందరు పెద్దలు మాటను ఖాతరు చేయకుండా అమ్మకాలు సాగించడం, విచ్చలవిడిగా తాగడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు ఎక్సైజ్‌ అధికారుల సాయం తీసుకున్నారు. వారం రోజులుగా గ్రామంలో మద్యం విక్రయాలు, తాగడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
 
ఐదేళ్లలో పాక్షికంగా చెదిరిన కుల కట్టుబాటు 
పోలాటితిప్ప గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి 2013 వరకు పంచాయతీ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. గ్రామ పెద్దలు ఎవరు నిర్ణయిస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్‌ బాధ్యతలు తీసుకుంటారు. సర్పంచ్‌ ఉన్న లంకే ఏడుకొండలు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఐక్యత కొరవడింది. గ్రామ పెద్దలు మాటను ఖాతరు చేయకుండా కొందరు యువకులు ఎన్నికలకు కాలుదువ్వడంతో 2013లో మొట్టమొదటిగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గ్రామంలోని కొందరు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు. కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ప్రభుత్వ సాయం కోరినా ఫలితం లేకుండా పోయింది. నెమ్మదిగా అక్కడక్కడా సారా తయారీ కేంద్రాలు పుట్టుకొచ్చాయి. గ్రామ సమీపంలోని పాతేరులో గత ఏడాది జరిగిన గ్రామ దేవత సంబరాల్లో పోలాటితిప్ప సారా ఏరులై పారింది. అప్పుడప్పుడు సుదూర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోయేది. ఇదే తరుణంలో గ్రామంలో బెల్టు షాపులు పడగ విప్పాయి. ఈ ఐదేళ్ల కాలంలో కొందరు వృద్ధులు మద్యం కారణంగా మృతి చెందడం, మరికొందరు ఆస్పత్రుల పాలవ్వడం జరుగుతూ వచ్చింది. 

పది రోజుల్లో  ఐదుగురు మృతి  
మద్యం మహమ్మారి నిలువెల్లా ఆవహించడంతో యువకులు సైతం నాటు సారాకు బానిసలయ్యారు. కుటుంబాల్లో కలహాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే  2011లో 15–25 మధ్య వయసున్న ఐదుగురు కేవలం పది రోజుల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరడంతో గ్రామంలో ఒక్క సారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం నాటు సారా తాగడం వల్లే వీరందరూ మృతి చెందడంతో గ్రామస్తుల్లో కనువిప్పు కలిగింది. ఈ వరుస మరణాల నేపథ్యంలో అత్యధికంగా గ్రామస్తులు అప్పటి సర్పంచ్‌ లంకే ఏడుకొండలు వైపు మొగ్గు చూపారు. మద్యంపై యుద్ధం ప్రకటించాలనే నినాదం అప్పట్లోనే గ్రామంలో మార్మోగింది. అనుకున్నదే తడవుగా  ఎక్సైజ్‌ సిబ్బందిని గ్రామానికి తీసుకెళ్లి లంక భూముల్లో ఉన్న సారా కేంద్రాలను కూకటి వేళ్లతో పెకిలించి వేశారు. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు ఊర్లో సారాతో పాటు  మద్యం అమ్మినా, తాగినా చర్యలు తీసుకుంటామని కులకట్టుబాటును 
తీసుకొచ్చారు. 

పూర్తిగా కట్టడి చేస్తాం 
గ్రామంలో మద్యాన్ని నిషేధించేందుకు మాకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. మేము కొత్తగా పెత్తందారులుగా ఎన్నికైన రోజునే మొట్టమొదటిగా మద్యాన్ని ఆపేయ్యాలని ఆదేశాలు ఇచ్చాం. అయినా కొందరు అమ్మారు. ఈ విషయాన్ని వెంటనే ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఎక్కడా అమ్మకాలు లేవు. అప్పుడప్పుడు గ్రామానికి వెళ్లి విచారణ చేయాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ జెడ్పీటీసీ సభ్యులు లంకే ఏడుకొండలు ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఐదేళ్లు గ్రామానికి మద్యం చేరకుండా చర్యలు తీసుకుంటామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. – మోకా రాంబాబు, గ్రామ పెద్ద 

మద్యం అమ్మకాలు లేవు 
గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో నేను ఉన్నాను. గతంలో అమ్మిన వ్యక్తుల వివరాలను నా వంతు బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెద్దలు విధించిన కులకట్టుబాటుతో ప్రస్తుతం మద్యం అమ్మకాలు జరగడం లేదు. మా గ్రామస్తుల్లోనూ మార్పు వచ్చింది. మద్యం తాగే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.  – బి.మాణిక్యాలమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top