బాబోయ్‌ బెజవాడ !

Air And Sound Pollution In Vijayawada - Sakshi

ప్రమాదకరస్థాయిలో వాయు, శబ్ద కాలుష్యం

ముంచెత్తుతున్న కాలుష్య కారకాలు పీఎం 2.5,  పీఎం 10

కాలుష్య ప్రమాణాలు ఆందోళనకరమన్న సీపీసీబీ

చోద్యం చూస్తున్న ప్రభుత్వం

విజయవాడలో వాయు కాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఐదేళ్లుగా వాయు కాలుష్యం తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటం బెంబేలెత్తిస్తోంది. ‘విజయవాడ కాలుష్య కాసారం’ అని జాతీయ కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తేల్చేసింది. ఇక్కడ గాలి, నీరు కూడా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేవని కుండబద్దలు కొట్టింది. సీపీసీబీ నివేదిక ప్రకారం విజయవాడలో వాయు కాలుష్యం 71.21 శాతంతో ప్రమాదకరస్థాయిలో ఉంది. నీటి కాలుష్యం 44.64 శాతంతో ఆందోళన కలిగిస్తోంది. వ్యర్థ పదార్థాల నిర్వహణ లోపం 66 శాతంతో అధ్వానంగా మారింది. పారిశుధ్యలోపం 62 శాతం ఉంది.

సాక్షి, అమరావతిబ్యూరో: ‘ఈ గాలీ... ఈ నేలా...’ అని విజయవాడలో ఆనందగీతికి పాడుకునే రోజులు కావివి...‘ఈ గాలీ... ఈ గోలా...’ అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ముంచుకొస్తోంది. నగరంలో వాయు, శబ్ధ కాలుష్యాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. దేశ సగటు  స్థాయికంటే కూడా నగరంలో ఈ రెండు కాలుష్యాలు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్లుగా కాలుష్యం అమాంతంగా పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది.  ప్రమాదకార కాలుష్యకారకాలతో ప్రజలు రోగాల బారిన ప డే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులతో ఇబ్బందికర పరిస్థితికి గురయ్యే అవకాశాలున్నాయి.

ప్రమాదకరస్థాయిలో కాలుష్యం...
అత్యంత ప్రమాదకరమైన ‘ఫైన్‌ పర్టిక్యులేట్‌  మేటర్‌ 2.5 (పీఎం 2.5), పీఎం 10 నగరంలో అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. వాహనాల పొగ, పారిశ్రామిక వ్యర్థాలు, క్వారీల వ్యర్థాలు, నిర్మాణ కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలతో అతి చిన్న పీఎం 2.5, పీఎం 10 అనేవి గాలిలోకి చేరుతాయి. పీఎం 2.5, పీఎం 10 దేశంలో సగటు స్థాయికంటే కూడా నగరంలో అతధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

పీల్చే గాలితో శ్వాసకోస వ్యాధులు....
పీఎం 2.5 కంటికి కనిపించని అతి సుక్ష్మమైన కాలుష్య కారకం. తల వెంట్రుకలో వందోవంతు అంత సన్నగా ఉంటుంది. మనం పీల్చే గాలి ద్వారా పీఎం 2.5 నేరుగా మన శ్వాసకోశంలోకి చేరుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతటి ప్రమాదకరమై  పీఎం 2.5 గాలిలో 60 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. 60 మైక్రో గ్రాముల నుంచి 120 మైక్రో గ్రామలు వరకు ఉంటే స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. 120 మైక్రో గ్రాముల నుంచి 250 మైక్రో గ్రాముల వరకు ఉంటే కాస్త తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. అదే 250 మైక్రో గ్రాములు దాటితే ప్రమాదకరమైన శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం విజయవాడలో గాలిలో పీఎం 2.5 ఏకంగా 535 మైక్రోగ్రాములు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
నగరంలో పీఎం 10’ కూడా ప్రమాదకరస్థాయిలోనే ఉంది. పీఎం 10 జాతీయ సగటు 60 /యూజీ/ఎం3 గా ఉంది.  విజయవాడలో మాత్రం పీఎం 10 ఏకంగా 100/యూజీ/ఎం3కు చేరుకుంది. 2011లో  పీఎం 10 విజయవాడలో 90 ఉండగా... 2015లో ఏకంగా 110కు చేరుకుంది. 2017లో ఏకంగా 87కు తగ్గింది. కానీ మళ్లీ తాజాగా 100కు చేరుకుంది.

మోత మోగుతోంది....
మరోవైపు విజయవాడలో శబ్ధ కాలుష్యం  మోత మోగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం శబ్ధ పరిమాణం గరిష్టంగా 50 డెసిబెల్స్‌ వరకు ఉండాలి. కానీ తాజా నివేదిక ప్రకారం విజయవాడలో అది 75 డెసిబెల్స్‌కు చేరుకుంది.  ఆటోనగర్‌లో ఏకంగా 85 డిసిబల్స్‌కు చేరుకోవడం గమనార్హం. లబ్బీపేట, సూర్యారావుపేట, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో 80 డెసిబెల్స్‌ ఉంది. నగరంలో 2013 నుంచి శబ్ధ కాలుష్యం  ఏటా 5 శాతం పెరుగుతూ వస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top