చంద్రన్న కానుక..పేదల కినుక

Adultrate Godds Supplying in Chandranna Kanuka - Sakshi

నాసిరకంగా ‘సంక్రాంతి’ సరుకులు  

బూజుపట్టిన బెల్లం పంపిణీ

పిండి, బేడల్లో పురుగులు

ఆగ్రహిస్తున్న నిరుపేదలు

ఈమె నార్పల మండల కేంద్రానికి చెందిన జయమ్మ. తన తెల్లకార్డు (122700100427) తీసుకుని నార్పలలోని షాపు నంబరు–1 డీలర్‌ వద్ద సంక్రాంతి కానుక తీసుకుంది. ఇంటికి వెళ్లి సరుకులను చూడగా...బెల్లం బూజుపట్టి ఉంది. గోధుమ పిండి, బేడల ప్యాకెట్లపైనే పురుగులు కనిపించాయి. ఉచితం అంటూ సంక్రాంతి పండుగకు ఇలా పురుగులు, బూజు పట్టిన నాసిరకం సరుకులు ఇస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుకపై పేదలు కినుక వహిస్తున్నారు. ఉచితమని పురుగులను కానుకగా ఇస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.25.29 కోట్లు విలువ చేసే సరుకులను సరఫరా చేసింది. అయితే సరుకులన్నీ నాసిరకంగా ఉన్నాయంటూ లబ్ధిదారుల వాపోతున్నారు. పురుగులు పట్టిన పిండి, బేడలు, బూజుపట్టిన బెల్లం ఇస్తున్నారని...అవి తింటే పండుగరోజున ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

రూ.25.29 కోట్ల విలువైన సరుకులు
జిల్లాలో 12,16,361 తెల్లకార్డులున్నాయి. సంక్రాతి కానుక కింద ప్రభుత్వం కిలో గోధుమపిండి, అరకిలో చొప్పున కంది బేడలు, శనగ బేడలు, బెల్లం, అరలీటరు పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్, అన్నింటినీ ఒక సంచిలో వేసి ఇస్తోంది.   ఇందుకోసం ప్రభుత్వం రూ.25.29 కోట్లు వెచ్చించినా... సరుకులు నాసిరకంగా ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బూజుపట్టిన బెల్లం,పురుగు పట్టిన సరుకులు
సంక్రాంతి కానుక కింద ఇస్తున్న అరకిలో బెల్లం నీరుగా మారింది. అంతే కాకుండా బూజుపట్టింది. ఇక గోధుమ పిండి, బేడలు పురుగులు పట్టాయి. నల్లపురుగులు సరుకుల్లోనే కాకుండా బయటికి వచ్చి ప్యాకెట్ల మీద పారాడుతున్నాయి.  

కాంట్రాక్టర్ల లబ్ధికోసమే
రంజాన్, క్రిస్టమస్, సంక్రాంతి పండుల సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలతో కాంట్రాక్టు పొందిన వ్యక్తులకే మేలు కలుగుతోందని..కార్డుదారులు నాసిరకం వస్తువులతో ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పొందిన వ్యక్తులు తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు సరఫరా చేశారనే ఆరోపణలు కార్డుదారుల నుంచి వినవస్తున్నాయి.

సరుకులు మార్చుకోవచ్చు
ఎక్కడైనా సంక్రాంతి కానుక కింద ఇస్తున్న సరుకులు పాడై ఉంటే తక్షణం వాటిని మార్చుకుని మంచి సరుకులు తీసుకోవచ్చు. సరుకుల మార్చి ఇవ్వాలని జిల్లాలోని డీలర్లందరికీ ఆదేశాలు జారీ చేశాం.  
– చిదంబరరావు, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top