ఏపీ మోముపై యాసిడ్‌ మరక

Acid attacks in Andhra Pradesh highest in South India - Sakshi

పెరుగుతున్న యాసిడ్‌ దాడులు

భావోద్వేగంతో తెగబడుతున్న యువత

దక్షిణ భారతంలో రాష్ట్రానిదే మొదటి స్థానం

సమాజానికి ముఖం చాటేస్తూ.. పరదా మాటున బతుకీడుస్తూ.. నిత్యం అవమానాలను భరిస్తూ దుర్భర  జీవితాన్ని నెట్టుకొస్తున్నారు యాసిడ్‌ దాడి బాధితులు. చట్టాలు, శిక్షలు ఎన్నున్నా దాడులు ఆగడం లేదు. పగ, ప్రతీకారం, వివాహేతర సంబంధాలు, వృత్తిరీత్యా అసూయ, లైంగిక వేధింపుల కారణంగా జరుగుతున్న యాసిడ్‌ దాడులకు ఆంధ్రప్రదేశ్‌ నిలయంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే  మొదటిస్థానంలో ఉంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన కె.వెంకటరమణ, అతని సోదరుడు కె.పోల్‌రాజుల మధ్య 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్‌ 12న ఇంట్లో నిద్రపోతున్న వెంకటరమణ, ఆయన భార్య రాణిపై పోల్‌రాజు యాసిడ్‌ పోశాడు. తీవ్ర గాయాలపాలైన దంపతులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బొబ్బిలి కోర్టులో కేసు నడుస్తోంది. యాసిడ్‌ దాడి బాధితులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం వీరు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటరమణ విశాఖలోని ఓ ప్రైవేటు షాపులో సేల్స్‌మన్‌గా జీవనం సాగిస్తున్నారు.

ఐదేళ్లలో ఒకే ఒక తీర్పు..
రాష్ట్రంలో జరిగిన యాసిడ్‌ దాడుల్ని పరిశీలిస్తే ఐదేళ్లలో ఒకే ఒక కేసులో తీర్పు వెలువడింది. విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం సోంపురానికి చెందిన గొరిపోతు ఈశ్వరరావు అదే గ్రామానికి చెందిన రావాడ శశికళను ప్రేమ పేరుతో వేధించాడు. నిరాకరించడంతో  కక్ష బూని ఇంట్లో ఉన్న ఆమెపై 2003 మే 24న యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు 70 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెకు వైద్యులు పలు దఫాలుగా ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు బాధితురాలికి రూ. 3.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ నిందితుడు ఈశ్వరరావుకు 2017 ఫిబ్రవరిలో ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో హైకోర్టు నిందితుడికి ఆరునెలల శిక్ష, రూ. 6 వేల జరిమానా విధించింది. మిగిలిన కేసుల్లో బాధితులు న్యాయం కోసం ఇప్పటికీ నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో యాసిడ్‌ దాడికి సంబంధించిన కేసుల్లో సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శిక్షను కూడా పది సంవత్సరాల వరకూ పెంచింది.

చట్టం రాకతో కేసుల నమోదు    
గడిచిన ఐదేళ్ల నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలను పరిశీలిస్తే రెండేళ్లు మినహా అన్నిసార్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌  మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 2015లో ఏకంగా 14 యాసిడ్‌ దాడి కేసులు నమోదయ్యాయి. 2013 వరకు దేశంలో యాసిడ్‌ దాడులకు శిక్ష విధించేందుకు ప్రత్యేక చట్టం ఏదీ లేదు. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో 2013 ఫిబ్రవరిలో భారత శిక్షాస్మృతిలో సవరణలు చేసి సెక్షన్‌ 326ఎ, 326బి ప్రకారం యాసిడ్‌ దాడి కేసులను నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో 2014 నుంచి దాడులకు సంబంధించిన అధికారిక లెక్కలు వెలుగుచూశాయి.  

2017 మే  నెలలో గుంటూరు జిల్లా వెనిగండ్లలో కొత్తగా పెళ్లయిన షేక్‌ మహమ్మద్‌ ఇలియాస్‌ (24) యాసిడ్‌ దాడిలో మృతిచెందాడు. హిమబిందుతో వివాహేతర సంబంధం నడుపుతూ మరో యువతిని పెళ్లాడాడు. తనకు అన్యాయం చేశాడనే కోపంతో హిమబిందు.. ఇలియాస్‌పై యాసిడ్‌ దాడికి పాల్పడింది.

ఇలాంటి సంఘటనే మరొకటి విశాఖలోని అబీద్‌నగర్‌లో జరిగింది. వై.స్వప్న తన మాజీ ప్రియుడు బి.సత్యనారాయణరెడ్డి మరో యువతిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడడంతో కక్ష పెంచుకుంది. ప్రియుడ్ని ఏమీ చేయకుండా రజనిపై యాసిడ్‌ దాడి చేసింది. అదృష్టవశాత్తూ ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.  

సెప్టెంబర్‌ 19వ తేదీన విశాఖలోనే పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ బాలాజీ పట్నాయక్‌పై జరిగిన యాసిడ్‌ దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా విజయనగరం జిల్లా జామి మండలం తాండ్రంగి గ్రామంలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిపై అదే గ్రామానికి చెందిన గండి కృష్ణ యాసిడ్‌ పోశాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

అమ్మకాలపై కఠిన వైఖరి
యాసిడ్‌ దాడి కేసులపై సత్వరమే  విచారణ  చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలి. దాంతోపాటు  బాధితులకు నష్టపరిహారం వెంటనే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా యాసిడ్‌ అమ్మకాలపై ప్రభుత్వం నిఘా పెంచాలి. సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేసింది. ఆ విధంగా అమలుచేస్తే దాడులను కొంతవరకైనా
అరికట్టవచ్చు.     – వై.పరుశురాం, సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, విజయనగరం.
 

ఆయుధంలా...
పగ, ప్రతీకారం  తీర్చుకోవడానికి  యాసిడ్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇటీవల విశాఖలో డాక్టర్‌పై జరిగిన యాసిడ్‌ దాడి  ఇటువంటిదే. సినిమాల ప్రభావంతో  యువత పెడదోవ పడుతోంది. యాసిడ్‌ దాడికి పాల్పడినవారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలి.  –గువ్వల తిరుపతిరావు, సీనియర్‌ న్యాయవాది, విజయనగరం.
 

భావోద్వేగంతో అనర్థాలు
యువత భావోద్వేగాలను  అదుపులో పెట్టుకోలేక యాసిడ్‌ దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ప్రేమలో వైఫల్యం చెందడం, అతిగా ఆమెను ప్రేమించినట్లు ఊహించుకోవడం వంటివి అనర్థాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ ద్వారా కొంతమేర ఆశించిన ఫలితం సాధించవచ్చు. తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తుండాలి. –పి.వి.సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top