రైతుపై యాసిడ్‌ దాడి


 అప్పు చెల్లిస్తాము రమ్మని చెప్పి రైతుపై యాసిడ్ దాడి

 

పొదలకూరు (నెల్లూరు జిల్లా) : ప్రేమను నిరాకరించి నందుకు అమ్మాయిల మీద యాసిడ్ దాడులు చెయ్యడం చూసి ఉంటాం. తీసుకున్న అప్పు చెల్లిస్తాము రమ్మని ఓ రైతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైతు చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

 

మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు మండలంలోని ముదిగేడు గ్రామానికి చెందిన మాలపాటి ఓబుల్‌రెడ్డి(38) భూములు లీజుకు తీసుకుని మినుము సాగుచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓబుల్‌రెడ్డికి బాకి చెల్లిస్తాము పొదలకూరుకు సమీపంలోని మనుబోలు మార్గం పొట్టేళ్ల కాలువ వద్దకు రావాల్సిందిగా ఫోన్‌ వచ్చింది. ఓబుల్‌రెడ్డి పొట్టేళ్లకాలువ వద్దకు వెళ్లగా ముగ్గురు వ్యక్తులు తమ వద్ద సిద్దం తెచ్చుకున్న యాసిడ్‌ను ఓబుల్‌రెడ్డి ముఖంపై పోశారు. యాసిడ్‌ దాడి జరిగిన తర్వాత బాధితుడి బంధువు రమణారెడ్డి గ్రామం నుంచి ఫోన్‌చేశాడు. నిందితులు ఓబుల్‌రెడ్డి ఫోన్‌ లిప్ట్‌చేసి ఇంకెడి ఓబుల్‌రెడ్డి యాసిడ్‌ పోశామని వెటకారంగా సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌చేశారు. బాధితుడు రోడ్డుపై పడి బాధకు తాళలేక కేకలు వేస్తుండగా అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్‌ పొదలకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. 

 

పరిచయం ఉన్న వారి పనేనా?:

 బాధితుడు ఓబుల్‌రెడ్డిపై యాసిడ్‌ దాడికి పాల్పడిన వారు తనకు తెలియదంటున్నాడు. గతేడాది సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో వెంకటేశ్వర్‌రెడ్డి ద్వారా ఓబుల్‌రెడ్డి గుంటూరు పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తులతో కలసి మినుము సాగు చేసినట్టుగా తెలుస్తోంది. వారితో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు చెపుతున్నాడు. వారు ఓబుల్‌రెడ్డికి రూ.20 వేలు బాకి ఉన్నారని అంటున్నారు. వారే దాడికి పాల్పడ్డారా? లేక గుర్తుతెలియని వ్యక్తుల వద్ద పరిచయం ఉన్న వారు దాడి చేయించారా? అన్న అనుమానాలు ఉన్నాయి.. మెరుగైన వైద్యం కోసం ఓబుల్‌రెడ్డిని నెల్లూరుకు తరలించారు. పొదలకూరు సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top