కరుణించి కొలువిస్తే రూ.కోట్లు కూడబెట్టేశాడు

ACB Raids On Serveyor Chiranjeevi Rao Visakhapatnam - Sakshi

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వేయర్‌ రోకలి చిరంజీవిరావుపై ఏసీబీ దాడి

ఏకకాలంలో పది చోట్ల జరిపిన సోదాల్లో వెలుగుచూసిన అక్రమాస్తులు

భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం

గుర్తించిన ఆస్తులు మార్కెట్‌ ధర ప్రకారం రూ.13 కోట్లుపైనే

కారుణ్య నియామకం ద్వారా అటెండర్‌గా చేరి సర్వేయర్‌గా ఎదిగిన అవినీతి తిమింగలం

వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌   

అడవివరం పంచాయితీ భూముల్లో ప్రభుత్వ సర్వే నిమిత్తం చిరంజీవిరావు విధుల్లో ఉన్న సమయంలో సుమారు 118 ఎకరాల ఇనాం భూములను 30 ఎకరాలుగా చూపించి... మిగతా భూమిని ప్రైవేటు వ్యక్తులదని చూపించి భారీ దోపిడీకి స్కెచ్‌ వేశారు. దీంతో చిరంజీవిరావుతోపాటు మరో అయిదుగురు వ్యక్తులపై విచారణ జరుగుతోంది. ఈ భూ బాగోతం వెనుక ఉన్న కథపై కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సంస్థ విచారణ చేపడుతోంది.  

విశాఖ క్రైం, ఎన్‌ఏడీ జంక్షన్, మర్రిపాలెం(జగదాంబ), పద్మనాభం: కారుణ్య నియామకం ద్వారా రెవెన్యూ శాఖలో కొలువు పొంది కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టేసిన సర్వేయర్, ఆంధ్రప్రదేశ్‌ సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రోకలి చిరంజీవిరావుపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి నగరంలోని పదిచోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. మురళీనగర్‌లోని ఎన్‌జీజీవోస్‌ కాలనీలో చిరంజీవిరావుకు చెందిన జీ ప్లస్‌ 2 ఇంటిలో డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా విలువైన భూములు, ఇంటి స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 200 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 60వేలు బ్యాంకు బాలెన్స్‌ ఉందని, చిట్స్‌లో రూ.3.14లక్షల పెట్టుబడి ఉన్నట్లు గుర్తించారు. ఏయే బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయో గుర్తించి వాటిని తెరవనున్నారు. అదేవిధంగా హ్యుండాయ్‌ కారు, రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ బుల్లెట్, హోండా యాక్టీవాలను సీజ్‌ చేశారు.ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతుండగా... మార్కెట్‌ ధర ప్రకారం మాత్రం రూ.13కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అటెండర్‌ నుంచి అవినీతి తిమింగలంలా...
ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో కారుణ్య నియామకం ద్వారా చిరంజీవిరావు 1991లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం 1992లో డిప్యూటీ సర్వేయర్‌గా పదోన్నతి పొంది అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో విధుల్లో చేరాడు. తర్వాత యలమంచిలి, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ)లో పనిచేశాడు. అనంతరం 1998లో సర్వేయర్‌గా పదోన్నతి పొంది చినగదిలి, ఆనందపురం మండలాల్లో విధులు నిర్వర్తించాడు. 2017 జూన్‌లో ఏపీఐఐసీ కార్యలయానికి బదిలీపై వచ్చి ప్రస్తుతం అక్కడ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అందినకాడికి దోచుకున్నాడనే ఆరోపణలు తొలినుంచీ బలంగా ఉన్నాయి. సోదాలలో సీఐలు గణేష్, రమేష్, రమణమూర్తి, గొలాగాని అప్పారావు, గఫూర్, మహేష్, లక్ష్మణ్‌జీ, సతీష్‌ , శ్రీకాకుళం జిల్లా సీఐ శ్రీను, íసిబ్బంది పాల్గొన్నారు.

ఎక్కడెక్కడ శోధించారంటే...
కంచరపాలెంలో చిరంజీవిరావు పనిచేస్తున్న ఏపీఐఐసీ కార్యాలయంలో.
మురళీనగర్‌ ఎన్‌జీజీవోఎస్‌ కాలనీలోని సర్వేయర్‌కు చెందిన జీ ప్లస్‌ 2  ఇంటిలో.
అదే ఎన్‌జీజీవోఎస్‌ కాలనీలో ఇద్దరు బంధువుల ఇళ్లలో.
తాటిచెట్లపాలెంలోని సన్నిహితురాలు, విశాలాక్షినగర్‌లోని ఇద్దరు స్నేహితుల ఇళ్లలో.
బక్కన్నపాలెం, పోతినమల్లయ్యపాలెంలో సహచర ఉద్యోగుల ఇళ్లలో.
ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధి యాతపేటలో చిరంజీవిరావు వినియోగిస్తున్న అద్దె ఇంటిలో.   

అక్రమార్జనతో భూముల కొనుగోళ్లు!
మురళీనగర్‌ ఎన్‌జీజీవోఎస్‌ కాలనీలోని 240 స్క్వేర్‌యార్డ్‌ విస్తీర్ణంలో జీ ప్లస్‌ 2 ఇల్లు  
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరులో 10 సెంట్లు భూమి.  
విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో 0.92 సెంట్ల భూమి.
అదే పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో 2011వ సంవత్సరంలో భార్య వరలక్ష్మి పేరు మీద కొనుగోలు చేసిన 3.01 ఎకరాల మామిడి తోట.  
మొత్తంగా రెడ్డిపల్లి నుంచి కోరాడ వెళ్లే మార్గంలో కొనుగోలు చేసిన ఈ నాలుగు ఎకరాల మామిడితోట విలువే మార్కెట్‌ రేటు ప్రకారం రూ.1.20కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ తోటలు కొనుగోలు చేసిన సమయంలో చిరంజీవిరావు ఆనందపురం మండలంలో సర్వేయర్‌గా పనిచేస్తుండడం గమనార్హం.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో భార్య ఆర్‌.వరలక్ష్మి పేరు మీద 268.88 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి స్థలం.  
కప్పారాడ పరిధి ఎన్‌జీజీవోస్‌ కాలనీలోని లక్ష్మీనరసింహ హోమ్‌లో 906 చదరపు గజాల విస్తీర్ణంలో గల ఫ్లాట్‌.  
మధురవాడ దరి రావలపాలెంలో తల్లి ఆర్‌.లక్ష్మి పేరు మీద 2012లో 80 గజాల ఇంటి స్థలం.  
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరులో 291 స్క్వేర్‌ యార్డ్స్‌ ఇంటి స్థలం.  

బక్కన్నపాలెంలో సర్వేయర్‌ ఇంటిలో...
మధురవాడ(భీమిలి): జీవీఎంసీ 4వ వార్డు మధురవాడ బక్కన్నపాలెంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ నివాసం ఉంటున్న లైసెన్సెడ్‌ సర్వేయర్‌ పోతిన పెంటరాజు ఇంటిలో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా సోదాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మహేశ్వరావు మాట్లాడుతూ బక్కన్నపాలెంలో నిర్వహించిన సోదాల్లో ఏ విధమైన ఆధారాలూ లభ్యం కాలేదన్నారు. అయితే పెంటరాజు జీవీఎంసీ 5వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పిళ్లా నర్శింగరావుకు అత్యంత దగ్గరి బంధువు. ఈయన 2014లో ఆనందపురం మండలంలో చిరంజీవిరావుతో కలిసి సుమారు రెండు నెలలు పనిచేశారు. ఈ మేరకు ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. రేవళ్లపాలెం రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న పీఎంపాలెం పోలీస్టేషన్‌ భవనం ఎదురుగా 60 గజాల్లో రొంగలి చిరంజీవరావు తల్లి పేరు మీద ఇల్లు ఉందని గుర్తించినట్టు తెలిపారు. ఇంకా అన్ని  కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నామని మహేశ్వరరావు చెప్పారు.

పాసుపుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం
ఆనందపురం(భీమిలి): ఏపీఐఐసీలో సర్వేయర్‌గా పని చేస్తున్న రోకలి చిరంజీవిపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో జరిగిన దాడులలో భాగంగా బుధవారం ఆనందపురం మండలంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఏసీబీ సీఐ రమేష్‌ సిబ్బందితో కలిసి మండలంలోని గంభీరం పంచాయతీ, యాతపేటలో విచారణ జరిపారు. అక్కడ 3 – 77 నంబరు గల ఇంట్లో సోదాలు నిర్వహించారు. గతంలో చిరంజీవి ఆనందపురం మండలంలో సుమారు ఐదేళ్లు పని చేశారు. ఆ సమయంలో మండలంలో పని చేస్తున్న ఓ మహిళా వీఆర్వోతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అలాగే సర్వే చేసే విషయంలో కచ్చితమైన రేట్లు ఫిక్స్‌ చేసి రిపోర్టులు ఇచ్చేవారని,  బడాబాబులు సేవలో తరించే వారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ముందుగా బదిలీపై వెళ్లిపోగా... అనంతరం అతనితో సాన్నిహిత్యంగా ఉండే మహిళా వీఆర్వో బదిలీపై డివిజన్‌ మారిపోయి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారు గంభీరం పంచాయతీ, యాతపేటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని తరచూ రహస్యంగా కలుస్తున్నారన్న విషయం ఏసీబీకి తెలిసింది. ఆ ఇంట్లో అక్రమాస్తులకు సంబంధించి వివరాలు లభ్యం కావచ్చని భావించిన అధికారులు తాళాలు పగలు గొట్టి లోపలికి ప్రవేశించారు. సోదాచేయగా కొంత మంది పేరున ఉన్న అన్‌ రిజిస్ట్రీ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు లభ్యంకాగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిరంజీవి ఆనందపురం మండలంలో పని చేసిన సమయంలో సన్నిహితంగా ఉండే లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పైన దృష్టి సారించారు. ఈ మేరకు వారి ఆస్తుల పైనా ఆరా తీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top