పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్‌

Aadhaar for students in schools itself - Sakshi

పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్‌

సెప్టెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి సేవలు

సాక్షి, అమరావతి బ్యూరో: విద్యార్థులకు ఆధార్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముందుగా మండలానికి ఇద్దరు టీచర్ల చొప్పున ఈ నెల 27న శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేషన్‌ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. రేషన్‌ కార్డులో తల్లిదండ్రుల పేర్లకు ఈకేవైసీ అవుతున్నా పిల్లలకు కావడం లేదు. పిల్లల వేలిముద్రలను ఆధార్‌లో అప్‌డేట్‌ చేస్తేనే ఈకేవైసీకి అవకాశం ఉంటోంది. దీంతో చిన్నతనంలో ఆధార్‌ పొందినవారికి వేలిముద్రల అవసరం పడుతోంది. దీంతో ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం వచ్చేవారితో పోస్టాఫీసులు, బ్యాంకులు, మీసేవా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది.

విద్యార్థులను స్కూల్‌ మానిపించి మరీ తల్లిదండ్రులు ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్‌ అప్‌డేషన్‌ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు మేలు చేకూరనుంది.

ఉపాధ్యాయులకు 27న శిక్షణ : గంగాభవాని, డీఈఓ, గుంటూరు
ఈ నెల 27న ఆధార్‌ సేవలపైన మండలానికి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున గుంటూరు జిల్లాలో 114 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారు ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇచ్చి, ఆ పాఠశాలలోని విద్యార్థులకు ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top