9వ రోజు పాదయాత్ర డైరీ

9th day Ys Jagan padayatra diary - Sakshi - Sakshi - Sakshi

15–11–2017, బుధవారం
ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా 

రైతులు ఇప్పటికైనా మేల్కోవాలి 

ఆర్‌.కృష్ణాపురం నుంచి ఈ రోజు ఉదయం 8 గంటలకే బయలుదేరాం. తర్వాతి ఊరు పెద్ద కోటకందుకూరు. ఇరుకైన వీధులు, డ్రెయినేజీ లేక గుంతలతో బురదమయమై దుర్గంధభరితంగా ఉన్న రోడ్లు, పక్కా ఇళ్లు లేని నిరుపేదలు... ఇదీ ఆ ఊరి పరిస్థితి. కడుపు తరుక్కుపోయింది. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలని అంటారు. కానీ, ఈ రోజు ఆ పల్లెలను పట్టించుకునే ఓపిక ప్రభుత్వానికి లేకుండా పోయింది.  
 
పాదయాత్ర ఆళ్లగడ్డకు చేరుకునే వరకు మొత్తం పంట పొలాల మధ్య నుంచే సాగింది. పెద్ద సంఖ్యలో కూలీలు నన్ను కలవడానికి వచ్చారు. వాళ్లలో చాలా మందికి సొంత ఇల్లు కానీ, పొలం కానీ లేవు. ఏ రోజు కష్టం ఆ రోజుకే. పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కుటుంబం మొత్తం చితికిపోయే దైన్యస్థితి. అటువంటి కష్టజీవులకు ఈ ప్రభుత్వం గత ఏడాదిగా ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి కూలి డబ్బులు ఇవ్వడం లేదు! ఇంతకు మించిన దుర్మార్గం ఇంకెక్కడైనా ఉంటుందా? 
 
దారిలో నిమ్మ రైతులు కలిశారు. వారి పంటకు తగిన రేటు లేదని బాధపడ్డారు. పాదయాత్రలో ఇప్పటి వరకు నన్ను కలిసిన ప్రతి రైతుదీ ఇదే ఆవేదన. అసలు ఏ పంటకూ రేటు లేకపోవడమేమిటి? ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన పెద్దమనిషి... ఈ రోజు రైతులపై యుద్ధం ప్రకటించాడు. వారి పంటలకు ధరలు లేకుండా చేశాడు. రైతులు ఇప్పటికైనా మేల్కోవాలి. నిస్పృహను వదిలి ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలి.  
 
ఆళ్లగడ్డలోకి ప్రవేశించగానే నేను ఒకరకమైన ఉద్వేగానికి గురయ్యాను. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా కార్యకర్తల్లో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, ఆళ్లగడ్డ ప్రజల్లో రెట్టించిన ఆప్యాయత, ప్రేమానురాగాలు నన్ను కదిలించి వేశాయి. ఇక్కడ నాకు నిరీక్షణ అనే పాప కనిపించింది. ఒళ్లంతా కాలిపోయి ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉంది. ఆమెకు మాట్లాడడానికే కష్టంగా ఉంది. ‘‘రెండేళ్లుగా పింఛన్‌ కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నా’’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తాను. ఆయన స్పందిస్తాడని ఆశిస్తున్నాను.  
 
ఈ రోజు వరి, పత్తి, మినుము, బుడ్డశెనగ, ధనియాలు... ఏ పంటయినా రైతు చేతికి రాగానే ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఏమైంది మీ ధరల స్థిరీకరణ నిధి? ఎక్కడికెళ్లాయి మీ ఐదు వేల కోట్లు? మీ పాలనలో ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇన్ని లక్షల మంది రైతులను కడగండ్ల పాలు చేస్తే మీకు ఒరిగేదేమిటి?   
- వైఎస్‌ జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top