8వ రోజు పాదయాత్ర డైరీ

8th day padayatra dairy - Sakshi

14–11–2017, మంగళవారం  
కృష్ణాపురం, కర్నూలు జిల్లా  

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి 
ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర కర్నూలు జిల్లా గొడిగనూరు గ్రామం వద్ద 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నా పాద యాత్ర సంకల్పాన్ని మరోసారి ప్రజలకు వివరిం చాను. ఒకపక్క విభజన కారణంగా రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కూరుకు పోయిందని చెబుతోన్న ఈ పాలకులు, మరోపక్క రాష్ట్ర వనరులను అందినకాడికి అందినంత దోచుకుంటున్నారు. ప్రజలకు దక్కాల్సిన కనీస ప్రయోజనాలను కూడా వారికి దక్కకుండా చేస్తున్నారు. పైగా అభివృద్ధి కోసమే మా తపనంతా అంటున్నారు! అభివృద్ధి అంటే మూడడుగులు ముందుకు, నాలుగ డుగులు వెనక్కు వెయ్యడం కాదు. నిన్నటి కన్నా నేడు, నేటి కంటే రేపు బాగుండడం. ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడం. ఈ ఆలోచనతోనే ప్రజాసంకల్ప యాత్ర మొదలు పెట్టాను.

ఉదయం 8.30కి వైఎస్సార్‌ జిల్లా ఇడమడక గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది. చాగలమర్రిలో జరిగిన బహి రంగ సభలో నర్సింహ అనే  దివ్యాంగుడు కలిశాడు. అతనికి కళ్లు కనిపించవు. నూరు శాతం అంగవైక ల్యం ఉంది. గత మూడే ళ్లలో అనేకసార్లు జన్మ భూమి కమిటీ సభ్యుల ను కలసి దివ్యాంగుల పింఛన్‌ కోసం అనేక అర్జీలు ఇచ్చాడు. మొర పెట్టుకున్నాడు. అయినా ప్రయోజనం లేదు. జగనన్నకు చెప్పుకుంటే పెన్షన్‌ వస్తుందని గ్రామస్తులు చెప్పారట. నా దగ్గరకు వచ్చాడు. కన్నీళ్లతో గోడు వెళ్లబోసుకున్నాడు. అతని బాధ వింటే మనసు కదిలిపోయింది. కలెక్టర్‌కు అతని సమస్య రాస్తున్నాం. రాష్ట్రం మొత్తం వినపడేలా నర్సింహ తన కష్టం చెప్పుకున్నాక కూడా అతనికి పింఛన్‌ ఇవ్వకుండా ఆపుతారని నేననుకోవడం లేదు. చూడాలి. చాగలమర్రిలోనే హుస్సేన్‌బీ అనే అవ్వ తన బాధలు చెప్పుకోవడానికి వచ్చింది. ఆమెకు చేతులకు వేళ్లు లేవు. ప్రమాదంలో కాలిపోయాయి. ఏ పనీ చేసుకునే పరిస్థితి లేదు. ఆమెకు నాన్నగారు ఉన్నప్పుడు పింఛను, రేషను వచ్చేవి. చంద్రబాబు వాటిని ఆపేశాడు. హుస్సేన్‌బీలా అన్ని అర్హతలూ ఉండి కూడా పింఛను రాక ఇబ్బందులు పడుతున్న వాళ్లు లక్షల్లో ఉన్నారు. 

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌తో ప్రభుత్వ ఉద్యోగులది మరొక సమస్య. ప్రతినెలా వాళ్లు ఇచ్చే కాంట్రిబ్యూషన్‌ను ఈ ప్రభుత్వం షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతోంది. ఒకవేళ నష్టం వస్తే అంతే సంగతులు. ఆ ఎఫెక్టుతో కర్నూలు జిల్లాలో ఒక స్కూల్‌ అసిస్టెంట్‌కైతే నెలకు కేవలం 1,200 రూపాయల పెన్షన్‌ మాత్రమే వస్తోందట. ఇటువంటి ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తూ ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందువల్లే రాబోయే రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చాను. ఈ ప్రతిపాదన పట్ల ఆ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అందువల్లనే కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టగానే ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. 

ముత్యాలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. వాళ్ల స్కూల్లో టాయిలెట్‌ వసతి లేదు, తాగునీరు లేదు. ఎంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. మరో పాఠశాల విద్యార్థులు వచ్చి గత మూడు సంవత్సరాలుగా తమ స్కూల్లో కంప్యూటర్లు పని చేయడం లేదని చెప్పారు. కనీస వసతులతో కూడిన నాణ్యమైన విద్య పిల్లల ప్రాథమిక హక్కు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలు ఇలా సమస్యలు చెప్పుకోవడం ఈ బాలల దినోత్సవం రోజు ఎంతో బాధను కలిగించింది. ఈ రోజు మొత్తం 16 కిలోమీటర్లు నడిచి కృష్ణాపురం శివారుకు చేరుకున్నాం.

ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రతి విషయాన్ని తన కంప్యూటర్‌ నుంచే తెలుసుకోగల నని చెబుతుంటారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆయనకు నాదొక ప్రశ్న. గత మూడున్నరేళ్ల పాలనలో మీరు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులైనా కల్పించగలిగారా? ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపునకు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? వివరించగలరా?
- వైఎస్‌ జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top